‘అన్న’తోడు.. అడ్డంగా ఏసేద్దామనుకున్నారా?
- Prasad Satyam
- 6 days ago
- 3 min read
పాలకొండలో ముదురుతున్న పార్టీ వ్యవహారం
రెండుగా విడిపోయిన ‘దేశం’ శ్రేణులు
నలిగిపోతున్న కార్యకర్తలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వచ్చే నెల చివరిలో శ్రీకాకుళంలో మహానాడు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో పార్టీకి ఇన్‌ఛార్జి లేకపోయినా స్వేచ్ఛగా ముందుకెళ్తుంటే.. మరో నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిని నియమించి, రోజూ ఆ పంచాయితీలు తీర్చలేక తలపట్టుకుంటోంది. 2024 ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటులో భాగంగా కూటమిలో భాగస్వామ్యమైన జనసేనకు ఓ కరడుగట్టిన తెలుగుదేశం అభ్యర్థిని వలస పంపడమే ఇందుకు మొదటి కారణమైతే, రెండు బలమైన నాయకుల గ్రూపులకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకరిని, ఇన్‌ఛార్జిగా ఒకరిని చేయడం పాలకొండ కార్యకర్తలకు శాపంగా మారింది. ఇది కేవలం ఆరోపణలకో, లేదూ ఎత్తుకు పైఎత్తు వేసినంత వరకో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ఏకంగా డిష్యుం డిష్యుం వరకు వెళ్లడం, ఆ పంచాయితీని తెలుగుదేశం పెద్దలు నిత్యం తీర్చాల్సిరావడం పెద్ద తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే..
పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జనసేన టిక్కెట్ మీద నిమ్మక జయకృష్ణ గెలిచారు. ఈ సీటును ఎస్టీ కోటాలో తెలుగుదేశం పార్టీ తరఫున పడాల భూదేవి ఆశించారు. పొత్తులో భాగంగా జయకృష్ణను జనసేనలోకి పంపి ఎమ్మెల్యే చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి భూదేవిని పాలకొండ తెలుగుదేశం ఇన్‌ఛార్జిగా నియమించారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించినా, టీడీపీకి కేటాయించినా తాను మాత్రమే అభ్యర్థిగా ఉండాలన్న కోరిక జయకృష్ణది. ఎందుకంటే ఆయన బోర్న్ టీడీపీ. అయితే పడాల భూదేవి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాబట్టి రాబోయే ఎన్నికల్లో పాలకొండ తెలుగుదేశం ఖాతాలో ఉంటే తనకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా సఖ్యత కుదరడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా పాలకొండ అన్న క్యాంటీన్‌లో ఉచితంగా భోజనాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పడాల భూదేవి చేతుల మీదుగా జరగాలి. కానీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్యక్రమం జరుగుతుండగానే అన్న క్యాంటీన్‌లో జయకృష్ణ మనుషులు అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు. తాము చేయాల్సిన కార్యక్రమం వేరేవారు చేయడమేమిటన్న కోణంలో ఇక్కడ ఇద్దరు నేతల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 12 అయినా కార్యక్రమాన్ని భూదేవి ముగించకపోవడం వల్ల తాము చేపట్టామని ఎమ్మెల్యే వర్గం చెబుతుంది. తాము బయల్దేరామని తెలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించేశారని భూదేవి వర్గం చెబుతుంది. చివరకు ఈ గొడవ అట్రాసిటీల వరకు వెళ్లింది. కేసు నమోదు కాలేదు కానీ రెండు వర్గాల్లోనూ దళిత మహిళలే ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు.
కట్ చేస్తే.. కొద్ది రోజుల క్రితం కీతంపేటలో అన్న క్యాంటీన్‌ను నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రాంతం భూదేవి సొంత మండలం. ఈ కార్యక్రమానికి అధికారిక హÃదాలో ఎమ్మెల్యే జయకృష్ణ వస్తారు. అదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా భూదేవి కూడా వస్తారని, సొంత మండలం కాబట్టి పెద్ద ఎత్తున ఆమె అనుచరులు కూడా రావచ్చనే సమాచారం ఉండటంతో జయకృష్ణ వర్గానికి చెందిన కొందరు సీతంపేట అన్న క్యాంటీన్ సాక్షిగా భూదేవి మనుషుల్ని గట్టిగా దరువేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు కూడా తెలియడంతో భూదేవి వర్గాన్ని ప్రారంభోత్సవానికి రాకూడదంటూ రిక్వస్ట్ చేసుకున్నారు. వస్తే పరిణామాలు చేయి దాటిపోతాయని, భూదేవి ఒక్కరే రావాలంటూ పోలీసులు కోరడంతో సీతంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి భూదేవి ఒక్కరే వచ్చారు. ఇదే విషయాన్ని పోలీస్ ఇంటెలిజెన్సీ జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి చెప్పడంతో ఆ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు వరకు ఈ విషయం వెళ్లింది. దీంతో అనవసర గొడవలు వద్దంటూ, భూదేవి ఒక్కరే వెళ్లాలని అచ్చెన్న సూచించినట్టు భోగట్టా. అదే సమయంలో కలెక్టర్‌ను కూడా వెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. ఆయన సమక్షంలోనే జయకృష్ణ వర్గానికి చెందిన కొందరు గొడవకు దిగడానికి కూడా ప్రయత్నించారని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు.
