అమెరికా అహాన్ని కూల్చిన ఇరాన్!
- DV RAMANA

- 15 hours ago
- 3 min read
తిరుగులేని ఎఫ్`35నే దెబ్బకొట్టిన పాత సిస్టమ్
తమను ఎవరూ కొట్టలేరని ఇన్నాళ్లూ అగ్రరాజ్యం బింకం
ఒక్క దెబ్బతో పడిపోతున్న యుద్ధసాంకేతిక పరపతి
స్టెల్త్ ఫైటర్లను కొట్టవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన ఘటన

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘తాడిని తన్నేవాడుంటే.. దాని తలను తన్నేవాడు’ కూడా ఉంటాడని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి దాదాపు అలాగే ఉంది. యుద్ధం అంటే రెండువైపులా లాభనష్టాలు ఉంటాయి. శత్రువును దెబ్బకొట్టడమే కాదు. ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. అలాగే తమకంటే తక్కువ ఆయుధ సంపత్తి ఉన్న వారి నుంచి కూడా ఊహించని ప్రతిఘటన ఎదురవుతుంటుంది. అలాంటి పరిస్థితి పెద్ద దేశాలకు అవమానకరంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా దుస్థితి అదే. అమెరికా తన తురుపుముక్కగా ప్రచారం చేసుకుంటున్న ఎఫ్`35 యుద్ధ విమానాన్ని ఏమీ కాకుండా ఇరాన్ పిట్టను కొట్టినట్లు కొట్టేయడం అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా, ఆ దేశానికి ఘోర అవమానంగా అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అత్యంత అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫైటర్ శ్రేణికి చెందిన ఈ విమానం ఇరాన్‌కు దెబ్బకు ఎలా దొరకిపోయిందన్నది కూడా ఆశ్చర్యకరమే. ఎఫ్`35ల చరిత్రలో ఇంతవరకు దాన్ని కొట్టగలిగిన వాయురక్షణ(ఎయిర్ డిఫెన్స్) వ్యవస్థలు గానీ, దాని కదలికలను కనిపెట్టగలిగిన రాడార్ వ్యవస్థలు గానీ ఏ దేశం వద్దా లేవు. అటువంటప్పుడు ఇరాన్ తన పరిమిత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో దాన్ని ఎలా కూల్చగలిగిందన్నది ప్రశ్న. రెండు రోజుల క్రితం తమ గగనతల సరిహద్దులను అతిక్రమించి బందర్ అబ్బాస్ మీదుగా పయనిస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్`35 ఫైటర్ జెట్‌ను దెబ్బతీసినట్లు ఇరాన్ ప్రకటించింది. దానికి తగిన వీడియో ఆధారాలు కూడా బయటపెడుతూ.. తమ దెబ్బకు దిమ్మదిరిగిన ఎఫ్`35 గల్ఫ్‌లోని ఓ స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు చెప్పుకొచ్చింది. యుద్ధంలో ఇదొక కీలక ఘట్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎందుకింత విస్మయం
యుద్ధంలో ఒక దేశ యుద్ధ విమానాన్ని మరో దేశం పడగొట్టడం కామన్. అలాంటప్పుడు ఎఫ్`35 జెట్‌ను ఇరాన్ దెబ్బతీయడంపై ఎందుకింత చర్చ జరుగుతోంది? విస్మయం వ్యక్తమవుతోంది? అనే ప్రశ్నలకు దాని ప్రత్యేకతలు, సామర్థ్యం, దాని ధరలే కారణమని చెప్పాలి. ప్రపంచంలో అత్యధిక సాయుధ సంపత్తి కలిగిన అమెరికా రక్షణ రంగానికే ఎఫ్`35 జెట్ తలమానికంగా భాసిల్లుతోంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విహంగం ఇదే. దీని ధర ఒక్కోటి సుమారు వంద మిలియన్ డాలర్లు.. వేరియంట్‌ను బట్టి భారతీయ కరెన్సీలో రూ.700 నుంచి రూ.1000 కోట్ల వరకు ఉంటుంది. దీని లైట్నింగ్(మెరుపు) వేగం శత్రువుల రాడార్లు సైతం గుర్తించకుండా చేస్తుంది. అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించిన ఈ విమానం ఫైటర్ జెట్‌గానే కాకుండా ఓ ఫ్లయింగ్ మాన్‌స్టర్(ఎగిరే మత్యువు)డా పేరొందింది. దీని రూపురేఖలు, వాడే పెయింట్ రంగు కారణంగా శత్రువుల రాడార్లకు ఒకవేళ కనిపించినా అదో చిన్న పక్షిలా భ్రమింపజేస్తుంది తప్ప యుద్ధ విమానంలా కనిపించదు. ఇందులో వినియోగించిన స్టెల్త్ టెక్నాలజీ శత్రు రాడార్లకు చిక్కకుండా చేస్తుంది. అలాగే ఇందులో అమర్చిన సెన్సర్ ఫ్యూజన్ టెక్నాలజీ యుద్ధరంగంలో జరుగున్న పరిణామాలపై 360 డిగ్రీల కోణంలో పైలట్‌కు సమాచారాన్నిస్తుంది. ఇది బహుళ ప్రయోజనకారి. ఎయిర్ టు ఎయిర్ కంబాట్(ఆకాశ యుద్ధం)తోపాటు ఆకాశం నుంచి భూతలంపైనున్న టార్గెట్లను కూడా నాశనం చేయగలదు.
