‘అమ్మోరు తల్లి’ ఫార్ములాతో సూర్య మ్యాజిక్?
- Guest Writer
- 5 days ago
- 3 min read

నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అంటే ఒక బ్రాండ్. కోర్టులో ఏ కేసు ఎప్పుడు రావాలి, ఎవరు ఏడవాలి, ఎవరు నవ్వాలి, ఎవరు బెయిల్ మీద బయటకు రావాలి అన్నది కూడా అతని మూడ్ మీదే ఆధారపడి ఉంటుంది. లాయర్ల నుంచి జడ్జి (నట్టి సుబ్రమణియన్) వరకు అందరినీ ‘ప్యాకేజీలు’ ఇచ్చి తన జేబులో పెట్టేసుకున్నాడు. కోర్టులో వచ్చే ప్రతీ పైసాని తనే క్యాచ్ పడుతూ, కక్షిదారుల జేబులకు చిల్లులు పెట్టడమే మనోడి ఫుల్‌టైమ్ జాబ్.
అలాంటి టైంలోతమిళనాడు నుంచి మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) తన కూతురు మీను లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం 60 సవర్ల బంగారం మూటగట్టుకుని నాంపల్లి జంక్షన్లో దిగుతాడు. కానీ, దురదృష్టవశాత్తూ అక్కడ ఆ బంగారం కొట్టేస్తారు. పోలీసులు 45 సవర్లు రికవరీ చేసినా, ఆ బంగారం చేతికి రావాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. ఈ గ్యాప్‌లో దూరిన మన బేబీ కృష్ణ... “బంగారం ఇప్పిస్తా... మీ కూతుర్ని కాపాడుతా” అంటూ వాళ్ళ దగ్గరున్న మిగతా డబ్బుల్ని కూడా లీగల్ ఫీజుల పేరుతో నొక్కేస్తాడు.
ఆఖరికి తిని బతకడానికి కూడా పైసల్లేక, ఈ బేబీ కృష్ణ టార్చర్ తట్టుకోలేక మునిస్వామి నాయుడు కోర్టు ఆవరణలోని క్షేత్ర పాలకుడు వీరభద్రుడికి దండం పెట్టుకుని, “దేవుడా! వీడి బారి నుంచి మమ్మల్ని కాపాడు” అని ఏడుస్తాడు. మరోవైపు లాయర్ ప్రీతి (త్రిష) కూడా ఈ కుళ్ళిపోయిన వ్యవస్థను మార్చమని, పెండింగ్‌లో ఉన్న 27,000 కేసులకు మోక్షం ప్రసాదించమని ఆ దేవుడికే అర్జీ పెట్టుకుంటుంది. భక్తుల మొర ఆలకించిన వీరభద్రుడు... వెంటనే బ్రాండెడ్ సూటు, బూటు వేసుకుని లాయర్ సూర్య (సూర్య) రూపంలో భూమి మీదకు ల్యాండ్ అవుతాడు. కోర్టులో సూర్య ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం... బేబీ కృష్ణకు మ్యాటర్ అర్ధమైపోతుంది. “ఓహో... సాక్షాత్తూ దేవుడే దిగివచ్చాడా!” అనుకుంటూ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు.
బేబీ కృష్ణ సవాల్ ఓ సవాల్ విసురుతాడు. “నువ్వు దేవుడివైతే నీ మహిమలు గుడిలోనే ఉంచుకో. ఇక్కడ కోర్టులో నీ శక్తులు వాడకుండా, ప్యూర్ లీగల్ పాయింట్లతో నన్ను ఓడించి, ఆ తండ్రీకూతుళ్ళకు న్యాయం చెయ్... చూద్దాం!” అంటాడు. స్వయంగా భగవంతుడే అయినా, లీగల్ రూల్స్ ప్రకారం ఆడటానికి సూర్య కూడా కాలర్ ఎగరేసి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి అసలు ఆట మొదలవుతుంది. ఒక వైపు దేవుడు... మరో వైపు డబ్బుతో న్యాయాన్ని ఈఎంఐల్లో అమ్మే లాయర్.
