అప్పుడే నీకు 70 యేళ్ళా!?..
- Guest Writer
- 2 days ago
- 2 min read

చాల్లే ఊరుకో అన్నయ్య వయసెందుకు ఎక్కువ చెప్పుకుంటావ్!?
ఓలెక్కన చూస్తే నువ్వు నాకంటే చిన్నోడివే.. ఎలా అంటావా.. నా నాలుగోయేట ‘‘మనవూరి పాండవుల్లో’’ ఒక్కడిగా పుట్టావ్..మరి ఆ లెక్కల్లో చూస్తే నాకన్నా చిన్నోడివేగా!? ఏదో నీతోపాటుగా నీ పేరునీ తీసుకెళ్ళి ఎవరెస్టంత ఎత్తులో ఉంచావని ‘‘అన్నయ్య’’ అంటున్నాం కానీ మాతో కలసి నడిచిన మా ‘‘శివ శంఖర వరప్రసాదువి’’ కాదేంటి నువ్వు.. మనిద్దరి మజిలీ లో తీపిగుర్తులు ఎన్నని గుర్తుచేసుకోను చెప్పు!?
నేను బడిలోకి వెళ్ళేప్పుడు ‘‘పున్నమి నాగు’’ వై ఎదురొచ్చిన నువ్వు, నాలుగేళ్ళ నీ తెర వయసుకే మా అందరి గుండెల్లో ‘‘ఖైది’వైపోయావు’’ ?? నేను పదకొండో యేటికొచ్చే సరికి నువ్వు వెండితెరపై వెలగడం కోసం ‘‘రా..క్ష..-సు..డు’’లా పనిచేస్తుంటే.. వీడేంటి మనల్ని మెప్పించడం కోసం ‘‘కి..రా..త..కు..డు’’లా ఇంత కష్టపడుతున్నాడు అనుకొనేవాళ్ళం మన ఈడువాళ్ళలందరం ??
నీకు గుర్తుందో లేదో 90’ల్లో వచ్చిన వరదలకి ఊళ్ళన్నీ నీళ్ళతో నిండిపోతే మేమందరం కలసి నీ ‘‘జగదేకవీరుడు అతిలోక సందరి’’ సినమా చూడటంలో మునిగిపోయాం. నిజంగా అప్పుడు కురిసిన వర్షం. నన్ను ముంచేస్తుందేమో అని మన అశ్వనీదత్ భయపడితే ‘‘కాసుల వర్షమై’’ ‘‘వైజయంతి’’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తులో ఎగరేసింది. 91’లో మా ‘‘గ్యాంగ్ లీడర్’’ గా ఉన్న నువ్వు..
నీ ‘‘రౌడీ అల్లుడు’’ సినిమాకి రమ్మని అక్కడే నా మేనత్త కూతురైన
నా ‘‘రాధ’’తో ప్రేమలో పడేలా చేసావు. 95’ల్లో నేను పెళ్ళిచేసుకొని
మా అత్తింటోళ్ళందర్నీ నీ దగ్గరకు తీసుకొస్తే ‘‘అల్లుడా మజాకా’’ అన్నావు చూడు.. అప్పట్నుండి ‘‘మా ఊరి దేవుడు అందాల రాముడు’’ అంటూ ప్రతీ శ్రీరామ నవమికీ నీ పాటే రాములోరి గుళ్ళో వేయించడం మొదలెట్టేసాం ??
99’లో నాకు కొడుకు పుడితే నీ ‘‘స్నేహం కోసం’’ నేను రాలేదు, నీ కొడుకు, నేను ‘‘ఇద్దరు మిత్రులం’’ అన్నావు నువ్వు.. కొంచెం పెరిగి వాడికి మాటలొచ్చాకా నిన్ను చూసి వాడుకూడా నిన్ను ‘‘అన్నయ్య’’ అంటుంటే నన్ను వదిలేసి నువ్వు వాడివెంట పడుతున్నావేంటి అని నాకు అసూయ వచ్చేయడం మొదలయ్యింది. వాడితో ఆగిందనుకున్నావా!? నాకు 2001’లో పాప పుట్టింది. ‘‘డాడీ’’ అంటూ నువ్వొచ్చి ఆడపిల్లని ఎంత అపురూపంగా పెంచాలో నేర్పించావు. 22’లో నా కూతురు పెళ్ళికి ‘‘గాడ్ ఫాదర్’’లా వచ్చావు.. రేపు నా కొడుకు పెళ్ళికి ఏ పేరుతో వస్తావో ఏంటో మరి!?
