top of page

అవినీతి చేయలేమన్నందుకు ఏడుగురు సస్పెన్షన్

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 2 min read
  • జిల్లా ట్రెజరీలో డీడీ రవికుమార్ ఘనకార్యం

  • స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తలబిరుసు సమాధానం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా ఖజానా శాఖలో ఫైళ్లు సక్రమంగా నడపకుండా ఇష్టారాజ్యంగా కమీషన్లు తీసుకొని బిల్లులు చేయడం తమవల్ల కాదని కొద్ది రోజుల క్రితం నిరసన వ్యక్తం చేసిన ఏడుగురు ట్రెజరీ ఉద్యోగులపై ఆ శాఖ డీడీ రవికుమార్ సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈమేరకు సీనియర్ అకౌంటెంట్లు బెండి మోహనరావు, మాదారపు డేవిడ్, జి.రాజశేఖర్, ప్రదీప్, బి.నాగభూషణరావు, మనోహర్‌లతో పాటు జూనియర్ అకౌంటెంట్ సాయికష్ణను కూడా సస్పెండ్ చేస్తూ డీడీ ఉత్తర్వులిచ్చారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఏటీవోగా పని చేస్తున్న రమణారెడ్డి సెలవు మీద వెళ్లినప్ప్పుడు ఆయన లాగిన్‌లోకి వెళ్లి నేరుగా డీడీనే కొన్ని బిల్లులు పాస్ చేశారు. దీని మీద ఆయన ట్రెజరీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అకౌంటెంట్ల సంతకాలు లేకుండానే వివాదాస్పద బిల్లులు డీడీ పాస్ చేస్తున్నారని, దీనివల్ల తమ ఉద్యోగాలు పోతాయంటూ కొందరు ఉద్యోగులు ఆయన ఛాంబర్‌కు వెళ్లి ఇలా వ్యవహరిస్తే తాము ఉద్యోగాలు చేయలేమంటూ స్పష్టం చేశారు. దీంతో తన మీద దాడి చేశారంటూ అదే రోజు డీడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయితీ వన్‌టౌన్ సీఐ తీర్చారు. ఆ తర్వాత డీడీ రవికుమార్ ఈ ఏడుగురికీ ఈ నెల 10న ఛార్జిమెమో ఇచ్చారు. దానికి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అందరూ సమాధానం ఇచ్చిన తర్వాత తాజాగా సోమవారం వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 17న సీనియర్ అకౌంటెంట్ మాదారపు డేవిడ్‌ను పిలిచి బెండి మోహనరావే ఇదంతా చేశారంటూ తనకో ఫిర్యాదిస్తే మిగిలినవారందర్నీ క్షమించేస్తానంటూ రవికుమార్ అల్టిమే{ం ఇచ్చారట. దీనికి వీరెవరూ అంగీకరించకపోవడంతో ఏడుగుర్నీ సస్పెండ్ చేసేశారు. వీరి సస్పెన్షన్ ఉత్తర్వుల మీద ఎస్‌టీవో ముందుగా సంతకం చేయాలి. అయితే ఇది అరాచకమని రెగ్యులర్ ఎస్‌టీవో సెలవు పెట్టేశారు. ఆమె స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా ఈ ఉత్తర్వుల మీద సంతకం చేయలేనంటూ సెలవు తీసుకున్నారు. దీంతో డీడీకి అనుకూలంగా మొదటి నుంచి వ్యవహరిస్తున్న డీవీ సత్యనారాయణతో సంతకం చేయించి సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై బాధితులు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను సోమవారం మధ్యాహ్నం కలిశారు. డీడీకి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే, ఇది తమ కార్యాలయ అంతర్గత వ్యవహారమని, ఎమ్మెల్యే కలుగజేసుకోవడం సరికాదంటూ తలబిరుసు సమాధానం ఇవ్వడంతో ఈ వ్యవహారం రోడ్డుకెక్కినప్ప్పుడు తన దగ్గరికెందుకొచ్చారని, ఆఫీసు వ్యవహారమైనప్ప్పుడు అక్కడే పరిష్కరించుకోలేకపోయారా? అంటూ డీడీకి ఎమ్మెల్యే కౌంటరిచ్చారు. దీంతో తన ప్రమేయం లేదని, ట్రెజరీ డైరెక్టరే వీరిని సస్పెండ్ చేశారంటూ స్వరం మార్చారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ట్రెజరీ డైరెక్టర్‌కు ఫోన్ చేయగా, ఈ విషయమే తనకు తెలియదని స్పష్టం చేశారు. ఇంతవరకు ట్రెజరీ డీడీ కార్యాలయానికే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్ప్పుడు ఏడుగురు సస్పెన్షన్‌తో జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page