అయితే ‘మనకు కావాల్సిన వారు రాలేదు కాబట్టి.. మనలో మనకు గొడవలెందుకు?’ అంటూ వీరఘట్టంకు చెందిన ఒక తెలుగుదేశం నేత వ్యాఖ్యానించడంతో పోలీస్ ఇంటెలిజెన్సీకి వచ్చిన సమాచారం నిజమేనని తేలింది. పాలకొండ అన్న క్యాంటీన్‌లో మొదలైన గొడవను సీతంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పెద్దది చేయాలని, తద్వారా నియోజకవర్గంలో రెండు పార్టీలకు తానే నాయకుడ్ని అనే సందేశం పంపాలనేది జయకృష్ణ వ్యూహం. అయితే ఇందులో సగటు తెలుగుదేశం కార్యకర్త నలిగిపోతున్నాడు. పాలకొండ తెలుగుదేశం ఇప్పటికే మÖడుగా చీలిపోయింది. ఇందులో సీనియర్ కాపు నేతలు 2024 ఎన్నిక తర్వాత స్తబ్ధుగా మిగిలిపోగా, మిగిలినవారు కొందరు జయకృష్ణతోను, మరికొందరు భూదేవితోను ప్రయాణిస్తున్నారు. జయకృష్ణతో జనసేనతో పాటు తెలుగుదేశంలో కొందరు తిరుగుతుండటంతో వారితోనే ఇన్‌ఛార్జి మీద తిరుగుబాటు ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది.
పాలకొండ రూరల్ టీడీపీ అధ్యక్షుడు గండి రామినాయుడుతో పాటు కరడుగట్టిన తెలుగుదేశం వాదులు కొందరు భూదేవితో నడుస్తుంటే.. ఎమ్మెల్యేతో ఉదయం లేస్తే ఏదో ఒక పనుంటుంది కాబట్టి, ఆయనకు దూరంగా ఉండి లాభం లేదనుకుని కలిసి నడుస్తున్నవారు మరికొందరు. గండి రామినాయుడుకు పాలకొండ రూరల్‌లో పట్టువుంది. అందుకే పార్టీ వరుసగా ఆయన్ను అధ్యక్షుడ్ని చేస్తుంది. అయితే జయకృష్ణ ఈసారి ఆ స్థానానికి వేరేవ్యక్తిని ప్రపోజ్ చేశారు. కానీ పార్టీ పట్టించుకోలేదు. దీంతో గండి రామినాయుడు సొంతవూరు అంపిలిలోనే ఆయనకు తెలియకుండా పలువుర్ని ఎమ్మెల్యే జనసేనలో చేర్చుకున్నారు. విచిత్రమేమిటంటే.. వీరిలో చాలామంది వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్ప్పుడు రామినాయుడు మీద కేసులు పెట్టినవారే. గ్రామ సచివాలయ స్థాయిలో కూడా రామినాయుడు చెబితే పనులు జరగని పరిస్థితి ఉంది. దీంతో తమకూ ఇలాంటి పరిస్థితి రాకుండా కొందరు మండల స్థాయి నాయకులు జయకృష్ణతో తిరుగుతున్నారు. మరికొందరు తెలుగుదేశం పార్టీ సింబల్ పడాల భూదేవితో ఉంది కాబట్టి ఆమే తమ నాయకురాలని పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్నారు.
వాస్తవానికి ఇక్కడ పార్టీ ఇద్దర్నీ కూర్చోబెట్టి పరిస్థితిని చక్కదిద్దాలి. ఎందుకంటే.. జయకృష్ణ జనసేనలో ఉన్నా, ఇంకా తెలుగు తమ్ముడుగానే ఆ పార్టీ చూస్తుంది. ఎందుకంటే.. ఆయన స్వయంగా ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం తరఫున కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన కళా వెంకట్రావు మనిషి. ఇప్ప్పుడు కళా పక్క జిల్లా విజయనగరానికి వెళ్లినా ఆయన శిష్యుడు ఇక్కడ 2024 ఎన్నికలకు ముందునుంచి ఇదే తరహా రాజకీయాలను నడుపుతున్నారు. అదే సమయంలో మొదట్నుంచి కళాతో రాజకీయ వైరం ఉన్న కింజరాపు కుటుంబం అండదండలతో పడాల భూదేవి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా పార్వతీపురం మన్యం జిల్లాకు ఇన్‌ఛార్జి మినిస్టర్‌గా ఉన్నారు. ముందు వీరిద్దర ఒక అండర్‌స్టాండింగ్‌కు వస్తేగాని అక్కడ ఆ ఇద్దరూ ఒక తాటి మీదకు రావడం కుదరదు.






Comments