ఇలా ఒకటా రెండా!? ఎన్ని అనుభూతులని చెప్పను.. నీతో కలసి సాగిన నా ప్రయాణంలో!? ‘‘స్వయంకృషి’’తో నువ్వు ఎదుగుతుంటే నిన్ను ‘‘ఆరాధన’’ గా చూస్తూ నీవెంట మేం నడిచేవాళ్ళం ?
‘‘మాస్టర్’’వై నువ్వు సమాజంలో ప్రజలకు రక్తదానం, నేత్రదానం చెయ్యమంటే
‘‘ఛాలెంజ్’’గా తీసుకొని ఈరోజుకీ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడంలో నీవెంటే మేము నడుస్తున్నాం. కరోనా ప్రపంచాన్ని కాటేస్తున్న సమయంలో ఇంటి నాలుగుగోడల మధ్య చిక్కుకుపోయి భత్యం పెట్టే జీతం లేక నీ సినీ కార్మికులు దైన్యస్థితిలో ఉంటే వాళ్ళ ఆకలి తీర్చడాని ముందడుగేసిన ‘‘ఆపద్భాంధవుడు’’వు నువ్వు. ఎవ్వరు ఏమనుకున్నా స్వర్గం ‘‘ఇంద్ర’’ దేవుడిదైతే ఇక్కడి వెండితెర మాత్రం నీదే అన్నయ్య.
కవ్వించడం, నవ్వించడం, ప్రేమించడం, ఏడ్పించడం, కష్టమొస్తే నిలబడటం, ఓదార్చడం, లాలించడం, పాలించడం, అన్నీ మాకు నేర్పించిన నువ్వు నీ ముందు నిలబడి మాట్లాడడానికి సరిపోని కొన్ని శునకాలు నీ తిండితిని నీమీదే మొరుగుతుంటే ‘‘ద్వేషించడం’’ మాత్రం నాకు రాదన్నావు చూడు.. ఆ మాటతో మాకు ‘‘దేవుడివైపోయావు’’ నీకు రాకపోతేనేం అన్నయ్య.. మాకొచ్చు నేర్పించమంటావా అంటే వద్దురా... తప్పు.. అది మీరూ నేర్చుకోకండి అంటూ సున్నితంగా మందలిస్తుంటావు. ఐనా నీమీద మాకున్న అమితమైన ప్రేమతో అప్పుడప్పుడూ నీకు నచ్చకపోయినా నువ్వు పెట్టిన ఈ హద్దుని మాలో కొందరు దాటేస్తూ ఉంటారు. చెప్తున్నానుగా అలా దాటేదీ నీమీద ప్రేమతోనే..
నీ శత్రువుని సైతం ప్రేమతో ఆలింగనం చేసుకోగల మంచు పర్వతానివి అన్నయ్య నువ్వు ‘‘అంజి’’లో ఆ శివయ్య ఇచ్చిన అమృతం. ‘‘దొంగ’’చాటుగా కొంచెం తాగేసావో ఏంటో నువ్వూ మాకంటికెప్పుడూ నిత్య యవ్వనుడివే! పుట్టినందుకు నీ వయసు ఇదని చెప్పాలేమోగానీ మాలో కొందరి నాన్నలకు, మాకు, మా బిడ్డలకు, రేపు వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా నువ్వెప్పుడూ ‘‘ అన్నయ్య’వే’’ మా గుండెల్లో పచ్చబొట్టువై నిలచిపోయే మా ‘‘చిరంజీవి’వే’’
లవ్యూ అన్నయ్య.. ‘‘హ్యాపీ బర్త్ డే అన్నయ్య’’
- సతీష్ కుమార్ రాజా
Comments