అన్నగారి ఆహార్యాన్నే మార్చేసిన విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు..
- SATYAM DAILY
- 1 day ago
- 2 min read

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు గారి పౌరాణిక, చారిత్రక పాత్రల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ టెయిలర్ వాలేశ్వరరావు. విజయవాడ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ‘యాక్స్’ టైలరింగ్ సంస్థ ద్వారా ఆయన అగ్ర హీరోల కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌లో ప్రత్యేక చరిత్ర సృష్టించారు.
యాభై ఏళ్ళ వయస్సులో రామారావు గారికి కొత్త ఇమేజి రూపకల్పనలో వాలేశ్వరరావు అనే యువ టైలర్ కూడా తన వంతు పాత్ర పోషించారు.
ఆయన బొంబాయి, బెంగళూరు నగరాల్లో టైలరింగ్ నేర్చుకున్నాడు. 1973లో తన 20వ ఏట విజయవాడలో యాక్స్ అండ్ యాక్స్ టైలర్స్ పేరుతో చిన్న షాపు తెరిచాడు. కొద్దికాలంలోనే మంచి టైలర్ అని పేరు గడించాడు. ఆయన ఖాతాదారుల్లో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ కూడా ఒకరు.
ఒకరోజున అశ్వినీదత్ ఆయనతో రామారావు గారికి దుస్తులు డిజైన్ చేయమని అడిగారు. సినిమా నటులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంటే నాకు కుతూహలంగా ఉంది. కాకపోతే రామారావు గారి వంటి ప్రసిద్ధ నటునికి దుస్తులు డిజైన్ చేసే అవకాశం అందరికీ రాదు. ఆ అదృష్టం నాకు దక్కింది అన్నారు వాలేశ్వరరావు. ఆ మరునాడు ఆయన మద్రాసులోని రామారావు గారి బంగళాకు వెళ్లి కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకుంటున్నప్పుడు నా చేతులు వణికాయి అన్నారాయన.
అక్కడి నుంచి తిరిగి విజయవాడకు వచ్చేశారు. తెరపై ఎన్నోసార్లు చూసిన అనుభవంతో ఎలాంటి దుస్తులు ట్రెండీగా ఉంటాయో, ఏ డిజైన్లు రామారావు గారికి సరిపోతాయో ఆయనకు తెలుసు. బెల్ బాటమ్ ప్యాంట్లు, చొక్కాలకు, బాబీ కాలర్స్ ఆయనకు బాగుంటాయని నా వూహ. కొన్ని దుస్తులు డిజైన్ చేసి కుట్టి మద్రాస్ తీసుకువెళ్లి రామారావు గారికి అప్పగించాను. ఊపిరి బిగబట్టుకుని నేను చూస్తుండగా కొత్త కాస్ట్యూమ్స్ ధరించి రామారావు గారు వచ్చారు.
యంగ్ మాన్, నా రాబోయే సినిమాలకు మీరే నా కాస్ట్యూమ్ డిజైనర్ అని ప్రకటించారు. ఆ మాటతో నాకు కాళ్ళు నేలపై నిలబడలేదు. ఇది కల కాదు కదా అనుకున్నాను. యన్టీఆర్ మహానుభావుడు. ఆయన నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆ తరువాత ఆయన నటించిన 28 సినిమాలకు నేనే కాస్ట్యూం డిజైనర్ని. టైలర్ నా పేరు ఆంధ్రదేశమంతా మారుమోగిపోయింది అని వాలేశ్వరరావు సగర్వంగా చెప్పారు. కాస్ట్యూం డిజైనర్‌గా సింగిల్ టైటిల్ కార్డు వాలేశ్వరరావుతోనే ప్రారంభమయింది.
యాక్స్ అండ్ యాక్స్ ఒక బ్రాండు అయ్యింది. చిన్న చిన్న టౌన్లలో కూడా ఆ పేరుతో ట్రైలర్ ఫ్రాంచైస్ దుకాణాలు వెలిశాయి. యువతరం యన్టీఆర్ డ్రస్ డిజైన్లను అనుసరించారు. కాలేజీ కుర్రవాళ్ళు ఆయన సినిమాలో వేసుకునే బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్దపెద్ద కాలర్ల షర్టులు, జాకెట్లు, సఫారి సూట్లు ధరించడం మొదలుపెట్టారు. యాభై ఏళ్ళ వయసులో యన్టీఆర్ ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు.






Comments