అభిమానులు మెచ్చుకునేలా బాలయ్యా !
- Guest Writer
- 5 days ago
- 2 min read

బాలయ్యకి ఆవేశం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆపుకోలేడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. క్రమశిక్షణ తప్పి మితిమీరి ప్రవర్తిస్తే అభిమాని అయినా సరే చెంప చెళ్లుమనిపిస్తాడు. ప్రేమ వస్తే అదే అభిమానిని నెత్తిన పెట్టుకుంటాడు. బాలయ్యని దగ్గర్నుంచి చూసినవాళ్ళకి ఆయనలో ఈ రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. కాకపోతే కొంతమంది హీరోలతో పోలిస్తే ఈయనలో లౌక్యం తక్కువగా ఉండటంతో అప్పుడప్పుడు వివాదాస్పదుడు అవుతుంటాడు. ఏదేమైనా తాను చెప్పాలనుకున్న విషయాలను పబ్లిక్ గానే చెప్పడం ఆయనకు ముందునుంచి అలవాటు.
ఈ మధ్య అసెంబ్లీలో భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యే, చిరంజీవి, జగన్‌లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఒకరకంగా ఈయన వాఖ్యల వల్ల చంద్రబాబు కూడా ఇబ్బంది పడ్డారు.
అందుకే నాయకులు ఎవరైనా సరే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ఆయన పరోక్షముగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా అఖండ`2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ’’ తాను పాదరసం లాంటివాడినని, పాదరసం ఎందులోనైనా ఒదిగిపోయినట్టు ఏ పాత్రలోనైనా ఒదిగిపోతానని చెప్పారు . అందుకే సినీనటుడిగా, ఎమ్మెల్యేగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా అన్ని పాత్రలూ సమర్థవంతంగా పోషించగలుగుతున్నానని చెప్పారు.
ఈ సినిమా గురించి తాను, బోయపాటి మూడు నిముషాలు మాత్రమే మాట్లాడుకుని పని మొదలెట్టేశామని ఆయన చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏ హీరో అయినా ఇట్లాగే మాట్లాడుతారు. ఇందులో విశేషం ఏముంది ? అనుకుంటున్నారు కదా..
అసలు విషయం ఇది కాదు. ఇదే ఈవెంట్ ఆఖర్లో బాలయ్య తన అభిమానులకు ఇచ్చిన సందేశం ఆయనలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించడమే కాదు మూగజీవాల హృదయాలను కూడా తడుముతుంది. ప్రతి ఒక్క హీరో తమ అభిమానులకు ఇవ్వదగ్గ సందేశం.
ఫంక్షన్లో బాలయ్య మాట్లాడుతూ ‘‘నేను మీకు ఒక విషయం చెప్పాలి... ప్రతి ప్రాంతానికి కొన్ని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిలో మేకలను బలి ఇవ్వడం ఒకటి. నా సినిమాలు విడుదల సందర్భంగా కొంతమంది అభిమానులు థియేటర్ల బయట మేక తలలు కోస్తున్నారని తెలిసింది. దయచేసి ఎవరూ అటువంటి పనులు చేయకండి. నాలుగు కాళ్ళ జంతువులను కూడా రెండు కాళ్ళ మనుషులతో పాటు సమానంగా గౌరవించండి’’ అంటూ తన అభిమానులకు విజ్ఞప్తి చేసారు.
జంతువులపై హింసను కొనసాగించడం మంచి పద్దతి కాదు. మరొక జీవికి హాని తలపెట్టడం సబబు కాదు అని ఆయన అన్నారు. అకస్మాత్తుగా ఇప్పుడు బాలయ్య ఈ విజ్ఞాపన చేయడం వెనుక ఓ కారణం కూడా ఉంది.
గతంలో ఢాకు మహారాజ్ సినిమా విడుదల రోజున తిరుపతిలో కొందరు అభిమానులు థియేటర్లో మేక తల నరికి రక్తం తెరమీద చల్లిన వీడియోలు బయటికి రావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తమ హీరో సినిమా విడుదలైతే అభిమానులు థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, పూల వర్షాలు కురిపించడం సంగతి అందరికీ తెలిసిందే.
కానీ మొదటిసారిగా బాలయ్య అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి థియేటర్లో ఏకంగా మేక తల నరికి తెర మీదకి రక్తం చల్లడంతో అభిమానం వెర్రి తలలు వేస్తుందనే విషయం అర్థమైంది.
ఈ వెర్రి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలీదు. ఇవాళ మేకను కోసిన అభిమానులు రేపు దేన్నీ కోస్తారో ఎవరు వూహించగలరు?. అందునా పవిత్రమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్మాదులపై కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసారు. మళ్ళీ ఇప్పుడు అఖండ`2 రిలీజ్ కాబోతున్న సందర్భంగా అభిమానులు థియేటర్ల బయట మేకలను బలి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారన్న సంగతి పసిగట్టే బాలయ్య ముందస్తు హెచ్చరిక చేసారని భావిస్తున్నారు. టీజర్ల ద్వారా ఇప్పటికే అఖండ పార్ట్`2కి కూడా హైప్ వచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలో బాలయ్య అఖండ తాండవం చూడబోతున్నారు అంటూ నిర్వాహకులు ప్రమోషన్లలో ఉదరగొడుతుండటంతో ఈసరికే ఫాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి. ఈ పూనకాలకు మూఢ నమ్మకాలు తోడైతే జరిగేది విపరీతమే. అందుకే సమయానికి తగు మాటలాడిన బాలయ్య తీరుకి సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఆయన ఇచ్చిన సందేశం భవిష్యత్తులో అందరి హీరోల అభిమానులు కూడా పాటించాల్సిన విధంగా ఉంది. అన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఐదు నుంచి థియేటర్లలో అఖండ తాండవం మొదలౌతుందట!
- పరేష్ తుర్లపాటి










Comments