top of page

‘ బొబ్బిలిపులి ’ గర్జన... సెన్సార్‌పై నెగ్గిన విశ్వరూపం!

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 1 day ago
  • 3 min read
  • ఎన్టీఆర్ క్లాసిక్ వెనుక అసలు కథ!

  • కోర్టు బోనులో గర్జన... బాక్సాఫీస్ వద్ద సునామీ:

  • 38 ఏళ్ల ‘బొబ్బిలిపులి’ జ్ఞాపకాలు

‘మీ అసలు పేరు’ ‘బొబ్బిలిపులి’.. ‘మీ తల్లిదండ్రులు పెట్టినపేరు’.. ‘బొబ్బిలిపులి బొబ్బిలిపులి బొబ్బిలిపులి...ఎన్నిసార్లు చెప్పమంటారు?’ జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు. జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను. జ్ఞాపకం వచ్చిందా కోర్టు బోనులో గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి. ఎస్... బొబ్బిలిపులికి 38 ఏళ్లు వచ్చాయి.కానీ... నేటికీ దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు.దాని గాండ్రింపుల ప్రతిధ్వని మాసిపోలేదు. ఆ ఠీవీ.. ఆ దర్పం.. ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ...

క్లయిమాక్స్ సీన్.

బొబ్బిలిపులి: నాకీ ఉరిశిక్ష ఎందుకు విధించారు?

జడ్జి: మనుషుల్ని చంపినందుకు.

బొబ్బిలిపులి: ఓ... మనుషుల్ని చంపితే ఉరిశిక్ష విధిస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కణ్ణి సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపాను. అంటే హత్య చేశాను. మరిదానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని మహావీరచక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? ఆరోజు యుద్ధంలో నేను చంపినవాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లు మనకు సంబంధం లేనివాళ్లు. మన పొరుగువాళ్లు. మన తోటి సోదరులు. మనమెలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్లామో వాళ్లు కూడా అలా వాళ్ల దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చినవాళ్లు. వాళ్లని చంపితే సన్మానం. సత్కారం. మహావీర బిరుద ప్రదానం. మరి మనవాళ్లు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాన్ని రక్షించే స్థావరాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. ఆహా... యువరానర్. నాకిచ్చిన మహావీరచక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే... నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు యువరానర్... ఇప్పుడు... ఇప్పుడు నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్లు మన దేశానికే శత్రువులు. వీళ్లు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్లు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు. వీళ్లు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్లలో నిజాయితీ ఉంది. వీళ్లలో కుట్ర. కుళ్లు. కుతంత్రం. వాళ్లను చంపితే సన్మానం. సత్కారం. వీళ్లను చంపితే ఉరిశిక్ష. భేష్... భేష్... ఇదే మీ చట్టమైతే మీకూ మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకూ మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మమైతే మీకూ మీ ధర్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. దట్సాల్!

సెన్సార్‌బోర్డ్ రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. చైర్మన్ సీటులో ఎల్వీ ప్రసాద్ కూచుని ఉన్నారు. ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి. నిర్మాత వడ్డే రమేష్.అంతకు ముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది. మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది. మూడు వేల అడుగులు! అంటే సినిమా మిగలదు. ఎన్టీఆర్ మిగలడు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులూ మిగలవు. డైలాగులు ఎవరిక్కావాలి. సెంట్రల్‌లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి. కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ. దీని మీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి, వడ్డే రమేష్.

ఎల్వీ ప్రసాద్ సినిమా చూశారు.వాళ్లను పిలిచారు. ఇక తీర్పు చెప్పాలి. ‘ఏం లేదు. పాత కట్స్ మర్చిపోండి. ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నాను. క్లయిమాక్స్ మొత్తం తీసేయండి’ ఆయన చేతిలోని పేపర్ వెయిట్ - పరిచిన న్యూస్‌పేపర్ మీద - నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి, మెల్లగా అతి మెల్లగా ఆగింది. కాని దాసరి, రమేష్‌ల గుండెలు మాత్రం అంతకంతకూ వేగం పుంజుకొని ధన్‌ధన్ అని కొట్టుకుంటున్నాయి.

‘సార్ ’ అన్నారు ఇద్దరూ.

‘మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్ ’ అన్నారు మళ్లీ.‘ఏం ధైర్యం. రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా? క్లయిమాక్స్ తీసేయండి. అంతే.’ వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు.‘ఏం నిర్ణయించుకున్నారు?’ అడిగారు ఎల్వీ ప్రసాద్. దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు. అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది. ఎన్టీఆర్‌కు కోర్టు సీన్ చదివి వినిపించిన మాడ్యులేషన్‌లోనే ఎల్వీ ప్రసాద్‌తో చెప్పారు - ‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటుంది కనుకనే మేం ఢిల్లీ ట్రిబ్యునల్‌లో తేల్చుకుంటాం యువరానర్ . ఇదంతా ఎప్పుడు బయటపడాలి? ఎప్పుడు ప్రొజెక్టర్లకు ఎక్కాలి?

సినిమా రిలీజ్‌కు ప్రతిబంధకాలు ఏర్పాడ్డాయి అని తెలిసిన వెంటనే ప్రభాకరరెడ్డి రంగంలో దిగారు. ఎందుకంటే ఆయన వడ్డే రమేష్‌కు ఆప్తుడు. అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం. దీనికి అపకారం జరక్కూడదు.వడ్డే రమేష్‌తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే ‘సమ్మతి తయారీ’. ‘బొబ్బిలిపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి’ అనుకున్నాడాయన.మొదట తెలుగు తమిళ ఐఏఎస్‌లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు. వాళ్లకు సినిమా చూపించాడు. ‘బాగుంది. ఎన్టీఆర్ మహానుభావుడు. ఈ సినిమాకు కట్స్ ఎందుకు’ అన్నారందరూ.ఆ తర్వాత పి.వి.నరసింహారావు, పెండెకంటి వెంకట సుబ్బయ్య, జనరల్ కృష్ణారావు, అప్పటి డెప్యూటీ సిఎం జగన్నాథరావు వీళ్లందరినీ జత చేసి మళ్లీ షో వేశాడు. వాళ్లు చూసి ‘నీకెందుకు మేం చూసుకుంటాం’ అని రమేష్‌కు హామీ ఇచ్చారు.

దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే. ఆ తర్వాత రమేష్, ప్రభాకర రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు. ‘మీరు వెంటనే రండి. ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజైపోతుంది’‘ఎవరాయన?’ ‘మన తెలుగువాడే. నీలం సంజీవరెడ్డి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు. నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌లో సినిమా చూశారు. రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సొరుగుల్లోకి నిష్క్రమించాయి.

జూలై 9, 1982న బొబ్బిలిపులి రిలీజయ్యింది.

ఏనుగు కుంభస్థలాన్ని కొడితే- అది పెద్దపులి.

కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే- అది బొబ్బిలిపులి.

చాలాచోట్ల రేయింబవళ్లు షోస్ వేశారు.

చిన్న చిన్న ఊళ్లల్లో కూడా రెండు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చాలాచోట్ల వందరోజులు, నూట డెబ్బయ్ అయిదు రోజులు ఆడింది. చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్న కారో పెద్ద మేడో సంపాదించుకున్నారు.బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ని హీరో నుంచి నాయకుడిగా రీచార్జ్ చేసింది. ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది.

పరిత్రాణాయ సాధూనాం...

వినాశాయచ దుష్కృతాం....

దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నీరసించినప్పుడల్లా భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా రీచార్జ్ చేస్తూనే ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page