ఆంధ్ర కింగ్ తాలూకా.. సినీ అభిమానికి పట్టాభిషేకం
- Guest Writer
- 2 hours ago
- 4 min read

ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు రామ్. అతను చేసిన మాస్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఈసారి రామ్ రూటు మార్చి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే వైవిధ్యమైన సినిమా చేశాడు. ఇది ఒక స్టార్ హీరోను అభిమానించే ఫ్యాన్ కథ కావడం విశేషం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రామ్ చేసిన విభిన్న ప్రయత్నం ఫలితాన్నిచ్చిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
సూర్య (ఉపేంద్ర) ఒక పెద్ద సినిమా హీరో. ఎంతో వైభవం చూసిన ఆ హీరో.. ఒక దశలో వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటాడు. తన వందో సినిమా అర్ధంతరంగా ఆగిపోతుంది. సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి సూర్య చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. పత్రికలో అతడికి వ్యతిరేకంగా వార్తలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను తిరిగి మొదలు పెట్టడానికి అవసరమైన సాయాన్ని ఒక అజ్ఞాత వ్యక్తి సూర్యకు అందిస్తాడు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే తన వీరాభిమాని అయిన సాగర్ (రామ్) అని సూర్యకు తెలుస్తుంది. దీంతో ఆ అభిమానిని కలవాలనుకుంటాడు సూర్య. ఇంతకీ సాగర్ ఎవరు.. తన కథేంటి.. తన హీరో కోసం ఈ సాయం అతనెందుకు చేశాడు.. తన లక్ష్యమేంటి.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో స్టార్ హీరోగా నటించిన ఉపేంద్ర పేరు.. సూర్య. ఆయన వీరాభిమానిగా నటించిన రామ్ పేరు.. సాగర్. ఒక సన్నివేశంలో సముద్రం -సూర్యుడు కలిసిపోయినట్లుగా ఉన్న ఒక దృశ్యాన్ని చూపిస్తూ హీరో ఫ్రెండు.. ‘‘చూశావా రా.. సాగర్-సూర్య ఇద్దరూ కలిసిపోయినట్లే ఉంటారు.. కానీ ఎప్పటికీ కలవరు’’ అంటాడు. బదులుగా హీరో ‘‘కలవకపోయినా చూడ్డానికి బాగుంది కదరా’’ అంటాడు. ఒక స్టార్ హీరోకు.. అభిమానికి మధ్య ఉండే బంధాన్ని దర్శకుడు మహేష్ బాబు ఎంత అందంగా చెప్పాడో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ‘బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్’ అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమా తీశారంటే.. సినీ అభిమానుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నంలా అనిపించొచ్చు. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆ కోవకు చెందిన సినిమా కాదు. ఇందులో సినీ హీరోల మీద అభిమానుల్లో ఉండే పిచ్చి ప్రేమను గ్లోరిఫై చేసి చూపించలేదు. అలా అని దాన్ని తక్కువ చేయనూ లేదు. రెంటికీ మధ్య సమతూకం పాటిస్తూ నిజాయితీగా చేసిన ప్రయత్నమే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. కొంచెం నెమ్మదిగా సాగడం.. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం.. కథ మధ్యలోకి వచ్చాక ఎలా ముందుకు సాగుతుందో ఒక అంచనాకు వచ్చేయడం.. లాంటి చిన్న చిన్న ప్రతికూలతలున్నా వాటిని మరిపించే మ్యాజిక్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో ఉంది.
