top of page

కత్తులతో కాదు.. కథలతోనే యుద్ధం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 day ago
  • 3 min read
  • మావిగన్ వర్సెస్ అమరావతి సెల్ఫ్‌గోలా? మాస్టర్ స్ట్రోకా?

  • ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చేలా దీర్ఘకాలిక స్పెచ్

  • ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని ఆరు నెలలుగా ఘోషిస్తున్న ధర్మాన

  • కోర్ ఓట్‌బ్యాంకే లక్ష్యంగా డిఫెన్సివ్ ట్రాప్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

“అక్కడెక్కడో అమరావతిలో లక్షల కోట్లు పోసి భారీ నిర్మాణాలు చేపట్టి చంద్రబాబు అమరావతి కడతారట. వెనుకబడిన ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి పరిస్థితి ఏమిటి?” ఇదీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్‌లో చేసిన వ్యాఖ్యలు.

“ఉత్తరాంధ్ర సంపద ఎప్ప్పుడూ పెద్దోళ్ల ప్రాంతాల అభివృద్ధికి తరలించడమేనా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీకాకుళంలలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేశారని చూపించండి”.. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో ధర్మాన ఇచ్చిన స్టేట్‌మెంట్.

“చెత్త నుంచి సంపద సృష్టిస్తానని బాబు చెబుతున్నారు.. సంపదంతా అమరావతికి తీసుకుపోతున్నారు.. చెత్తను మాత్రం ఇక్కడే వదిలేస్తున్నారు. తరాలు మారినా శ్రీకాకుళం తలరాత మారకపోవడం అన్యాయం.” ఇది కూడా ధర్మాన వ్యాU్యలే. దీన్నే పొలిటికల్ నెరేటివ్ అంటారు.

ఎన్నికల్లో ఎప్పుడూ ప్రజల్ని గెలవరు.. ముందు వాళ్ల ఆలోచనల్ని గెలుస్తారు. ఇక్కడ ధర్మాన అదే చేస్తున్నారు, జగన్మోహన్‌రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అని స్టేట్‌మెంట్ ఇవ్వడంలో అంతరార్ధం కూడా అదే.

మÖడు రాజధానులు ఫెయిల్ అయినచోట, అమరావతి రాజధానికి ఓటేసిన చోట ఇంకా ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లు స్థానిక నెరేటివ్‌ను అందుకోవడం వ్యూహంలో భాగమే. ఒక్కసారి ఎన్నికల ముందు తమ ప్రాంతానికి ఏం జరిగిందని ఓటరు ఆలోచిస్తే రిజల్ట్ తలకిందులైపోతుంది. సరిగ్గా అదే వ్యూహాన్ని జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్నారు. జగన్‌తో జరగాల్సిన భేటీ ఆలస్యమైనా ధర్మాన ఈ నెరేటివ్‌నే జిల్లాలో బలంగా తీసుకువెళ్తున్నారు. వైకాపా చీఫ్ జగన్మోహన్‌రెడ్డి అమరావతి వర్సెస్ మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని కుండబద్దలుకొట్టడంతో వైకాపాలో ఈ ఇద్దరు నేతలు రాబోయే ఎన్నికలకు ముందే అజెండా సెట్ చేసినట్లు అర్థమవుతుంది.

మావిగన్ వర్సెస్ అమరావతి.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన ఈ కొత్త పదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. చాలామంది దీన్ని వైకాపా వేసుకున్న పొలిటికల్ సెల్ఫ్ గోల్ అనుకుంటున్నారు. ప్రత్యర్థులకు వాళ్లే పెద్ద ఆయుధాన్ని ఇచ్చారని నవ్వుకుంటున్నారు. ఫస్ట్ టైం ఈ మాట విన్నప్పుడు సొంత పార్టీ సపోర్టర్లు కూడా ఏదో ఉదాహరణకు అన్నారనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే జగన్ నిజంగానే మావిగన్‌ని తమ ఎలక్షన్ ఎజెండాగా ఎన్నుకున్నారని అర్థం అవుతుంది.

