top of page

ఆయన్ను కదిలిస్తే..విజ్ఞాన విస్ఫోటనమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 14 hours ago
  • 4 min read
  • ఏకంగా 27 ఉద్యోగాలకు ఎంపికైన ఘనత

  • డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లాజివ్స్‌గా ఒక రాష్ట్రానికే బాధ్యత

  • అనేక అంశాల్లో అపారమైన అనుభవం

  • సాంకేతికాంశాల్లో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు

  • అయినా సామాన్యుడిలా నిరాడంబర జీవనం

  • ఇంతటి ప్రజ్ఞావంతుడు మన సోంపేటవాసే కావడం విశేషం



ఒకట్రెండు పోటీ పరీక్షలు రాసి ఒక్క చిన్న ఉద్యోగం సంపాదిస్తేనే.. ఏదో సాధించేసినట్లు.. ఎంతో పెద్ద ఘనకార్యం చేసినట్లు సంబరపడిపోతాం, పండుగ చేసుకుంటాం. అలాంటిది ఆయన రెండు కాదు మూడు కాదు.. ఏకంగా 27 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అన్నీ ఉన్నతస్థాయివే!

అలా అని.. ఆయనేదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వారనుకుంటే పొరపాటే. ఆయనది పక్కా గ్రామీణ ప్రాంతం. సగటు ఉద్యోగి కుటుంబం. పైగా చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. పోనీ.. కోచింగ్‌ సెంటర్లలో చేరి సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారా అంటే అదీ లేదు. అంతా సొంత సాధనే.

చేస్తున్న ఉద్యోగం.. పేలుడు పదార్థాల నియంత్రణ అధికారిగా.. దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు గాక.. కానీ ఒకవిధంగా చెప్పాలంటే ఐఏఎస్‌ అధికారులైన కలెక్టర్లకంటే ఉన్నత హోదా, అధికారం కలిగిన పోస్టు. అయితే ఆ హోదా, దర్జా ఛాయలు ఏమాత్రం కనిపించని బలివాడ రవికుమార్‌ స్వయంగా ఒక విజ్ఞాన బాండాగారం. విషయం ఏదైనా.. ఆయన్ను కదిలిస్తే అనర్గళ ప్రవాహమే. జరిగేది విజ్ఞాన విస్ఫోటనమే.

దాదాపు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం.. ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో మాత్రం అన్ని ప్రాంతాలకు ధీటైనదే. దేశవిదేశాల్లో ఎంతోమంది ఈ జిల్లా మేధావులు రాణిస్తున్నా.. వారంతా బాహ్య ప్రచారానికి దూరంగా తెరవెనుకే ఉండిపోతున్నారు. అటువంటి వారిలో ఒకరైన బెందాళం రవికుమార్‌ను, ఆయన విశిష్టతలను జనావళికి పరిచయం చేయడమే ఈ కథనం ఉద్దేశం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్ర, దేశ పాలనా వ్యవస్థలు చాలా విస్తృతంగా ఉంటాయి. వందలకొద్దీ శాఖలు, విభాగాలు నిరంతరం ప్రజల క్షేమం కోసం, వ్యవస్థలు గాడి తప్పకుండా చూడటంలో నిమగ్నమై ఉంటాయి. అదే సమయంలో ప్రజా సంక్షేమానికి, సమాజాభివృద్ధికి నిరంతరం పని చేస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని పాలనా వ్యవస్థలు మాత్రమే తెరపైన కనిపిస్తుంటాయి. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటాయి. కానీ ప్రజాబాహుళ్యానికి తెలియకపోయినా.. వారి కోసమే పని చేసే శాఖలు, విభాగాలు చాలానే ఉన్నాయి. అటువంటి వాటిలో పేలుడు పదార్థాల నియంత్రణ విభాగం ఒకటి. దీని కార్యకలాపాలు బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా ఇది అత్యంత కీలక విభాగం. ఈ విభాగానికే బలివాడ రవికుమార్‌ డిప్యూటీ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. డిప్యూటీ కంట్రోలర్‌ అంటే ఒక ఊరికో, ఒక జిల్లాకో పరిమితం కాదు. ఒకటి రెండు రాష్ట్రాలను పర్యవేక్షించే హోదా, అధికారం కలిగిన పోస్టు. ఆ లెక్కన చూస్తే ఒక జిల్లాకో, ఒక విభాగానికో అధిపతులుగా పని చేసే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ (కలెక్టర్‌, ఎస్పీ) పోస్టుల కంటే ఇది చాలా పెద్దదని లెక్క. బాణసంచా తయారీకి దేశంలోనే ప్రసిద్ధి పొందిన శివకాశీ కేంద్రంగా తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న రవికుమార్‌ సొంత జిల్లా శ్రీకాకుళమే. సోంపేట ఆయన స్వగ్రామం. ఆయన కుటుంబీకులు అక్కడే ఉంటున్నారు.

