top of page

అవధుల్లేని సీజీ వర్క్‌.. కుర్చీలకు అతుక్కునే అద్భుతమే చేసింది!!!

  • Guest Writer
  • Jul 17
  • 3 min read

- హరిబాబు ముద్దకూరి

ree

ఆరోజురాత్రికి నైట్‌ షిఫ్టున్నా సరే.. పగటినిద్రని త్యాగం జేసి మరీ, పొద్దున్నే లేచి తయారైపోయి, ముందు రోజు తెప్పించిన టికెట్లను కళ్ళకద్దుకుని నేను, రంజిత్తూ, వాళ్ళన్నయ్య, రాజశేఖర్‌, చిన్నభోజన్న అందరం తయారైపోయి షార్జా సిటీ సెంటర్‌ పక్కనే ఉన్న స్టార్‌ సినిమా ప్లెక్సుకి.. అసలే శుక్రవారం ఒకటేమో, తండోపతండాలుగా విచ్చేసిన తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషా ప్రేక్షకాభిమానులతో కిటకిటలాడిపోతోంది ఆవరణంతా..

ఈ సినిమా మీద అందరూ అంచనాలు ఎంతగా పెట్టుకున్నారో అర్థమయ్యింది..

సినిమా మొదలైంది.. మొదటి ఐదు నిమిషాలు హిస్ట్రియానిక్స్‌ అసలు.. అవధుల్లేని సీజీ వర్కుతో అలకబడ్డ తెర మీది రమ్యకృష్ణ పరమేశ్వరా అంటూ ఆకాశంలోకి బిడ్డని చూపిస్తూ, క్రోధంగా అర్థించే సన్నివేశాన్ని చూసి ఏదో గట్టిగానే జరగబోతోందని కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చున్న క్షణం అది.. కానీ నా అంచనాలకి భిన్నంగా కథ ముందుకెళ్ళే కొద్దీ గ్రాఫు కిందకి పడుతూ వస్తోంది.. గ్రాఫిక్సు మీదనే అల్లిన ధీవరా పాటగానీ, ప్రభాస్‌-తమన్నాల మధ్య జరుగుతోన్న రొమాన్సుగానీ ఏవీ రోమాంచితం చెయ్యలేకపోతున్నాయ్‌ నాలో ప్రేక్షకుడిని..

మట్టి కొట్టుకుపోయున్న అనుష్క కష్టాలకి కడుపులో దేవింది.. నింపాదిగా సాగుతోన్న కథనానికి నడుం లాగింది. ఎందుకివన్నీ అని విసుక్కుంటున్నప్పుడు అర్థం కాలేదు, తర్వాత జరగబోయే కథకి అవే వేదిక అవబోతున్నాయని..

పచ్చాబొట్టేసినా పాట పూర్తయ్యేసరికి హత్తుకుని పడుకున్న హీరోహీరోయిన్లని చూసి, ‘‘ఈళ్ళిక్కడే దుకాణం పెట్టిర్రు..’’ అని విసుక్కున్నాడు ఓ రసహీన ప్రేక్షకుడెవరో.. దాదాపు మాదీ అదే ఆలోచన.. ఇదేంటీ రాజమౌళి మార్కు సన్నివేశం ఒక్కటీ కనబడేట్లేదూ అనుకుంటూ తెగ వెతికేస్తున్నాం..