పైపైన చూసే ఎవరికైనా ఇది పెద్ద రిస్క్ లాగే కనిపిస్తుంది. ఒకపక్క అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. ఇలాంటి టైమ్‌లో కొత్తగా మావిగన్ అనే భావనను జనాల ముందుకు తేవడం ఆశ్చర్యకరమే. ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేని విషయంతో ఎన్నికలకు వెళ్లడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ప్రత్యర్థి చూసే బోర్డు ఒకటి అయితే, ఎత్తు వేసిన నాయకుడు చూసే యాంగిల్ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ జగన్ ఒక కొత్త ఫ్రేమ్‌ని సెట్ చేయాలని చూస్తున్నారు.

ఎన్నికల్లో ఎలాంటి చర్చ జరగాలి అనే అజెండాను ముందుగానే నిర్ణయించే ప్లాన్ ఇది. దీన్నే అజెండా సెట్టింగ్ లేదా నెరేటివ్ ఫ్రేమింగ్ అంటారు. ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లెక్కను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతి ఎన్నిక కొత్త ఓటర్ల కోసం జరిగే పోరాటం కాదు. చాలా సందర్భాల్లో అది కోర్ ఓటర్ బేస్‌ను కాపాడుకునే యుద్ధం. గత ఎన్నికల్లో వైకాపాకు 11 సీట్లే వచ్చాయి. కానీ ఆ కూటమి గాలిలో కూడా జగన్‌కి దాదాపు 39.4 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఈ మావిగన్ నినాదంతో కొత్తగా తటస్థ ఓటర్లు ఎవరూ ఇప్పుడే పరిగెత్తుకుంటూ రారు అని ఆయనకు తెలుసు. తనకున్న ఆ 40 శాతం కోర్ ఓటర్ బేస్‌ని ఒకే తాటిపై ఉంచడానికి వేసిన ఒక డిఫెన్సివ్ ట్రాప్ ఇది. కొత్త రాజ్యాలు గెలిచే ముందు సొంత కోట ముక్కలు కాకుండా చూసుకోవడం మాకియవెల్లీ స్టైల్. ఆమధ్య ధర్మాన ఓ ప్రెస్‌మీట్‌లో తత్త్వవేత్త మాకియవెల్లీ కోట్స్‌ను వరుసగా ఉదహరించడం యాదృచ్చికం కాదని ఇప్ప్పుడు అర్థమవుతుంది.

అమరావతిలో అవినీతి జరిగింది, పేదల సొమ్ము అక్కడ పెట్టారనే పాత ఆయుధంతో కొత్త యుద్ధం గెలవలేమని జగన్ గ్రహించినట్టున్నారు.. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా దాన్ని లీగల్‌గా నిరూపించలేనప్పుడు, మళ్లీ అదే పాత పాట పాడితే జనాలు బోర్ ఫీలవుతారు. ఆ ఆయుధాలు మొద్దుబారిపోయాయి. అందుకే జగన్ ఇక్కడ ఒక కొత్త ఎకనమిక్ నెరేటివ్‌ని ముందుకు తెచ్చారు. శూన్యం నుంచి ఒక సరికొత్త మెగా సిటీని కట్టడానికి లక్షల కోట్లు అప్పులు తేవడం అవసరమా? లేక ఇప్పటికే ఉన్న నగరాలను (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కలుపుతూ 110 కిలోమీటర్ల పొడవైన గ్రోత్ కారిడార్‌ని డెవలప్ చేయడం ఈజీనా? సామాన్య పన్ను చెల్లింపుదారుడి మైండ్‌లో ఈ ప్రాక్టికల్ ప్రశ్న నాటడమే ఆయన వ్యూహం. ఖర్చు తక్కువ, ప్రయోజనం ఎక్కువ అని చెప్పడం సులభం. దీన్నే వైకాపా సపోర్టర్లు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటున్నారు.

ఒకసారి ప్రజల మనసులో... ‘మా జిల్లాకి ఏమొచ్చింది?’ అనే ప్రశ్న మొదలైతే.. ఆ ఎన్నిక అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ వ్యూహంలో ఉన్న ఇంకో పెద్ద యాంగిల్ ప్రాంతీయ అసంతృప్తి. అమరావతి కోసం భారీగా నిధులు వెళ్తున్నాయనే భావన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెరిగితే, ‘మా జిల్లాకి ఏమొచ్చింది?’ అనే ప్రశ్న రాజకీయంగా మారే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే భావోద్వేగాన్ని జగన్ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడనే వాదన వినిపిస్తోంది.