సామాన్య కుటుంబం

రవికుమార్‌ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. తండ్రి మోహనరావు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో సూపర్‌వైజర్‌గా, మేనేజర్‌గా పని చేశారు. తల్లి జయలక్ష్మి గృహిణి. ముగ్గురు సోదరీమణులు ఉండగా వారంతా టీచర్లుగా పని చేస్తున్నారు. వారే తనకు స్ఫూర్తి అని చెప్పే రవికుమార్‌ ప్రత్యేకించి రెండో సోదరి శాంతిని తనకు గైడ్‌గా భావిస్తానన్నారు. 19 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె కష్టపడి టీచర్‌ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలిచిన విధానం తనపై ఎంతో ప్రభావం చూపిందంటారు. ఈయన సోంపేటలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే ప్రాథమిక, ఇంటర్‌ విద్య పూర్తిచేసిన రవికుమార్‌ విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కెమికల్‌ ఇంజినీరింగ్‌(బీటెక్‌) చేశారు. అనంతరం కాన్పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశారు. దానికి ముందే బాబా ఆటమిక్‌ సెంటర్‌లో శిక్షణకు ఎంపికైనా చేరలేదు.

ఎన్నో ఉద్యోగాలకు ఎంపిక

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివినా.. స్వయం ప్రతిభతో ర్యాంకులు సాధించిన రవికుమార్‌ పోటీ పరీక్షల్లోనూ రాణించి దాదాపు 27 ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కొన్ని ఉద్యోగాల్లో చేరినా మనసుకు నచ్చక కొన్నింటిని, ఉన్నత అవకాశాల కోసం మరికొన్నింటిని వదిలేశారు. ఫిన్‌ల్యాండ్‌లోని హెల్సింకిలోని బయోటెక్నాలజీ సంస్థలో క్యాంపస్‌ డ్రైవ్‌లో బయో ఇన్‌ఫర్మేటిక్స్‌ సైంటిస్ట్‌గా ఎంపికై ఎనిమిది నెలలు పని చేశారు. ఐఐటీ కాన్పూర్‌లో ఒక నెల ట్యూటోరియల్‌ లెక్చరర్‌గా చేశారు. 2003లో వరంగల్‌ నిట్‌లోనూ, 2003`04 విద్యా సంవత్సరాల్లో బిట్స్‌ పిలానీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ చేశారు. 2004 నుంచి 2012 వరకు న్యూఢల్లీిలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆఫీసర్‌గా పని చేశారు. అయితే పబ్లిక్‌ సర్వీస్‌ చేయాలన్న ఉన్నత లక్ష్యంతో ఆ ఉద్యోగాన్నీ వదలేసి ప్రస్తుత ఉద్యోగంలోకి మారారు.

యూపీఎస్సీ ద్వారా ఎంపిక

కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలతోపాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర అత్యున్నత సివిల్‌ సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ద్వారానే రవికుమార్‌ డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లాజివ్స్‌గా ఎంపికై ఉద్యోగం సాధించారు. దీన్నే ఐపీఈఎస్‌ఎస్‌ (ఇండియన్‌ పెట్రోలియమ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాజివ్స్‌ సేఫ్టీ సర్వీస్‌) అంటారు. రాతపరీక్ష ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. సివిల్‌ సర్వీస్‌తో దాదాపు సమానమైన ఈ ఉద్యోగాలను గ్రూప్‌`ఏ సర్వీసులుగా వ్యవహరిస్తుంటారు. ఎంపికైన ఉద్యోగులు, అధికారులు పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లాజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(పీఈఎస్‌ఓ) పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉద్యోగానికి 2012లో ఎంపికైన రవికుమార్‌ ఢల్లీి, ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పని చేశారు. 2017`2023 మధ్య విశాఖ కేంద్రం పని చేస్తూ ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి రాష్ట్రాలను పర్యవేక్షించారు. అనంతరం శివకాశీకి బదిలీ అయ్యి తమిళనాడు రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ హోదాలో ఉన్న అధికారులు ప్రమాదకరమైన ఇంధన ఉత్పత్తులతో పాటు మండే గుణమున్న పదార్థాలు, పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్‌ వంటి రసాయనాల తయారీ, వినియోగం, స్టోరేజ్‌, రవాణా, క్రయవిక్రయాలకు అనుమతులు జారీ చేయడం, నియంత్రించడం, క్రమబద్ధీకరించడం వంటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది.

నిరంతర విజ్ఞాన పిపాస

ఉద్యోగం సంపాదించడంతోనే చదువు ముగిసిపోకూడదని నమ్మేవారిలో రవికుమార్‌ ఒకరు. ఏ ఉద్యోగంలో ఉన్నా.. దానితోపాటే చదువు లేదా అధ్యయనం చేయడం ద్వారా జ్ఞాన సముపార్జనను ఒక వ్యసనంగా మార్చుకున్నారు. ఢల్లీిలో ఉన్నప్పుడు ఢల్లీి యూనివర్సిటీకి చెందిన సాయంకాల కళాశాలలో చేరి ఎల్‌ఎల్‌బీ(న్యాయశాస్త్రం) పూర్తి చేశారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ, ఇన్‌ సర్వీస్‌లో భాగంగా గుర్గాం ఐఐపీఎం, అహ్మదాబాద్‌ ఐఐఎంలలో ఎంబీయే చేశారు. కేంద్ర న్యాయశాఖ, హైదరాబాద్‌ నల్సార్‌ల నుంచి భారత రాజ్యాంగంపై అధ్యయనం చేసి మెరిట్‌ సర్టిఫికేట్‌ అందుకున్నారు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి పారిశ్రామిక భద్రత(ఇండస్ట్రియల్‌ సేఫ్టీ) పై పీజీ సర్టిఫికేట్‌ కోర్సు చేశారు. అదే యూనివర్సిటీ నుంచి ఇంధన సాంకేతికత, ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లోనూ సర్టిఫికేట్‌ కోర్సులు చేశారు.

13 పేటెంట్‌ హక్కులు

నిరంతరం కొత్త అంశాలపై అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపే రవికుమార్‌ ఐదు అంశాల్లో ఏకంగా 13 అంతర్జాతీయ పేటెంట్‌ హక్కులు పొందడం విశేషం. అవన్నీ చాలావరకు ఆయా సంస్థలో వాణిజ్య వినియోగంలోకి వచ్చాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పని చేస్తున్నప్పుడు ఇంధన వినియోగంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసే అంశంపై అధ్యయనం చేశారు. హైడ్రోజన్‌`సీఎన్‌జీ టెక్నాలజీ, బయోమాస్‌ గ్యాసిఫికేషన్‌తో పాటు పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధన వినియోగంలో పర్యావరణ హితమైన బీఎస్‌`6 ప్రమాణాలు సాధించడం, గ్రీన్‌ డీజిల్‌, నీటి నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడం వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తుల ఆవిష్కరణలపై అధ్యయనం చేశారు. రవికుమార్‌ రచించిన దాదాపు 20 అధ్యయన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. సుమారు వందమంది వృత్తి నిపుణులు, సాంకేతిక విద్యార్థులకు మెంటార్‌గా వ్యవహరించారు. దేశవిదేశాల్లోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పారిశ్రామిక సంస్థల కార్యక్రమాలకు రవికుమార్‌ మోటివేషనల్‌ స్పీకర్‌గా ఆహ్వానిస్తుంటారు. అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న రవికుమార్‌కు సైన్స్‌, పర్యావరణం, ఇంధనం, విద్య, సంస్కృతి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, చరిత్ర, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ సబ్జెక్టుల్లో అపారమైన ప్రవేశం, పరిజ్ఞానం ఉంది.

