top of page

అన్ని పాత్రలూ ఆయన ‘కోటా’లోకే..!

  • Guest Writer
  • Jul 14
  • 5 min read
ree

‘గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో నేలమీద పడుకున్న పదిమంది పేషంట్స్‌లో ఒకడిగా పడుకోవాలి.. ఒకేనా’ అంటే.. ‘ఇదే సినిమాలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌గా పాత్ర ఇచ్చారు.. అప్పుడు అడగలేదే ఇలా’ అని అడిగారుట కోట శ్రీనివాసరావు. ఇది నటనకి ఆయనిచ్చే గౌరవం. ఇది పాత్రకి ఆయనిచ్చే మర్యాద. ‘గణేష్‌’ సినిమాలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌ సాంబశివుడు గుర్తున్నాడా.. గుండుకి విగ్గు, భయంకరంగా ఉండే కన్నుతో తెలంగాణా యాసలో సినిమా మొత్తాన్నీ చితక్కొట్టి వదిలిపెడతాడు. చూసే మనకి వీడు కనిపిస్తే చంపేయాలి అనేంత కసిని పెంచుతాడు.. ఇది కదా నటన అంటే. ప్రేక్షకులు ఇన్వాల్వ్‌ అయిపోయి ఇదంతా నటన, సినిమా అనేది, అది ఆ పాత్రధారి, చూసే ప్రేక్షకుడు మర్చిపోతే కరెక్ట్‌గా కనెక్ట్‌ అయినట్టు. గణేష్‌ సినిమాలో హెల్త్‌ మినిష్టర్‌ సాంబశివుడుగా అదిరే డైలాగ్స్‌ తనవి.. నేను యాభైకోట్ల కుంభకోణం చేసినా.. కాదంటలే... నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది మల్ల.. అంటాడు... నిజమే కోట హిస్టరీ మామూలుగా వుండదు... అసలు తమ్మీ.. అనే మాట ఎక్కడ విన్నా గుర్తుకి వచ్చేది కోట. ‘ఖండిస్తున్నా’.. గాయం సినిమాలో డైలాగ్‌ ఇప్పటికీ వినిపిస్తుంది. కోటలో నటనని ఈవీవీ సత్యనారాయణ చూపించిన విధానం హైలెట్‌.. విలనిజానికి పరాకాష్ట ‘ఆమె’ సినిమా. తన ప్రతిభకి వేలెత్తి విమర్శించే అవకాశం ఇవ్వని నటుడు. నలభై ఏళ్లపాటు అందర్నీ అలరించి విశ్రాంతి అనేసిన కోట శ్రీనివాసరావు. పద్మశ్రీ తాడి మట్టయ్యా.. సెలవయ్యా??

ఎంతోమందికి ఇష్టమైన కోట గారు ఇవాళ చనిపోయారని తెలిసి ఏం బాధపడటం లేదు. ఆయన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణమే ఇది. నిన్నటి తరం వాళ్ళలో ఆయన ఎంతమందికి ఫేవరేట్‌ యాక్టరో తెలీదు. మనకు మాత్రం చాలా చాలా ఇష్టం. ఒక నటుడిగానే కాదు, ఒక తెలుగు భాషా, ప్రాంతీయ అభిమానిగా కూడా ఇష్టం. చిన్న చిన్న విలన్‌ పాత్రల కోసమే, కాకుండా పెద్ద పెద్ద పాత్రల కోసం కూడా పరభాషా (ముఖ్యంగా హిందీ) నటులను వాడటం ఆయన వ్యతిరేకించారు. ఏదో సినిమాలో యముడి పాత్రలో ఓ తెలుగురాని (షాయాజీ షిండే) నటుడిని పెట్టడం లాంటివి ఆయనకు ఎంతో కోపం తెప్పించేవి. తెలుగు రావడం అంటే మాట్లాడడం వస్తే సరిపోదు కదా, యముడు అంటే తెలుగువారికి పేటెంట్‌ ఉన్న పాత్ర లాంటిది. అలా అని ఆయనకి పరభాషా నటులు అంటే ద్వేషమో, అసూయో కాదు. ‘మీరు తీసుకొస్తే ఓ ఓం పూరీని తీసుకురండి, ఓ నసీరుద్దీన్‌ షా, ఓ నానా పటేకర్‌ని తీసుకురండి. వాళ్ళ దగ్గర నౌకరు వేషం వెయ్యడానికి కూడా నేను సిద్ధం’ అన్న గొప్ప మనిషి. అలాగే మాండలికాలను ఆయన పలికినంత చక్కగా ఇంకెవరూ పలకలేరు. లేదా, తనికెళ్ల భరణి గారికి ఎక్స్‌పెషన్‌ ఇవ్వొచ్చు. తెలంగాణా మాండలికాన్ని మొదటగా విన్నది ఆయన నోటివెంటే, ఇప్పుడు ఆన్‌గోయింగ్‌ తెలంగాణా మాండలికం క్రేజ్‌ను కొంతమంది ఆంధ్రా ప్రాంతపు నటులు క్యాష్‌ చేసుకుందామని ప్రయత్నించి దారుణంగా ఫెయిల్‌ అవుతున్నారు. ‘క’కి బదులు ‘గ’ పలికితే అదే తెలంగాణా అనుకుంటున్నారు. దానికి ఓ సాధన కావాలి, పాత్ర పట్ల ఓ కన్విక్షన్‌ ఉండాలి. అవి రెండూ ఉన్న నటుడు కోట గారు.