సినిమాలు చూస్తే ఏమొస్తుంది.. హీరోలను వెర్రిగా ఆరాధించడం వల్ల కలిగే లాభమేంటి.. మీరెవరో కూడా తెలియని హీరోల కోసం ఈ అభిమానమేంటి.. అనే ప్రశ్నలు మన చుట్టు పక్కల ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఐతే వెర్రి అభిమానంతో సమయాన్ని వృథా చేస్తూ పాడైపోయిన వాళ్లూ ఉంటారు. అదే సమయంలో సినీ హీరోల నుంచి స్ఫూర్తి పొంది తమ జీవితాలను దిద్దుకున్న.. ఎంతో మంచి చేస్తున్న వాళ్లూ ఉంటారు. ఈ రెండో కోవకు చెందిన వాళ్లు తక్కువే కావచ్చు. అలాంటి ఒక అభిమాని కథనే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో చూస్తాం. అలా అని మరీ సినిమాటిగ్గా.. ఎగ్జాజరేషన్లతో సినిమాను నింపేయకుండా.. వీలైనంత మేర రియలిస్టిగ్గా ఈ కథను చెప్పే ప్రయత్నమే చేశాడు మహేష్ బాబు. ఒక అభిమాని తన హీరో కోసం ఎంత దూరం వెళ్తాడనే నేపథ్యంలోనే సినిమా సాగినప్పటికీ.. రియల్ ఫిలిం ఫ్యాన్స్ దీన్ని చూసి తప్పుదోవ పట్టకుండా ఒక సానుకూల కోణంలోనే ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. చిన్నతనంలో ఆత్మవిశ్వాస లోపంతో తడబడే హీరో.. తన అభిమాన కథానాయకుడి డైలాగుతో ఆ ఇబ్బందిని అధిగమించడం నుంచి మొదలుపెట్టి.. తన ప్రేమకు- తన హీరో మీద అభిమానానికి ముడిపెట్టి చేసే ఒక సవాలులో భాగంగా తన జీవితాన్ని బాగు చేసుకోవడంతో పాటు తన ఊరి ముఖచిత్రాన్నే మార్చే వరకు ఈ కథ సాగుతుంది. ఇలా ఫ్యానిజాన్ని పాజిటివ్ కోణంలో చూపించే కథ కోసం.. అక్కడక్కడా దర్శకుడు కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్న మాట వాస్తవం. కానీ అవి మరీ అతిగా ఏమీ అనిపించవు.
ఒక ఊరిలో కరెంట్ సహా ఏ సౌకర్యం లేకపోయినా సరే గుడి మాత్రం తప్పకుండా ఉంటుందంటూ.. అలా ప్రతి చోటా గుడి కట్టడం వెనుక స్ఫూర్తి ఏంటో రావు రమేష్ పాత్రతో చెప్పించిన ఒక సన్నివేశం.. అందులోని డైలాగులు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కథను దర్శకుడు ఎంత నిజాయితీతో.. పరిణతితో చెబుతున్నాడో చెప్పడానికి ఆ సన్నివేశం ఒక ఉదాహరణ. సూర్యుడు-సముద్రం కలవనట్లే హీరో-అభిమాని ఎప్పుడూ కలవరనే సంకేతం ఇచ్చి.. ఒకవేళ వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. హీరోను వెతుక్కుంటూ అభిమానులు వెళ్లడం మామూలే.. ఒకవేళ హీరోనే అభిమానిని వెతుక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఇందులో చూస్తాం. మరి ఈ ప్రయాణంలో తన అభిమాని గురించి అతనేం తెలుసుకున్నాడు.. తన కథ తెలిసి ఎలా కదిలిపోయాడు.. తన నుంచి ఎలా స్ఫూర్తి పొందాడనే నేపథ్యంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. స్టార్ హీరోగా ఉపేంద్ర కనిపించేది కాసేపే. మిగతా సినిమా అంతా అభిమాని కథనే చూస్తాం. కానీ ‘హీరో’ ప్రభావం సినిమా అంతా ఉంటుంది. తన చుట్టూనే కథంతా తిరుగుతుంది.
ఒక అభిమాని జీవితంలో తన హీరో ఒక భాగం అయిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో చూస్తాం. తన చదువు.. తన ప్రేమ.. తన కుటుంబం.. తన ఉపాధి.. తన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు.. వాటిని అధిగమించడానికి అతను చేసే ప్రయత్నం.. ఇలా ప్రతిదాంట్లోనూ ‘హీరో’తో కనెక్షన్ ఉంటుంది. ఈ నేపథ్యం కొత్తది కావడం వల్ల సినిమాలో కొత్త సీన్లు చూస్తాం. హీరో ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డు పడడం.. అతడికి హీరో ఛాలెంజ్ విసరడం.. ఆ ఛాలెంజ్ లో భాగంగా జీవితంలో ఎదగడం.. ఇవన్నీ అన్ని సినిమాల్లో చూసే సీన్లే కానీ.. ఇక్కడ ‘హీరో’తో ఉన్న కనెక్షన్ వల్ల కథనం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈ కథకు ఎక్కడా పనిగట్టుకుని కమర్షియల్ హంగులు అద్దే ప్రయత్నం చేయకుండా.. నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేయడం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఎక్కడా ఫోర్స్డ్ గా అనిపించదు. సినిమాలో ఏదీ హడావుడిగా జరిగిపోదు. కొంచెం టైం తీసుకునే ఈ కథను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల సినిమా కొంచెం నెమ్మదిగా అనిపించొచ్చు. ముఖ్యంగా ప్రథమార్ధంలో పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కు టైం పడుతుంది. ప్రేమకథ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కానీ ప్రి ఇంటర్వెల్ ముంగిట కథలో మలుపు దగ్గర్నుంచి కథనం ఊపందుకుంటుంది. అక్కడి నుంచి బలమైన ఎమోషన్లు.. హృద్యమైన సన్నివేశాలతో చివరి వరకు సినిమా మంచి టెంపోతో సాగుతుంది. సెకండాఫ్ లో టూరింగ్ టాకీస్ సీన్లు ఉత్సాహం నింపుతాయి. పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదొక ఫ్యాన్ ఫెస్టివల్. సినిమాలంటే పడిచచ్చే.. సినీ హీరోలను దేవుళ్లలా ఆరాధించే అభిమానులకు ఇదొక ట్రిబ్యూట్. నేను ఫలానా హీరోట అభిమానిని అని చెప్పుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్టవుతుంది.