ఎట్టకేలకు తమన్నా బారిన పడి, తన లక్ష్యసాధన కోసం మాహిష్మతి బయల్దేరి వెళ్ళాడు శివుడు.. హమ్మయ్య.. కోట గోడెక్కి లోపలికి దూకి నేల మీద అడుగుపెట్టేసరికి అమరేంద్ర బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ ప్రత్యక్షం అవ్వగానే..తెరముందు కూర్చున్న ప్రేక్షకుడు నోరొదిలేశాడు.. అక్కడ్నుంచి భల్లాలదేవుడి విగ్రహాన్ని పైకి లేపుతోన్న సన్నివేశంలో బాహుబలి ఐడెంటిటీ సీనుకి, నాలో మాస్‌ ప్రేక్షకుడికి చిన్న కదలిక వచ్చింది.. అయినాగానీ ఇంకా ఏదో వెలితి, ఎక్కడో అసంతృప్తి.. ఎలివేషన్లన్నీ రెండోభాగానికి దాచిపెట్టి ఇందులో ఎమోషన్ని మాత్రమే పండిరచడంతో నాకు పెద్దగా ఆనట్లేదు.. ఇంకా ఏదో కావాలనిపిస్తోంది..!! ఎలా ఉందని మావాళ్ళు ఇంటర్వెల్లో అడిగిన ప్రశ్నకు ‘‘అబ్బే.. రాజమౌళి సినిమాలా లేదు..’’ అని బదులిచ్చాను బింకం ప్రదర్శిస్తూ..

సెకండాఫ్‌ మొదలైంది.. దేవసేనని తప్పించే క్రమంలో, కట్టప్పతో తలపడుతూ అడవి శేష్‌ తలని ఒక్కవేటుతో నరుకుతాడు శివుడు.. తల లేకుండానే ఓ నాలుగడుగులు నడుచుకుంటూ ముందుకెళ్లి అప్పుడు కింద పడుతుంది ఆ మొండెం.. ఈలలు, మోతలతో థియేటర్‌ మొత్తం ఊగిపోయిన షాట్‌ అది..ఆ హఠాత్‌ పరిణామానికి, అవమానానికి బిక్కచ్చిపోయాడు కట్టప్ప.. కోపం గుండుకి అంటింది.. అనీలుడు విసిరిన బల్లేన్ని అందుకుని పరిగెత్తుకొస్తున్న కట్టప్పకి క్షణకాలపు మెరుపు వెలుగులో కనిపించింది బాహుబలి పోలికలున్న శత్రు మొఖం.. అంతే.. దూసుకొస్తున్నవాడల్లా, నేల మీద సాగిలపడ్డాడు. సీనియర్‌ సైన్యం అదిరిపడిరది.. హమ్మో రాజుగారి బిడ్డంటూ అందరూ మోకాళ్ళేశారు.. ‘‘మీరిప్పుడేస్తున్నారు, నేను రాత్రే వేసేశాను..’’ అని తమన్నా గర్వపడిరది..

కట్‌ చేస్తే..

అప్పటిదాకా అసంతృప్తిగా కూర్చున్న నేను సినిమాలో ఎప్పుడు లీనమయ్యానో తెలియకుండానే విజిళ్లేసేశాను..ఫ్లాష్‌బ్యాక్‌ మొదలయ్యి, కాలకేయుల యుద్ధం పూర్తయ్యి, క్లైమాక్స్కు చేరేసరికి.. రాజమౌళి అనే శిల్పి అప్పటిదాకా యే భారతీయ హీరోలోనూ చూడని గంభీరమైన రాజసాన్ని ప్రభాస్‌ రూపంలో తెరనిండా పరిచేశాడు.

మ్యాన్లీనెస్‌ అనే పదాన్ని కండల ప్రదర్శనకి మాత్రమే పరిమితం చేసేసిన బాలీవుడ్‌ సమీకరణాలకి కోరమీసాన్ని, సూదంటు చూపుల్ని బోనస్సుగా అందించి ఇన్నాళ్ళూ వాళ్ళేం కోల్పోయారో స్పష్టంగా చెప్పాడు ప్రభాస్‌. ఆ దెబ్బకి.. బీ గ్రేడు హిందీ యాక్షన్‌ సినిమాలు మాత్రమే ఆడే బీహార్‌లాంటి మారుమూల సెంటర్లలో సైతం మహారాజుగా వెలుగులు విరజిమ్ముతూ, ఖాన్లకి మొగుడయ్యి కూర్చున్నాడు నేటికీ..