దేవుడు శక్తులు వాడకుండా కేవలం సెక్షన్లు వాడుతుంటే... బేబీ కృష్ణ మాత్రం తన వంతు వంకర బుద్ధులన్నీ చూపిస్తుంటాడు. ఈ లోగా మీను ఆరోగ్యం క్షీణించి మరణానికి దగ్గర అవుతుంది.అప్పుడు లాయర్ రూపంలో వచ్చిన భగవంతుడు ఏం చేసాడు. వీరభద్రుడు తన దైవిక శక్తులు వాడకుండానే ఈ ‘బేబీ’ కి ఎలాబుద్ధి చెప్పాడు? అనేదే మిగతా క్లైమాక్స్.
విశ్లేషణ
దర్శకుడు ఆర్జే బాలాజీకి ఒక ఫిక్సేషన్ ఉంది. సిస్టమ్ ఫెయిల్ అయితే దేవుడి ఎంట్రీ ఇవ్వాలి. అక్కడితో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో డివోషనల్ బీజీఎం. ఆయన గత చిత్రం నయనతార నటించిన ‘అమ్మోరు తల్లి’ చూసారు కదా... ఒక సాధారణ మనిషి జీవితంలోకి దేవత వచ్చి సిస్టమ్‌ని మార్చే పనిలోకి దిగిపోతుంది. భక్తి, ఫాంటసీ, సెటైర్, సోషల్ కామెంటరీ అన్నీ కలిపిన ఆ ఫార్ములా గుర్తుంది కదా! ఇక ‘వీరభద్రుడు’ కూడా దాదాపు అదే తీవcఱజూవ.
తేడా ఏంటంటే... అక్కడ అమ్మవారు టెంపుల్ ల్యాండ్ సమస్యలు చూసుకున్నారు... ఇక్కడ వీరభద్ర స్వామి నేరుగా నాంపల్లి కోర్టులో అడుగు పెడతాడు. అంటే... “దేవుడు కోర్టులోకి వస్తే ఏం జరుగుతుంది?” అనే ఆలోచన. వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎందుకంటే మన కోర్టుల పరిస్థితి చూస్తే... దేవుడే పర్శనల్ గా దిగి వస్తే గానీ న్యాయం జరగదనే స్టేజి కి చాలా ఏళ్ల క్రితమే వెళ్లిపోయాం. దాన్నే కనెక్ట్ చేయటానికి చూసాడు . కానీ కనక్టివిటీ అనుకున్న స్దాయిలో కుదరలేదు.
ఇక సినిమా మొదటి భాగం చూస్తుంటే... ఇది సూర్య సినిమా కంటే “ఆర్జే బాలాజీ సెల్ఫ్ సలబ్రేషన్ ఈవెంట్ ”లా అనిపిస్తుంది. బేబీ కృష్ణ అనే దుర్మార్గుడైన లాయిర్ పాత్రలో ఆయన కనిపిస్తారు. సారీ కనిపించడం కాదు... పూర్తి డామినేషన్. ఒక్కో స్లో మోషన్ షాట్ చూస్తుంటే “ఇతనే హీరోనా?” అనిపిస్తుంది. దాంతో సూర్య సినిమా అనుకుని టికెట్ కొన్న ప్రేక్షకుడు...షాక్ అవుతారు. ఇక సూర్య లాంటి స్టార్ హీరోను ఛాలెంజ్ చేసే విలన్ అంటే మనం ఊహించేది ఇంటెన్సిటీ. ఒక ప్రకాశ్ రాజ్ తరహా వెయిట్. ఒక ఫహాద్ ఫాజిల్ తరహా నటన. కానీ ఇక్కడ దర్శకుడు తనలోని నటుడిని విపరీతంగా ప్రేమించేసుకుని విజృంభించేసాడు. అయితే సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం థియేటర్ లో ఎనర్జీ మారుతుంది. క్షేత్ర పాలకుడిగా ఆయన స్క్రీన్ ప్రెజన్స్ బలంగా పనిచేస్తుంది. దేవుడి పాత్రలో ఆయన్ని బాగానే లేపారు. ఓ రకంగా సినిమా పూర్తిగా పడిపోకుండా నిలబెట్టింది కూడా ఆయనే. ఎందుకంటే స్క్రీన్‌ప్లే అప్పటికే ICUలో ఉంటుంది.