పరమ దారుణ కర్కోటక నీచ నికృష్ట పాత్రలోనూ, కరుణరస పూరిత దయాహృదయుడిగానూ ఒకే రకమైన కమిట్మెంట్‌తో నటిస్తారు. రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన మనిషి కదా..

ఇక ఆయన కామెడీ చేస్తే మనం తట్టుకోలేం, హలోబ్రదర్స్‌ సినిమాలో ఒకవైపు మల్లికార్జునరావు గారితో కలిసి కామెడీ చేస్తూనే, క్లైమాక్స్‌కి ముందు ఆయన పండిరచిన నటన కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. వ్యక్తిగతంగా ఆయన్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకునే పాత్ర అత్తారింటికి దారేదిలో సిద్ధప్ప నాయుడు. నెల్లూరు స్లాంగ్‌లో ఇరగదీస్తారు.

ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన కురిసినట్టేనా.. అని హీరోని ఛాలెంజ్‌ చెయ్యడం దగ్గర్నుంచి.

నా కూతురు పెళ్లికి వొండిన పల్లావు వాసన పదూళ్ళకు తగాలాలనుకున్యా.. ఇప్పుడు ఈ విషయం నూరూళ్ళకి తెలిసింది... ఈడి బాబు కట్నం దొబ్బే.. ఈడు నన్ను దొబ్బే..

నా బతుకు దూది కంటే చులకనా..

నీటి కంటే పలచనా అయిపోయిండ్లా...

సెలవు కోట గారు. మీ సినిమాలు చూస్తూ పెరగడం మా అదృష్టం. మిమ్మల్ని కలవలేకపోవడం మా దురదృష్టం.


విలక్షణ నటనకు అతనో పెట్టని కోట!

తెలుగు సినిమాలో వచ్చిన ప్రతిభావంతమైన నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు. ఎస్‌.వీ.రంగారావు తర్వాత ఆ తరహా మోల్డ్‌ ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు.

ఏం చేస్తున్నా, ఎంత చేస్తున్నా ‘అతి’లోకి పడిపోకుండా ఉండడం తెలిసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. (మన బ్రహ్మానందం, తమిళ్‌లో వడివేలు ఈ ఇద్దరూ కూడా ఈ కోవలోని నటులు). రజనీకాంత్‌ బహిరంగంగానే కోట ప్రతిభను కొనియాడారు.

గణేశ్‌ సినిమాలో కోట నటన అత్యంత గొప్పగా ఉంటుంది. ప్రతిఘటన సినిమాలో ఆయన నటన అందరినీ ఆకర్షించింది. ప్రతిఘటన తమిళ్ష్‌లో డబ్బై విజయవంతమైనప్పుడు తమిళులు కూడా కోటను మెచ్చుకున్నారు.

పెర్ఫామెన్స్‌ అన్నదానికి ఒక ఎపిటోమ్‌ కోట శ్రీనివాసరావు.

నటించడం కన్నా ముందు ఆ నటనపై సరైన దృక్పథం ఉండాలి.. ఎలా నటించాలి అన్నదానిపై స్వకీయమైన ప్రణాళిక ఉండాలి. దిలీప్‌ కుమార్‌, ఎన్‌.టీ.రామారావు, ఎస్‌.వీ.రంగారావు, కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌ లాల్‌ వంటి నటులకు ఆ ప్రణాళిక ఉంటుంది. మన కోటకు కూడా ఆ ప్రణాళిక ఉంది. డిజైన్స్‌ పెర్ఫామెన్స్‌ కోట శ్రీనినాస్‌ది. అభినయం, ఆంగికం, వాచికం ఈ మూడిరటా కోట ఒక ఆరింద.

