top of page

అభిమానమా.. హద్దుల్లో ఉండు!

  • Guest Writer
  • Sep 30, 2025
  • 2 min read


లిటిల్‌ హార్ట్స్‌ సినిమాలో ఓ సీన్‌ ఉంది... హీరో.. కంప్యూటర్‌ వాల్‌ పేపర్‌ గా తన అభిమాన హీరో నాగార్జున పిక్‌ పెట్టుకొంటాడు. ‘‘నీకు తిండి పెడుతోంది నేను.. బట్టలు ఇస్తోంది నేను. కాలేజీ ఫీజు కడుతోంది నేను.. మరి నాగార్జున ఎవడ్రా’’ అని అడిగే సీన్‌ అది.

దర్శకుడు ఈ సీన్‌ని ఫన్‌ మోడ్‌ లోనే రాసుకొని ఉండొచ్చు. కానీ.. ఆ సీన్‌ వెనుక ఓ డెప్త్‌ ఉంది. అభిమానం ముసుగులో వెర్రితలలు వేసే యువతరానికి చురక ఉంది. అర్థం చేసుకొనేవాళ్లకు అర్థం చేసుకొనేంత.

ఇప్పుడు తమిళనాడులో జరిగిన కరూర్‌ దుర్ఘటన విషయానికి వద్దాం. తమ అభిమాన నటుడు విజయ్‌ పై ఉన్న వెర్రి అభిమానంతో జనం తండోపతండాలుగా వచ్చారు. ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. దాంతో 40 మంది ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. ఈ దుర్ఘటనలో పరోక్షంగా విజయ్‌ పాత్ర ఉంది. నిర్వాహకుల వైఫల్యం ఉంది. కానీ అంతకు మించి.. అభిమానం ముసుగులో ఉన్న వెర్రితనం కూడా ఉంది.

హీరోల్ని తెరపైనే కాదు, ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ అభిమానికీ ఉంటుంది. కాదనలేం. కానీ.. ప్రాణాలు పణంగా పెట్టాల్సివచ్చినంత అభిమానమైతే కాదుగా. ఈ ఘటనలో అభం శుభం తెలియని పసి పాపలు ఉన్నారు. వాళ్ల మరణానికి కారణం ఎవరు? చిన్న పిల్లల్ని చంకలో పెట్టుకొని వెళ్లడం ఏమిటి? నీ అభిమానానికీ, ఆ పసివాళ్లకూ ఏమిటి సంబంధం? ఇంట్లో టీవీలో కూర్చుని చూస్తే అభిమానం తగ్గినట్టా? కాదు కదా..? రిస్క్‌ అని తెలిసి కూడా ఇలాంటి సభలకు వెళ్లడం ఎందుకు?

విజయ్‌ విషయంలోనే కాదు.. చాలా చోట్ల ఇదే దుస్థితి. కటౌట్‌ కడుతూ, విద్యుత్‌ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయిన వాళ్లని చూశాం. అభిమాన హీరోని ఏదో అన్నాడని, మరో హీరో అభిమానితో కొట్లాడి ప్రాణాలపై తెచ్చుకొన్న వాళ్ల గురించి వింటున్నాం. సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాట తాజా ఉదాహరణ. హీరో సినిమా ఫ్లాప్‌ అయ్యిందని మనోవేదన చెంది, ఆత్మహత్య చేసుకొన్న వాళ్ల కథలూ తెలుసు మనకు. ఇదంతా.. ఎవరి కోసం? ఎవరి మెప్పు పొందడడానికి?

జీవితం అమూల్యమైనది. అది సినిమా కంటే, స్టార్ల కంటే గొప్పది. కుటుంబాన్ని ప్రేమించడం, కన్న తల్లి దండ్రుల్ని ప్రేమించడం నేర్చుకొన్నవాళ్లకే అది అర్థం అవుతుంది. సినిమానీ, సినిమా హీరోని అభిమానించడం తప్పు కాదు. నేరం కాదు. అదుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు. అది అసలు అభిమానమే అనిపించదు. మీరు అభిమానించే స్టార్లు కూడా వాటిని సమ్మతించరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.

- తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

హబ్బీ ప్రయత్నిస్తే ఇండస్ట్రీకి మంచి విలనే!

తమిళ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ముంబైకి చెందిన నికోలాయ్‌ సచ్‌దేవ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయింది. పెళ్లైనా వరలక్ష్మి సినిమాలకు దూరం కాకుండా యధావిధిగా వృత్తిని కొనసాగిస్తుంది. భర్త నుంచి అన్ని రకాల సహకారం..స్వేచ్ఛ లభించడంతోనే నటిగా కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అభిమానులు భర్తను కూడా సినిమాల్లోకి తీసుకొస్తే బాగుంటుంది? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. నికోలాయ్‌ నటుడిగా అన్ని రకాలుగా అర్హుడంటూ పోస్టులు పెడుతున్నారు. నిజమే అందులో తప్పేముంది.

నికోలయ్‌ భారీ కటౌట్‌. విలన్‌ పాత్రలకు పర్పెక్ట్‌గా సెట్‌ అవుతారు. ఒంటి చేత్తో నలుగుర్ని అలా విసిరేసే కటౌట్‌ అది. భారీ దేహం.. హైట్‌.. వెయిట్‌.. కండలు తిరిగిన దేహంతో మంచి ఫిట్‌ నెస్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. తాను సెలబ్రిటీ కాకపోయినా అచ్చంగా సెలబ్రిటీనే తలపిస్తాడు. వరలక్ష్మిని వివాహం చేసుకోవడంతో తాను కూడా సెలబ్రిటీ అయిపోయాడనుకోండి. అతడు ఎక్కడ కనిపించినా మీడియా కవరేజ్‌ ఉంటుంది. ఇంటర్నెట్‌లో ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నికోలాయ్‌ విలన్‌గా ప్రయత్నిస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు.

ఎలాగూ బ్యాకెండ్‌లో వరలక్ష్మి రిఫరెన్స్‌ ఉంటుంది. అత్త-మామలు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆ రకంగా కోలీవుడ్‌ నుంచి మంచి బ్యాకప్‌ ఉంటుంది. నికోలాయ్‌కి బాలీవుడ్‌లో మంచి పరిచయాలున్నాయి. జాన్‌ అబ్రహం, సుస్మితాసేన్‌ సహా చాలామంది స్నేహితులున్నారు. జాన్‌ సినిమాలో విలన్‌ అవకాశం అడిగితే స్నేహితు కాదంటాడా? పైగా నికోలాయ్‌ పచ్చబొట్టు ప్రేమికుడు. అతడి శరీరం నిండా టాట్టూలు దర్శనమిస్తాయి. మంచి బాడీ బిల్డర్‌. సినిమాకు పనికొచ్చే ప్రతీ క్వాలిటీ నికోలాయ్‌లో ఉంది. అతడు వచ్చి ఓ ప్రయత్నం చేయడమే. అవకాశాలు ఇవ్వని వారుండరు. ఒసారి నికోలాయ్‌ వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన బిజినెస్‌మేన్‌ అతడు. ఆర్ట్‌ గ్యాలరీని నడుపుతున్నాడు. ఆన్‌ లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. నటి వరలక్ష్మితో పద్నాలుగేళ్లుగా పరిచయం. ఆ పరిచయమే ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ దారి తీసింది. ప్రస్తుతం ఆ జోడీ దాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page