సినిమాలో అసలు స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే విలన్ దేవుడికి విసిరే ఛాలెంజ్. “నీ దైవశక్తులు వాడకుండా సామాన్యుడిలా వచ్చి సిస్టమ్‌తో పోరాడు!”. ఇది వినగానే ప్రేక్షకుడు కూడా అలర్ట్ అవుతాడు. “అబ్బా... ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుందేమో!” అనిపిస్తుంది. దేవుడు కూడా కామన్‌మ్యాన్‌లా కోర్టు చుట్టూ తిరగాలి... హియిరింగ్ డేట్స్ కోసం వెయిట్ చేయాలి... లాయర్ల ట్రిక్స్ ఎదుర్కోవాలి... అలా కథ నడిస్తే నెక్ట్స్ లెవిల్ అయ్యేది. కానీ దర్శకుడు అక్కడే షార్ట్ కట్ తీసుకున్నారు. ఛాలెంజ్ ఏక్సెప్ట్ చేసిన వెంటనే దేవుడు మళ్లీ పవర్స్ వాడేస్తాడు! దాంతో కాంప్లిక్ట్ పోయింది, కథలో టెన్షన్ పోయింది. మనకు నిద్రా వచ్చేస్తుంది.
‘జై భీమ’ ఎందుకు పనిచేసిందంటే... అక్కడ సిస్టంపై కోపం ఆర్గానిక్‌గా ఉంటుంది. ఇక్కడ మాత్రం సిస్టమ్ మేటర్ కంటే ఎలివేషన్ షాట్స్ కే ప్రయారిటీ ఎక్కువ.
ఎవరెలా చేసారు
సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రతీ సినిమాని తన నటనతో నిలబెట్టాలనే చూస్తున్నాడు. అయితే అది కుదరటం లేదు. ఈ సారి అంతేనా అనిపిస్తుంది. త్రిష ఓకే. ఆర్జే బాలాజీలో దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడనిపిస్తుంది. మలయాళ నటుడు ఇంద్రన్స్ గుర్తుండిపోయే ఫెరఫార్మెన్స్ ఇచ్చారు. మిగతాపాత్రల్లో సీనియర్స్ అలా వచ్చి చేసుకుంటూ వెళ్లారు.
టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ విజువల్‌గా ఆకట్టుకుంటాయి. కానీ సాయి అభ్యంకర్ సంగీతం చాలా చోట్ల ఎక్కువ శబ్దంగా అనిపిస్తుంది. ఇక ఆర్జే బాలాజీ దర్శకత్వం, కథనం విషయానికి వస్తే... మంచి పాయింట్ ఉన్నా, దాన్ని కొత్తగా లేదా బలంగా చూపించలేకపోయారు.
ఫైనల్ థాట్:
మొత్తానికి ‘వీరభద్రుడు’లో దేవుడు ఉన్నాడు... దైవశక్తులు ఉన్నాయి... సూర్యకు తగ్గ ఎలివేషన్లు ఉన్నాయి... కానీ కథ మాత్రం కోర్టు ఫైల్‌లా వాయిదాల మధ్య ఇరుక్కుపోయిన ఫీలింగ్ ఇస్తుంది. మొత్తంగా ఇది న్యాయం కోసం దేవుడు దిగివచ్చిన కథే... కానీ సినిమా అయిపోయాక ప్రేక్షకుడు మాత్రం “దేవుడా... స్క్రీన్‌ప్లేని ఇంకొన్ని వాయిదాలు వేసి బాగా తీర్చిదిద్దాల్సింది! ఉండాల్సింది!” అనుకుంటూ బయటకు వస్తాడు.
- జోస్యుల సూర్యప్రకాష్






Comments