ఎన్నో పాత్రల్లో గొప్పగా నటించారు కోట. తన తెలుగు నటనతో ఇతరుల చేత కూడా ప్రస్తుతించబడ్డారు కోట.

కోట శ్రీనివాసరావు ఒక కల్ట్‌ యాక్టర్‌. తెలుగు సినిమా ద్వారా వచ్చిన అరుదైన కల్ట్‌ యాక్టర్‌ కోట శ్రీనివాసరావు. దుష్ట, హాస్య పాత్రల పరంగా కోట శ్రీనివాసరావు కల్ట్‌ భారతదేశంలో మరో భాష సినిమాలో లేదు.

కోట శ్రీనివాస్‌ పేరుపై ఒక ప్రభుత్వ పురస్కారం అమలు చెయ్యడం సమంజసంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు కార్యాచరణ చెయ్యాలి.

కోట శ్రీనివాసరావుకు స్మృత్యంజలి.

ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా

ప్రముఖులు ఎవరైనా మరణిస్తే.. తమ జ్ఞాపకాల్ని షేర్‌ చేసుకుంటూ సంతాపం ప్రకటిస్తారు కొందరు.. మరణించిన వ్యక్తి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ సంతాప ప్రకటనలు జారీ చేస్తారు ఇంకొందరు.. వీలైనంతవరకూ నెగెటివ్‌ ఇష్యూస్‌ పెద్దగా ప్రస్తావనకు రావు.

కోట శ్రీనివాసరావు నిస్పందేహంగా టాలీవుడ్‌ అందించిన గొప్ప నటుడు. నవ్వించాడు, ఏడిపించాడు, భయపెట్టాడు.. అన్ని ఉద్వేగాలను పర్‌ఫెక్ట్‌గా ప్రదర్శించేవాడు. 750 సినిమాలు, సుదీర్ఘమైన కెరీర్‌.. ఎవరెవరో పరభాష విలన్లను, కేరక్టర్‌ ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారే తప్ప, సొంత ఆర్టిస్టులను పట్టించుకోవడం లేదనే బాధ కూడా ఉండేది తనకు కొన్నాళ్లు.

ఆయన నటనకు పెద్ద ప్లస్‌ తన డిక్షన్‌.., తెలుగు పదాల ఉచ్చరణ తీరే సగం ఉద్వేగాన్ని పలికించేది.. అది ఏ వేషమైనా సరే.. కానీ ఈ సందర్భంగా ఓ చిన్న విషయమూ గుర్తుకు తెచ్చుకోవాలి, యాంటీ సెంటిమెంట్‌ అయినా సరే, అది బాధ కలిగించే సంగతి కాబట్టి.. తను జీవితంలో ఎదుర్కొన్న పెద్ద అవమానం, తనను బాగా బాధపెట్టిన సందర్భం కాబట్టి..

ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక సూపర్‌ స్టార్‌ కృష్ణ, మండలాధీశుడు అనే సినిమా చేశారు. అందులో కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ను అనుకరించే పాత్రలో నటించాడు, అందువల్ల ఎన్టీఆర్‌ అభిమానుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట కోట శ్రీనివాసరావు. ఆ మూవీ చేసిన కొన్ని రోజులకు కోట శ్రీనివాసరావు రాజమండ్రి షూటింగ్‌కి వెళ్లగా అక్కడ వేరే షూటింగ్‌ నిమిత్తం బాలకృష్ణ కూడా వచ్చాడట. ఇద్దరూ ఒకేచోట బస చేయగా, ఆయన లిఫ్ట్‌లో పై నుంచి కిందకు వస్తుంటే తాను కింద నుంచి పైకి వెళ్ళేందుకు లిఫ్ట్‌ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ వాళ్ళందరూ కోట శ్రీనివాసరావుని తప్పుకోండి తప్పుకోండి అన్నారట.

ముందు ఆయనకు ఎందుకో అర్థం కాలేదట. అయితే బాలకృష్ణ లిఫ్ట్‌లో నుంచి దిగుతుండగా చూసిన కోట శ్రీనివాసరావు బాలకృష్ణకి నమస్కారం పెడితే బాలకృష్ణ.. కోట శ్రీనివాసరావు ముఖం మీద కాండ్రిరచి ఉమ్మేసాడట.

ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక సూపర్‌స్టార్‌ కొడుకు తన తండ్రిని తిడితే ఎలా ప్రవర్తిస్తాడో బాలకృష్ణ అలాగే ప్రవర్తించాడు అని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడంటే తాను ఒక గొప్ప నటుడిని అని బాలకృష్ణ కూడా అంటున్నారనీ కానీ, ఒకప్పుడు మాత్రం ఇలా ఆయన చేతిలో అవమానం పొందానని కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడిరచాడు.

ఇందులో కొన్ని అంశాలు.. సౌత్‌ ఇండస్ట్రీ హీరోలకు ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు ఎలా అణిగిమణిగి ఉండాలో చెప్పే ఓ ఆధిపత్య వాతావరణం.. నా బ్లడ్డు నా బ్రీడు అనే బాలకృష్ణ వంటి నటుల అహం.. ఓ సీనియర్‌ నటుడిని కేవలం తన తండ్రిని పోలే ఓ కేరక్టర్‌ వేశాడని థూత్కరించడం, ఆ సీన్‌ ఊహిస్తేనే అదోలా ఉంటుంది..

కోట శ్రీనివాసరావు చేసిన తప్పేముంది..? తను ఆర్టిస్టు.. తనకు వచ్చిన పాత్ర అది. ఐనా వార్త గానీ, విశ్లేషణ గానీ, కార్టూన్‌ గానీ, సినిమా గానీ.. ఓ పొలిటికల్‌ సెటైర్‌ తప్పెలా అవుతుంది..? అదీ అర్థం చేసుకునే స్థితి లేదు ఆనాడు. ఒక్కసారి ఆర్జీవీ చేసిన పొలిటికల్‌ సినిమాలు గుర్తుతెచ్చుకొండి. ఆ పాత్ర చేస్తే అది ఎన్టీయార్‌ పట్ల గానీ, ఆ పార్టీ పట్ల గానీ ఆ పాత్రధారి ద్వేషంగా, వ్యక్తిగత ఉద్దేశంగా ఎలా పరిగణిస్తారు..? అప్పట్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ అదేకాదు, మరికొన్ని సినిమాలూ తీశాడు ఎన్టీయార్‌ పాలన మీద సెటైర్లు, విమర్శలు.. ఆ మండలాధీశుడు సినిమాలో రామోజీరావు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తు. ఒక్క కోట మాత్రమే, అదీ ఎన్టీయార్‌ వేషం వేశాడు కాబట్టి టార్గెట్‌ అయ్యాడు. ఓ దశలో దాడి ప్రయత్నాలూ జరుగుతాయని తను భయపడ్డాడంటారు.

నిజం.. కోట శ్రీనివాసరావు ఒక వర్గం తీవ్ర ద్వేషాన్ని, ఘోర అవమానాల్ని భరించాడు. ఆ రేంజ్‌ అవమానం ఎదుర్కొన్న మరో తెలుగు నటుడు లేడేమో, ఉండరేమో.. నిందల్ని తుడిచేసుకుని, అలాగే స్థిరంగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు..

నోటుకూ, జేబుకూ మధ్యనున్న బంధం లాంటిది.. పిసినారిగా కోట పరకాయ ప్రవేశం!

ఎస్వీఆర్‌, కైకాల స్థాయి నటులు.. ఆ మహానటులిద్దర్నీ చిన్నబుచ్చడం కాదుగానీ.. ఈయన వాళ్ళకంటే ఇంకొక్క అడుగు ముందుకేసి తెలుగులో అన్ని యాసలనీ పట్టుకోవడమేగాక, వేరెవరూ ఈయనంత సమర్ధవంతంగా పట్టుకోలేరని పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు..

మా తరం చూసిన నటుల్లో తెలుగుతెరకు లభించిన గొప్ప వరం కోట శ్రీనివాసరావుగారంటే ఏమాత్రం సందేహం అక్కర్లేదు..

తెర మీద చూస్తే మనింట్లో వ్యక్తి ప్రవర్తిస్తున్నట్టో లేక మనతో మాట్లాడుతున్నట్టో ఉంటుంది తప్ప నటిస్తున్నట్టుండదు..

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్లో మోకాళ్ళ దాకా నిక్కరేసుకుని ఊరూరా తిరిగే ఎల్ల పాపారావు ర్రే...య్‌.. అంటూ అదిలిస్తుంటే మనకెందుకో కితకితలు పెట్టినట్టు ఉండదా..??