జాతీయ, అంతర్జాతీయ అవార్డులు

తన పరిశోధనలు, అధ్యయనాలకు గుర్తింపుగా రవికుమార్‌ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పొందారు. వీటిలో కొన్నింటిని వ్యక్తిగతంగా మరికొన్నింటిని గ్రూప్‌గా అందుకున్నారు. 2008లో వరల్డ్‌ పెట్రోలియం కాంగ్రెస్‌ నుంచి ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకున్నారు. నూతన ఆవిష్కరణల్లో తన పాత్రకు గుర్తింపుగా 2012లో ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు నుంచి 14.9 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌ మంజూరైంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోఫెడ్‌ నుంచి 2014లో జాతీయ ఉత్తమ ఆవిష్కర్త అవార్డు అందుకున్నారు. 2017లో ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన హైడ్రోకార్బన్‌ ప్రాసెసింగ్‌ అవార్డుల్లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ ఇంజినీర్‌ విభాగంలో ఫైనలిస్ట్‌ (ప్రపంచస్థాయిలో టాప్‌ ఫైవ్‌లో ఒకరు)గా నిలిచారు. అలాగే 2018లో అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన అదే హైడ్రోకార్బర్‌ ప్రాసెసింగ్‌ అవార్డుల్లో ప్రపంచ టాప్‌ సిక్స్‌లో ఒకరిగా, ఫైనలిస్ట్‌గా నిలిచారు. రవికుమార్‌ సాధించిన ఘనతల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా అవార్డులు, గుర్తింపులు, గౌరవాలు ఆయన విజ్ఞాన యాత్రలో మెట్లుగా ఉన్నాయి.

ట్రబుల్‌ షూటర్‌

ఉద్యోగ జీవితంలో శాఖాపరంగా, ఇతరత్రా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో దిట్టగా ట్రబుల్‌ షూటర్‌గా రవికుమార్‌ పేరొందారు. ఎటువంటి సమస్యనైనా తన ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, సాంకేతిక ప్రతిభతో పరిష్కరిస్తారన్న పేరు పొందారు. అందువల్లే విధి నిర్వహణలో ఏవైనా సందేహాలు, సమస్యలు ఉత్పన్నమైతే సహ అధికారులు, జూనియర్లు రవికుమార్‌నే సంప్రదిస్తుంటారు. క్లిష్టమైన, తీవ్రమైన అంశాలపై విచారణలను, ఇతర బాధ్యతలను కూడా ప్రభుత్వం ఈయనకే అప్పగిస్తుంటుంది. దేశంలో కోవిడ్‌ ప్రబలినప్పుడు రెండేళ్లపాటు రాష్ట్రంలోని ఆస్పత్రులకు మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాను రవికుమారే పర్యవేక్షించారు. దాంతో పాటు ఆక్సిజన్‌ ఉత్పత్తి, నిల్వ, సరఫరా వంటి అంశాలను కూడా చూసుకున్నారు. ఆస్పత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ, సరఫరాలకు, రైళ్ల ద్వారా రవాణాలకు అవసరమైన అనుమతులను కూడా ఆయనే జారీ చేశారు. విశాఖపట్నంలో పెను విషాదం సృష్టించిన ఎల్‌జీ పాలిమర్‌ స్టెరీన్‌ లీకేజ్‌ ఘటనపై విచారణ జరిపారు. విశాఖ పోర్టులో ముడిచమురు ట్యాంకర్‌(షిప్‌) ప్రమాదానికి గురైన ఘటనపైనా విచారణ నిర్వహించారు. కర్నాటక రాష్ట్రంలో షిమోగాలో జరిగిన పేలుళ్ల కేసుపై కూడా రవికుమార్‌ విచారణ జరిపారు.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page