సినిమా పూర్తయ్యేసరికి బాక్సాఫీస్‌ సాహో అంది.. తెలుగు హయ్యెస్ట్‌ షేర్లన్నీ రెండురోజులకే లేచిపోయి, మూడో రోజు కలెక్షన్లకి నాన్‌-బాహుబలి రికార్డులు అనే కొత్త పేర్లు పెట్టుకోవాల్సొచ్చింది..

‘‘ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..’’ అనే ప్రశ్న అయితే దేశం మొత్తాన్ని రెండేళ్లపాటు వేధిస్తూనే ఉంది.. ఆ ఎదురుచూపులే రెండోపార్ట్‌ విజయాన్ని మూడిరతలు చెయ్యడంలో పదిరెట్లు సాయపడ్డాయి..

ఇవన్నీ బాహుబలి సాధించిన ఘనతలైతే, పరిశ్రమకి దాపురించిన నష్టాలు కూడా కొన్నున్నాయ్‌ మరి.. బాహుబలి లాంటి భారీ రాజుని చూసిన ప్రేక్షకుడి కంటికి సాధారణ/చిన్న స్థాయి సినిమా ఆనడం మానేసి, హాలులో ఆడడం తగ్గిపోయింది ఎంతో బాగుందని పేరొస్తే తప్ప.. ఎవరికివాళ్ళు తమకో బాహుబలి తీసిపెట్టాలనే అనవసరపు అవసరాల్ని సృష్టించేసుకునేసరికి, నిర్మాత ఉక్కిరిబిక్కిరైపోవడం మొదలెట్టాడు. ఏడాదికో సినిమానైనా అందిస్తూ పరిశ్రమకి చేతినిండా పని దొరికేలా చేసిన హీరోలు, భారీతనం పేరుతో బిగుసుకుపోయి బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్లైపోయారు.. ఏమన్నా అంటే క్వాలిటీ ముఖ్యమనే చిలకపలుకులు నేర్చేసి, నెపాన్ని ప్రేక్షకుల మీదకి నెట్టేశారు.. ఇందులో క్రెడిట్‌ ఏమైనా ఉంటే అది మొత్తం రాజమౌళిగారిదే.. ప్రాంతీయ సినిమాకి పానిండియా రోగం అంటించి, ప్రచారశైలిని, విడుదలస్థాయిని కూడా సమూలంగా మార్చేసిన దర్శక మాయావి.. తెలుగుతెర మైదానం మీద భారీబడ్జెట్టనే గారడీబీజం మొలకెత్తించి, ఆ వ్యాపారవృక్షం కింద కాసులు రాల్చుకోవడమెలాగో నేర్పిన వాణిజ్య నిపుణుడు.. గుప్పున గుభాళించే కరెన్సీకట్ట గురించి ఏమంటామండీ, అద్దాల బీరువాలోంచి చూస్తూ కళ్ళకద్దుకోవడం తప్ప..! కాబట్టి నో కామెంట్స్‌..

అన్నట్టు.. ఈ బాహుబలి 1, 2లో తమన్నాకి డూపుగా నటించిన ఆరాధనా సింగ్‌ అనబడే ఓ జూనియర్‌ ఆర్టిస్టు.. తన పోలికలతోనే ఉండే కవలచెల్లెలికి యే రకంగానూ తను పోటీ కాకూడదని భావించి, ఫీల్డు నుంచి తప్పుకుని జాబు వెతుక్కుంటూ విదేశాలకొచ్చేసి, కాలక్రమంలో మా కంపెనీలోనే సేల్స్‌ విభాగంలో పనికి కుదురుకుంటుందని.. అప్పుడప్పుడూ నైట్‌ షిఫ్టులప్పుడు దొర్లే మా కబుర్ల మధ్యలో ఆ షూటింగ్‌ విశేషాలవీ చెప్తూ తన గాజుకళ్ళు తడిచేసుకుంటుందని.. అప్పట్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు యే మాత్రం నా ఊహకందని విషయం..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page