యాండే..య్‌ అని ఎటకారంగా పంచులేసే పెద్దమనిషిని జూస్తే అమ్మహా కంకహా ఐపోదా..??

ఈడెవండీ బాబో అంటూ నోట్లో చుట్టతో నెత్తిమీద చేతులేసుకుని విసుక్కునే శత్రువు, కళకి, కలకి తేడా చెప్పే ‘సురభి’ సుబ్రహ్మణ్యం గారు, మహేష్తో బేరాలాడే బాజిరెడ్డి, ఇడియట్‌ చంటిగాడి భవిష్యత్‌ కోసం కన్నీళ్లు పెట్టుకునే తండ్రి వెంకటస్వామి, మామగారు సినిమాలో బావమరిదితో బయటకి గెంటించుకుని అరుగు మీద సెటిలయ్యి బిచ్చగాడితో పొద్దుపుచ్చే మామగారు పోతురాజు, (కోట - బాబూమోహన్‌... ఏం కాంబినేషనండీ! పాయా వంగడం, కోట కిక్కడం - మనం ఫక్కుమనడం..) ముఠా తగాదాలకి కారణమయ్యే గాయం గురునారాయణ్‌, జనాలు పెద్దగా గుర్తించని పంజరంలో విలను.. వీళ్లంతా ఎవరు బాబూ ఎవరూ..?? కోట గారే కదండే..

ఇయ్యన్నీ పక్కనబెడదామండీ..

వెంకటేష్‌ నటించిన గణేష్‌లో ఆరోగ్యశాఖ మంత్రి సాంబశివుడులా భయపెట్టినా.. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేలో అదే గణేష్‌ అనబడే వెంకటేష్‌కి తండ్రిలా ఏడిపించినా అది కోటగారే కదా.. సత్యంలో ఒద్దికైన అంకిత, బొమ్మరిల్లు అల్లరి హాసిని రెండూ జెన్నీయే.. ఒప్పుకుంటాం.. కాని ఇద్దరికీ బాధ్యతాయుతమైన తండ్రి కోటనే..!!

ఇక అసలు సిసలువైన డబ్బే పరమావధిగా బతికే ఆ నలుగురు కోటయ్య, కోడల్ని వేధించే పిసినారి ‘ఆమె’ మామ శ్రీనివాసరావు, ఇక ఎవర్‌గ్రీన్‌ అహనా పెళ్ళంట పీనాసి లక్ష్మీపతి..

ఇయ్యన్నీ ఏంటి మేష్టారూ.. మిమ్మల్నే..!!

అసలు ఆ మాటకొస్తే పిసినారి పాత్రలకి, కోటగారికి ఉన్న సంబంధం నోటుకి, జేబుకి మధ్య సంబంధం లాంటిది.. రెండూ కలిస్తే ఆ పాత్ర లెవలే వేరూ..!! ఈ పాత్రల్ని కోటగారితో వేయించిన జంధ్యాల గారి తర్వాత కోడిరామకృష్ణగారు, ఈవీవీగారు వాడుకున్నట్టు ఇంకెవరూ వాడుకోలేదేమో అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లని చూస్తే.. కానీ ఆయా దర్శకులు తెలుగుతెరని తొందరగా వదిలెళ్లిపోవడం కోటగారి స్టైల్లోనే చెప్పాలంటే ‘ఏం చేస్తాం.. బ్యాడ్‌ టైం..!!’

ఇన్ని కాదండే.. సినిమా ఏదైనా సీన్‌ ఏదైనా దర్శకుడెవరైనా గానీ.. రౌద్రం, ఆవేశం, హాస్యం, మందహాసం, మానవత్వం, పెద్దరికం, పేథాసు ఏదైనా సరే అవలీలగా పలికించేస్తారు కాబట్టే కోటలాంటి కీర్తి మాత్రం ‘కోట’గట్టుకుని కూర్చుంది..

ఒక్కముక్కలో జెప్పాలంటే.. వి..ల..క్ష..ణం అనే మాట గనుక ఇస్త్రీ చొక్కా తొడుక్కుని, పంచె కట్టుకొస్తే ఎలా ఉంటుందో అదీ కోటగారు..!! ఆఖరిగా, ఆయన ట్రేడ్‌ మార్క్‌ నవ్వుని మనకి మిగిల్చి వెళ్ళిపోయిన కోటగారికి ఘననివాళులతో..??

ముచ్చట సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page