ఆ కార్యాలయాలే.. అధికార కేంద్రాలు!
- Guest Writer
- 5 hours ago
- 3 min read
అధికార వికేంద్రీకరణే వీటి ధ్యేయం
ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పాదుగొన్న వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పరిపాలన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యవేక్షణలో నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన ఎమ్మెల్యే కార్యాలయాలు నేడు ప్రభుత్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులను పరుగులు తీయించి వేగంగా పనులు చేయించడం ద్వారా ఈ వ్యవస్థ ప్రజలకు ఆసరాగా నిలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులతో ఎమ్మెల్యేలు తమ కార్యాలయాల్లోనే సమావేశపర్చి సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఈ కార్యాలయంలోనే అధిక సమయం గడుపుతూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వారు స్థానికంగా లేని సమయాల్లో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌ఛార్జీలు వినతులు స్వీకరిస్తారు.
రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిపాలన, నిధుల వినియోగంపై శాసనసభకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రజల డిమాండ్లు, సమస్యలను అసెంబ్లీ వరకు తీసుకెళ్లడానికి ఒక అధికారిక వేదిక అవసరం. ఇందుకోసమే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఎమ్మెల్యేల జీతభత్యాలతో పాటే ఈ కార్యాలయాల నిర్వహణ ఖర్చులను చట్టబద్ధంగా ఆమోదిస్తుంది. గెజిటెడ్/నాన్-గెజిటెడ్ ఉద్యోగులను ఈ కార్యాలయాలకు సహాయకులుగా కేటాయిస్తుంది. కార్యాలయంలో ఉండే పర్సనల్ అసిస్టెంట్, ఐటీ టీమ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను వర్గీకరించి ఎమ్మెల్యే సంతకంతో కూడిన సిఫార్సు(డీవో) లేఖలు సిద్ధం చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహార శైలిని గమనిస్తే సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేసే స్పష్టమైన దార్శనికత కనిపిస్తుంది. తాత్కాలిక ఉపశమనం కలిగించే పథకాలతోపాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమలు చేసే విధానాలు ‘ప్రజల ముందే ప్రభుత్వం’ ఉందనే భావన కలిగిస్తాయి. సాంకేతికతను సామాన్య ప్రజల చెంతకు చేర్చడంలో భాగంగా ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని ఒకేచోట పర్యవేక్షించడానికి ఆర్‌టీజీ స్టేట్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనివల్ల నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తక్షణమే స్పందించే వీలుంటుంది. ప్రతి ఇంటికీ తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ సౌకర్యాన్ని అందించే ఏపీ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ వెనుక గ్రామీణ ప్రజలను డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించాలనే ముందుచూపు ఉంది. కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ సంస్థలను అనంతపురం వంటి వెనుకబడిన ప్రాంతానికి తీసుకురావడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించి అభివృద్ధి వికేంద్రీకరణకు దారులు తెరిచారు. పొదుపు సంఘాల విప్లవానికి ఆయనే మూలకారకుడు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధిస్తేనే కుటుంబం, సమాజం బాగుపడుతుందనే ముందుచూపుతో కోట్లాది మంది మహిళలను ఇందులో భాగస్వాములను చేశారు. గతంలో ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి, ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు ప్రజాసమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించడానికి దోహదపడ్డాయి.
దీర్ఘకాలిక ప్రభావం
చంద్రబాబునాయుడు గతంలో ప్రతిపాదించిన విజన్ 2020 నుంచి ప్రస్తుత అభివృద్ధి ప్రణాళికల వరకు పరిశీలిస్తే ఆయన ఆలోచనా విధానం ఎప్పుడూ ‘రేపటితరం బాగుండాలి’ అనే కోణంలోనే సాగుతుందని అర్థమవుతుంది. సంక్షేమ పథకాల ద్వారా తక్షణ సహాయం అందిస్తూనే శాశ్వత ఆర్థిక వృద్ధి కోసం ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడమే ప్రజల పట్ల ఆయనకున్న ముందుచూపునకు నిదర్శనం. దాన్నే ఎమ్మెల్యే కార్యాలయాలు ఇప్పుడు అమలు చేస్తున్నాయి. రేషన్ కార్డు రాకపోయినా, పెన్షన్ ఆగిపోయినా, భూమి వివాదాలు ఉన్నా గతంలో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలు ఇప్పుడు నియోజకవర్గ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఈ కార్యాలయాలు సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా ఈ కార్యాలయం గైడెన్స్ ఇస్తుంది. గ్రామాల్లో లేదా వార్డుల్లో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రజలు స్థానిక నాయకులతో కలిసి ఇక్కడికి వస్తారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆయా పనులకు నిధులు మంజూరు చేసేలా ఇక్కడే ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. పేద ప్రజల వైద్య అవసరాలు తీర్చే ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా ఈ కార్యాలయం ద్వారానే జరుగుతున్నది. ఆస్పత్రి బిల్లులు, దరఖాస్తులను ఇక్కడ పరిశీలించి, ఎమ్మెల్యే అటెస్టేషన్‌తో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నారు. ఎమ్మెల్యే ఇచ్చే సిఫార్సు లేఖల ద్వారా ప్రభుత్వ అధికారులు ఆయా సమస్యలపై త్వరితగతిన స్పందించి పరిష్కరిస్తారు.
జాతీయస్థాయిలో రోల్ మోడల్
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తున్నది. అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంత రాష్ట్రాల్లో ఇక్కడ భౌగోళిక పరిస్థితుల వల్ల నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండటం కష్టం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక స్వపరిపాలన (పంచాయతీరాజ్) వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు స్థానిక మున్సిపల్ లేదా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులతో కలిసిపోయి అధికారిక విధులు నిర్వహిస్తాయి. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు మారినా నియోజకవర్గ కార్యాలయం అనే వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఇది కేవలం ఒక పార్టీ ఆఫీస్ కాదు, ఇది ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే చట్టబద్ధమైన ‘అధికారిక విస్తరణ వేదిక’. ప్రభుత్వ సిస్టమ్‌లో ఒక అప్లికేషన్ లేదా ఫైల్ ఎలా కదులుతుందో నియోజకవర్గ కార్యాలయం కూడా అదే చట్టబద్ధమైన ప్రోటోకాల్‌ను అనుసరిస్తుంది. నియోజకవర్గ కార్యాలయం కేవలం ఒక రాజకీయ అడ్డాలా కాకుండా ఒక రిసోర్స్ అండ్ గవర్నెన్స్ సెంటర్‌లా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం రెట్టింపు అవుతుందని ఈ విధానం నిరూపిస్తోంది.
నౌపడా సత్యనారాయణ,
కార్యాలయ కార్యదర్శి,
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ,
భారత్ పార్లమెంటరీ భవన్.






Comments