నటీనటులు - పెర్ఫార్మెన్స్ :
రామ్ లో మంచి పెర్ఫామర్ ఉన్నాడని అందరికీ తెలుసు. అతను ఎక్కువ హడావుడి చేయకుండా సటిల్ గా ఉండే పాత్రలు చేసినప్పుడుతనలోని పెర్ఫామర్ బయటికి వస్తాడు. కానీ ఎక్కువగా రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ ఆ పెర్ఫామెన్సునంతా లోపలే కప్పెట్టేస్తున్న రామ్.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో నటుడిగా విజృంభించాడు. ఎక్కడా అతి చేయకుండా.. చాలా కుదురుగా నటిస్తూ సాగర్ పాత్రను అద్బుతంగా పండిరచాడు. లుక్.. బాడీ లాంగ్వేజ్ సహా అన్నీ మార్చుకుని సరికొత్త రామ్ ను చూపించాడిరదులో. ఈ పాత్రలో తన నటన చూశాక కొత్తగా అతడికి అభిమానులు తయారైతే ఆశ్చర్యం లేదు. అంత బాగా చేశాడు ఆ క్యారెక్టర్ని. కథలో.. పాత్రలో ఉన్న సిన్సియారిటీని తన నటనలోనూ చూపించాడు రామ్. స్టార్ హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర కూడా అంతే బాగా నటించాడు. నిజ జీవితంలో ఎంతో హంబుల్ గా ఉండే ఉపేంద్ర చేయడం వల్ల సూర్య పాత్రకు ఒక అథెంటిసిటీ వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే ‘గ్లామర్ డాల్’ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చినట్లే. ‘కాంత’లో అదరగొట్టిన ఆమె.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లోనూ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ భాగ్యశ్రీ మెప్పించింది. ఒక ముఖ్య సన్నివేశంలో తనలోని నటిని చూడొచ్చు. రావు రమేష్.. మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో రాణించారు. తమ అనుభవాన్ని చూపించారు. రాహుల్ రామకృష్ణ.. సత్య.. రాజీవ్ కనకాల.. రఘుబాబు.. తులసి.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగా చేశారు.
సాంకేతిక వర్గం - పనితీరు :
వివేక్-మెర్విన్ సంగీతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు సాంకేతికంగా అతి పెద్ద బలం. కథలో ఉన్న ఎమోషన్ ను అర్థం చేసుకుని వీళ్లిద్దరూ హృద్యమైన సంగీతం అందించారు. ‘నువ్వుంటే చాలు’ వినపొసంపుగానే కాదు కనువిందుగానూ అనిపిస్తుంది. మిగతా పాటలూ బాగున్నాయి. నేపథ్య సంగీతంతోనూ వివేక్-మెర్విన్ బలమైన ముద్ర వేశారు. సిద్దార్థ్ నూని ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. సినిమాను కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. మైత్రీ మూవీ మేకర్స్ మంచి నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారు. మహేష్ బాబుకు.. రచయితగా-దర్శకుడిగా మంచి మార్కులు పడతాయి. అభిమానులు అన్నవాళ్లు లేకుండా సినీ హీరోలు లేదు. ఇండస్ట్రీయే లేదు. కానీ ఆ అభిమాని మీద ఇప్పటిదాకా ఎవ్వరూ సినిమా తీసింది లేదు. ఈ కొత్త ఆలోచనే సినిమాకు ఆయువుపట్టు. ప్రతి సినీ అభిమానీ కనెక్ట్ అయ్యేలా ఈ కథను అతను నిజాయితీగా ఈ కథను తెరకెక్కించాడు. అదే సమయంలో అన్ని వర్గాలూ మెచ్చే స్ఫూర్తిదాయక అంశాలనూ ఈ కథకు జోడిరచాడు. టాలీవుడ్లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments