సంక్షేమం నిండా అక్రమాల ‘దుమ్ము’!
- BAGADI NARAYANARAO
- 3 days ago
- 3 min read
డీడీ తరఫున వార్డెన్ల సంఘం ప్రతినిధే వసూళ్లు
విధులు వదిలేసి జిల్లా కార్యాలయంలోనే తిష్ట
వార్డెన్ల బదిలీలు, పోస్టింగులు, ఇతర వ్యవహారాల్లో పెత్తనం
కేటరింగ్ ఉద్యోగుల జాబితాపై ఫిర్యాదులు
డీడీని చీవాట్లు పెట్టి పెండిరగులో పెట్టిన కలెక్టర్

సాంఘిక సంక్షేమ శాఖలో కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడిరగ్స్‌కే దిక్కులేని పరిస్థితి తయారైంది. కలెక్టరేట్ నుంచి వచ్చే ఫైల్స్‌ను తుంగలో తొక్కిన సంప్రదాయం సాంఘిక సంక్షేమశాఖ అధికారులకే చెందుతుంది. ఈ శాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి సర్వీస్ మొత్తం పనిష్మెంట్స్‌తో నిండిపోయింది. పని చేసిన ప్రతిచోటా ఆయనపై ఫిర్యాదులు రావడం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం షరామామూలే. జిల్లాలో మూడేళ్లుగా డీడీగా పనిచేస్తున్న విశ్వమోహన్‌రెడ్డిపై ఆ శాఖ వసతి గృహాల అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతిని విచారణ అధికారిగా నియమించారు. ఆమె విచారణ జరిపి కలెక్టర్‌కు అందించారు. అయితే అది డీడీకి అనుకూలంగానే ఉన్నట్టు ఆ శాఖలో చర్చ సాగుతోంది. దీన్ని మేనేజ్ చేయడంలో నగరంలోని రిమ్స్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర కాలేజీ వసతి గృహం-2 అధికారి, వార్డెన్ల సంఘం ప్రతినిధి దుమ్ము రాముడు కీలకంగా వ్యవహరించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా సంక్షేమ శాఖలో జరుగుతున్న ప్రతి అక్రమం వెనుక వార్డెన్ల సంఘం ప్రతినిధి దుమ్ము రాముడు పాత్ర ఉంటుందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. డీడీపై విచారణను కూడా ఆయన పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వసతిగృహాల్లో ఉంటున్న ఒక్కో విద్యార్ధి పేరుతో రూ.45 చొప్పున వార్డెన్ల నుంచి వసూలు చేసే బాధ్యతను రాముడే చూస్తున్నారు. ప్రతి నెలా డైట్ బిల్లు విడుదలకు ముందే ఈ సొమ్ము వసూలు చేస్తుంటారని తెలిసింది. అదే సమయంలో వార్డెన్లెవరూ డీడీకి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, ఆయన నిజాయితీపరుడని పేర్కొంటూ సంఘం లెటర్ హెడ్‌పై రాయించి వార్డెన్లతో సంతకాలు పెట్టించి విచారణాధికారికి అందించారు. అయితే ఆ లెటర్‌పై సంతకాలు పెట్టడానికి కొందరు వార్డెన్లు నిరాకరించారని తెలిసింది. విచారణ జరిగిన రోజే డీడీకి అనుకూలంగా మాట్లాడే వార్డెన్లను వెంటబెట్టుకొని దుమ్ము రాముడు కలెక్టరేట్‌కు వచ్చారు. అదే సమయంలో విచారణ కు వచ్చిన వారి వద్దకు వెళ్లి డీడీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని బెదిరించే ధోరణితో చెప్పినట్లు కొందరు బాధితులు చెప్పుకొచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతిగృహ వార్డెన్‌గా ఉన్న రాముడు ఆ శాఖ వార్డెన్ల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వసతి గృహంలో కంటే జిల్లా కార్యాలయంలోనే ఎక్కువగా మకాం వేసి జిల్లాలో వార్డెన్ల బదిలీలు, పోస్టింగులు, డిప్యూటేషన్లు, సర్దుబాట్లు, ప్రమోషన్ల వ్యవహారాలను చక్కబెడుతుంటాడు. ఆ రూపంలో పెద్ద మొత్తంలో వసూలుచేసి డీడీతో వాటాలు పంచుకుంటున్నారని ఆ శాఖలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రణస్థలంలో వార్డెన్‌గా పని చేసినప్పుడు స్వగ్రామమైన జీరుపాలెంలో రాజకీయాలు చేస్తుండేవారని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో రాముడిని అక్కడి నుంచి అప్పటి ఎచ్చెర్ల ఎమ్మెల్యే బదిలీ చేయించారన్న ప్రచారం ఉంది. 2022లో బదిలీపై శ్రీకాకుళానికి వచ్చిన రాముడు అప్పటి డీడీ రత్నంతో కుమ్మక్కై ఏడుగురు నాలుగో తరగతి ఉద్యోగులకు వారి డిగ్రీ సర్టిఫి˜కెట్ల జన్యూనిటీని పరిశీలించకుండానే ప్రమోషన్లు ఇప్పించి రూ.3 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ టెస్ట్ పాస్ కాకుండానే ఎనిమిది మంది హెచ్‌డబ్ల్యూఓలకు గ్రేడ్`1 వార్డెన్లుగా ఉద్యోగోన్నతి కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మొత్తం రూ.28 లక్షలు వసూలుచేసి డీడీ రత్నానికి వాటా ఇవ్వకుండానే విజయనగరం బదిలీ చేయించినట్టు రాముడుపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడూ ఆదే తరహలో డీడీ విశ్వమోహన్‌రెడ్డి అక్రమాలకు వంతపాడుతూ, వాటాలు అందుకుంటూ ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
అప్కాస్‌లో చేర్చేందుకు అమ్యామ్యాలు

ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పని చేసిన కొందరిని ఆప్కాస్‌లో చేర్చడానికి ఒక్కొక్కరి నుంచి రాముడు ద్వారా డీడీ విశ్వమోహన్‌రెడ్డి రూ.2.50 లక్షలు చొప్పున వసూలు చేసినట్టు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. జిల్లాలో 37 కేటరింగ్ పోస్టులను ఆప్కాస్‌లో చేర్చాలని 2023లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా డీడీ విశ్వమోహన్‌రెడ్డి, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు రాముడు, సూపరింటెండెంట్ కృష్ణకుమారిల అవినీతి కారణంగా ఇప్పటికీ వాటికి మోక్షం కలగలేదు. మొదట డబ్బులు తీసుకొని పలువురు అనర్హులను, మృతి చెందినవారిని, బంధువులను, డబ్బులు ఇచ్చిన వారిని జాబితాలో చేర్చి ప్రొసీడిరగ్స్ ఇచ్చారు. అన్యాయానికి గురైన బాధితులు దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ జాబితాను రద్దు చేశారు. ఇప్పటికీ ఆ వ్యవహారం కొలిక్కి రాలేదు. కొందరు అనర్హులను జాబితాలో చేర్చేందుకు ఏజెన్సీ ద్వారా వసతి గృహాల్లో పనిచేసినట్టు సర్వీస్ సర్టిఫికెట్ ఇప్పించేందుకు దుమ్ము రాముడు రూ.30 వేలు చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ద్వారా సర్టిఫికెట్లు తీసుకొచ్చిన వారినే జాబితాలో చేర్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితాలోని 37 మందిలో అర్హులైన 14 మందికి పోస్టింగులు ఇవ్వాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపైనా ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది.
జాబితాలో అనర్హులు

ఇదే అంశంపై బాధితురాలు జి.సూరీడమ్మ గత నెల 21న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సుదీర్ఘ కాలం పాటు వసతి గృహంలో పనిచేసిన తన పేరు 14 మందితో తయారుచేసిన జాబితాలో చేర్చకుండా డబ్బులు ఇచ్చిన అనర్హులను చేర్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. జాబితాలో పలువురు అనర్హులను చేర్చారని, అందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షలు వసూలు చేశారని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆమె డీడీ విశ్వమోహన్‌రెడ్డిని కలిస్తే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, అంతా సూపరింటెండెంట్ కృష్ణకుమారి చేశారని తప్పించుకొనే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వాస్తవంగా ఈ వ్యవహారంలో డీడీతో పాటు కార్యాలయంలో షాడో సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న ఏఎస్‌వో జగన్నాథం, రెగ్యులర్ సూపరింటెండెంట్ కృష్ణకుమారితో పాటు దమ్ము రాముడు ప్రధాన సూత్రధారులని ఆ శాఖ ఉద్యోగులు, బాధితులు ఆరోపిస్తున్నారు. 14 మందితో డీడీ విశ్వమోహన్‌రెడ్డి పంపిన జాబితాలో ఉన్న పలు పేర్లపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ డీడీకి చీవాట్లు పెట్టి జాబితాను పక్కన పెట్టినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగం కోసం రూ.2.50 లక్షలు చొప్పున సమర్పించుకున్న ఉద్యోగార్థులు రోజూ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
Comments