వేడిని బట్టి పసిగట్టారట!
ఈ యుద్ధ విమానం రాడార్‌కు కనిపించదని అమెరికా చెబుతున్నా ఫైటర్ జెట్ల కదలికలను గుర్తించేందుకు రాడార్ వ్యవస్థ కాకుండా మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. హీట్ వేవ్‌ను బట్టి గుర్తించడం వాటిలో ఒకటి. ఎఫ్`35ను గుర్తించి కొట్టగలగడానికి హీట్‌ను గుర్తించే ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆరఎస్‌టీ) వ్యవస్థ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎఫ్`35 తరహా అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లు అత్యధిక వేడిని విడుదల చేస్తాయి. ఐఆరఎస్‌టీ సిస్టమ్స్ రాడార్‌తో ప్రమేయం లేకుండానే ఈ వేడిని గ్రహించి విమానాన్ని, దాని మోడల్‌ను ట్రాక్ చేయగలవు. బహుశా ఈ వ్యవస్థే ఎఫ్`35ను కొట్టగలిగేందుకు ఇరాన్‌కు సాయపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా దీనికి కొద్దిరోజుల ముందే హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న అమెరికాకే చెందిన మరో అత్యాధునికి విమానం ఎఫ్`15ను సైతం ఇరాన్ దళాలు కూల్చివేశాయి. కొన్ని నెలల క్రితం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్‌పై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మన భూభాగంపైకి పంపిన ఎఫ్`16 విమానాన్ని సైతం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసింది. కానీ అప్పట్లో దీన్ని అమెరికా రక్షణవర్గాలు కొట్టిపారేశాయి. ఇప్పుడు ఇరాన్ దెబ్బకు వారం వ్యవధిలోనే ఎఫ్`15, ఎఫ్`35 ఫైటర్ జెట్లు తీవ్రంగా దెబ్బతినడం అమెరికాకు తీవ్ర తలవంపులుగా మారింది. అంతర్జాతీయ ఆయుధాల మార్కెట్‌లో అమెరికా స్థాయిని తగ్గిస్తాయి.
ప్రమాదంలో బ్రాండ్ వేల్యూ
యుద్ధరంగంలో ఆయుధాల కంటే వాటి బ్రాండ్ వాల్యూ, నమ్మకానికే ప్రాధాన్యం. అత్యాధునికమైనదిగా చెప్పుకొంటున్న ఎఫ్`35ను కొనడానికి పపంచ దేశాలన్నీ అమెరికా ముందు క్యూ కడుతుంటాయి. కానీ ఇప్పుడు ఆయుధ సంపత్తిపరంగా చిన్నదేశమైన ఇరాన్.. అమెరికా యుద్ధ విమానాన్నే కూల్చేయడం ప్రపంచ ఆయుధాల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాంకేతిక లోపం లేదా పైలట్ తప్పిదం కారణంగా ఎఫ్`35 దెబ్బతిని ఉండొచ్చునని అమెరికా అనుకూల దేశాలు చెబుతున్నా యూఎస్ వ్యతిరేకవర్గాలు మాత్రం.. అమెరికా అజేయమనేది ఓ భ్రమ మాత్రమేనని, అత్యాధునిక టెక్నాలజీని కూడా సామాన్య పద్ధతులతో ఎదుర్కోవచ్చని ఇరాన్ నిరూపించిందని చెబుతున్నాయి. ఇన్నాళ్లూ తమనెవరూ తాకలేరన్న అమెరికా అహంకారానికి తగిలిన దెబ్బగా దీన్ని కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని చెబుతున్నారు. అమెరికా కాకుండా సుమారు 15 దేశాలు వివిధ వెర్షన్లకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ఈ జెట్లను ఇండియాకు అమ్ముతామని ట్రంప్ ఆఫర్ చేశారు. కానీ భారత్ దీనిపై ఆసక్తి చూపలేదు. తాజా ఘటనతో ఎఫ్`35 యుద్ధ విమానాల కొనుగోలుకు ఆసక్తితో ఉన్న దేశాలు పునరాలోచనలో పడవచ్చు. అత్యంత ఆధునిక ఫైటర్ జెట్లకు కూడా కొన్ని బలహీనతలు, లోపాలు ఉంటాయని ప్రపంచానికి తెలియజెప్పిన ఘటన ఇది. ప్రస్తుత యుద్ధంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పూర్తిగా నాశనం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. అమెరికా కూడా స్టెల్త్ టెక్నాలజీ లేని బీ1, బీ2 బాంబర్లను మోహరించింది. శత్రుదేశ గగనతలంపై అమెరికాకు ఆధిపత్యం ఉందని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వీటిని మోహరిస్తారు. అయితే ఎఫ్-35 జెట్‌ను కూల్చేసిన ఘటన ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా సమర్థవంతంగానే పని చేస్తున్నాయని స్పష్టం చేస్తున్నది. దీంతో అమెరికా తమ ఆపరేషన్స్‌ను సమీక్షించుకోవాల్సిన అగత్యం కల్పించింది.






Comments