మా ప్రాంతాల ప్రాజెక్టులకు, రోడ్లకు పైసలు లేవు కానీ అక్కడ మాత్రం అంత పెడుతున్నారనే భావన రావడం సహజం. ఇలాంటి ప్రాంతీయ అసూయను జగన్ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ప్రజలు తెలివిగల వాళ్లే, కానీ ఎప్పుడూ తమ సొంత ప్రాంత ప్రయోజనాలనే చూసుకుంటారు. జగన్ ఆడుతున్నది అమరావతి ఓట్ల కోసం కాదు, అమరావతి వెలుపల ఉన్న మెజారిటీ ఓటర్ల సైకాలజీతో. ప్రజా క్షేత్రంలో ఈ ప్రాంతీయ అసంతృప్తిని ఆయుధంగా మార్చుకోవడం పక్కా సెంటిమెంట్ ఇంజనీరింగ్. అయితే ఈ వాదనకు అంతే బలమైన ప్రతివాదనలు ఉన్నాయి.

ప్రతి వ్యూహానికీ ఒక పరీక్ష ఉంటుంది. అది ఎన్నికల ఫలితం. అంటే ప్రాంతీయ కార్డు ఎప్పుడూ అనుకున్నట్టు పని చేయదు. 2019లో రాజధాని ప్రాంతంలో టీడీపీ ఓడింది. 2024లో వైజాగ్ రాజధాని అంటే ఆ ప్రాంతంలో ఒక్క సీటూ వైకాపాకు రాలేదు. అంటే రాజధాని అనేది ఎప్పుడూ ఒక అంశం మాత్రమే, అదే మొత్తం రాజకీయం కాదు. రాష్ట్ర సంపద కొద్దిమందికి కాదు, అన్ని ప్రాంతాలకూ చేరాలనే సందేశాన్ని బలంగా నాటగలిగితే అది ఆయన కోర్ బేస్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

ప్రతి వ్యూహానికి ఒక ధర ఉంటుంది. ఈ మావిగన్ అనేది ఎక్కువ రిస్క్ ఉన్న ఒక పొలిటికల్ ఇన్వెస్ట్‌మెంట్. 40 శాతం వైకాపా ఓట్ బేస్‌కు మరో ఐదారు శాతం ఓట్లు తోడైతే చాలు, సమీకరణాలు మొత్తం మారిపోతాయి. ఇది ఇప్పటి కోసం కాదు, రేపటి ఎన్నికల కోసం వేస్తున్న దీర్ఘకాలిక స్కెచ్. శత్రువు బలాన్ని బలహీనతగా మార్చే మైండ్ గేమ్ ఇది.

శక్తి ఎప్పుడూ ఒకే చోట నిలవదు. అధికారమూ శాశ్వతం కాదు, శత్రువులూ శాశ్వతం కాదు. మారుతూ ఉండేది ఒక్కటే, మనిషి తన ప్రయోజనాన్ని వెతికే స్వభావం. ఆశలు, నిరాశలు, భయాలు నిరంతరం మారుతూ ఉంటాయి. జగన్ ఈ మావిగన్ ఆటతో తన కోటను కాపాడుకోవాలని చూస్తున్నారు. కూటమి వాళ్లు దాన్ని సెల్ఫ్ గోల్‌గా చూస్తున్నారు. చరిత్రలో చాలా యుద్ధాలు కత్తులతో గెలవలేదు. కథలతో గెలిచాయి. ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ఈసారి గెలిచేది అమరావతి కథనా? మావిగన్ కథనా? లేక రెండింటినీ తిరస్కరించే కొత్త కథనా? జవాబు ఒక్క ప్రజల దగ్గరే ఉంది. రాజకీయాల్లో కనిపించే ప్రతి తప్పు.. నిజంగానే తప్పేనా? మావిగన్ సెల్ఫ్ గోలా... లేక మాస్టర్ స్ట్రోకా?



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page