ఆ ఒక్కటీ అడక్కు!
- BAGADI NARAYANARAO

- 2 hours ago
- 3 min read
రథసప్తమి దర్శనభాగ్యం కోసం భక్తుల పాట్లు
మొరాయిస్తున్న ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్‌సైట్లు
ఒకటి అసలు తెరుచుకోదు.. ఇంకోటి మందగమనం
సాంస్కృతిక కార్యక్రమాల పాస్‌లదీ అదే తీరు
అంగరంగవైభోగంగా ప్రదర్శనలు

(సత్యం న్యూస్, శ్రీకాకుళం)
‘అన్నీ ఉన్నాయి.. ఆ ఒక్కటి తప్ప’.. అన్నట్లుంది రథసప్తమి వేడుకల సన్నాహాల తీరు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించి వైభవంగా నిర్వహిస్తున్నారు. గతసారి మూడు రోజులు జరపగా.. ఈసారి వారం రోజులు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ విహారం, శోభయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఎగ్జిబిషన్, తమన్ సినీ ఆర్కెస్ట్రా వంటి కార్యక్రమాలతో శ్రీకాకుళం నగరం కోలాహలంగా ఉంది. పెయింట్లు, విద్యుత్ అలంకరణలతో ఊరంతా శోభాయమానంగా తయారైంది. కానీ ఉత్సవాల్లో అసలైన ఘట్టం రథసప్తమి రోజు జరిగే స్వామివారి నిజరూప దర్శనమే. కానీ ఆ ఏర్పాట్లే లోపభూయిష్టంగా ఉన్నాయన్న అసంతప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆరోజు జరిగే క్షీరాభిషేక సేవలో పాల్గొనడానికి, సర్వదర్శనం, వీఐపీ దర్శనం చేసుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోనే అనేక ప్రాంతాల భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆయా దర్శన టికెట్లకు అధికారులు చేసిన ఏర్పాట్లు అక్కరకు రావడంలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు ఎక్కడ, ఎలా దొరకుతాయో తెలియక అసంతప్తి చెందుతున్నారు. స్థానికులకే కాకుండా దేశవిదేశాలకు చెందిన భక్తులకు కూడా దర్శనం, వివిధ సేవల టికెట్లు అందుబాటులో ఉంచి, పారదర్శకంగా అమ్మకాలు జరిపేందుకు వీలుగా టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టి రెండు వెబ్‌సైట్ల ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశారు. కానీ ఎందరు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ రెండు వెబ్‌సైట్లు మొరాయిస్తున్నాయి. వీటిలో ఒకటైన మనమిత్ర(వాట్సప్ గవర్నెన్స్) వాట్సప్ గ్రూప్ కొందరికి తెరుచుకుంటున్నా చాలా ఆలస్యంగా స్పందిస్తోంది. రకరకాల వివరాలు అడుగుతూ టికెట్లు కొనాలనుకునేవారి సహనాన్ని పరీక్షిస్తోంది. కొందరికైతే ఓపెన్ అయినా మధ్యలోనే స్తంభించిపోతోంది. ఇక అధికారులు పేర్కొన్న ‘ఏపీ టెంపుల్స్.జీవోవీ.ఇన’ అనే వెబ్‌సైట్ అసలు తెరుచుకోవడమే లేదు. ఈ వెబ్‌సైట్ కోసం ఎన్నిసార్లు సెర్చ్ చేసినా ‘దిస్ వెబ్‌సైట్ కాంట్ బీ రీచ్డ’ అని స్క్రీన్‌పై చూపిస్తుండటంతో భక్తులు బిక్కమొహం వేస్తున్నారు. ఏడు రోజుల కార్యక్రమానికి ప్రభుత్వం జీవో ఇచ్చినా మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ మతి పట్ల సానుభూతితో మూడు రోజులే నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ చెబుతున్నారు. అంబేద్కర్ ఆడిటోరియం, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏడు రోజుల సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటప్ప్పుడు ఇదెన్ని రోజుల పండగ అనేదానికి ఆయనే సమాధానం చెప్పాలి. మరోవైపు స్థానిక వ్యాపార, వర్తక వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్నా, వాటిని ఉత్తిమాటలుగా కొట్టిపారేయడం వారిని అవమానించడమే. హంగూ ఆర్భాటాల్లో ఎటువంటి లోటూ లేకపోయినా గత ఏడాదిని దష్టిలో పెట్టుకొని ఈసారి అదే కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నందున దర్శనాలు సజావుగా సాగుతాయని నమ్మకమున్నా.. అసలు దర్శనాలకు టిక్కెట్లు ఎక్కడ దొరుకుతాయో ఎవరికీ తెలియడంలేదు. అలాగే పý్సర్‌బైక్ ఝాన్సీ ప్రొగ్రాం, తమన్ మ్యూజికల్ నైట్ వంటివి వీక్షించాలంటే ఎక్కడ ఎలా టిక్కెట్లు లేదా పాస్‌లు ఇస్తారో, పోలీసుల కాళ్లే పట్టుకోవాలో చెప్పే నాధుడు లేడు. గత ఏడాది వరకు గ్రామీణ బ్యాంకు ద్వారా క్షీరాభిషేకం, సర్వదర్శనం టికెట్లు విక్రయించారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అడుసు తొక్కనేల..
అరసవల్లి క్షేత్రం అభివద్ధికి రూ.లక్ష విరాళం ఇచ్చే దాతలకు గత ఏడాది వరకు నాలుగు పాస్‌లు ఇవ్వగా, ఈ ఏడాది మూడుకు కుదించడంపై కూడా దాతల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తమవుతోంది. ఎందుకు తగ్గించారని దాతలు ప్రశ్నిస్తే అది దేవస్థానం ఈవో నిర్ణయమని సిబ్బంది చెప్పుకొచ్చారు. దీనిపై దాతల నుంచి విమర్శలు రావడంతో అధికారులు దిగి వచ్చి ఇప్పటికే ఇచ్చిన మూడు పాస్‌లకు అదనంగా మరొకటి ఇస్తాం రమ్మని దాతలకు కబురుపెట్టారు. ఇక వేడుకల సందర్భంగా గురువారం నుంచి శనివారం వరకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహంచే సాంస్కతిక కార్యక్రమాల పర్యవేక్షణ, పాస్‌ల జారీ బాధ్యతను టెక్కలి ఆర్డీవోకు అప్పగించారు. అయితే పాస్‌లను సామాన్యులకు అందుబాటులో ఉంచకుండా విఐపీల పేరుతో వచ్చిన వారికే ఇచ్చారని తెలిసింది. శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను వీక్షించే అవకాశం నగరవాసులకు లేకుండా చేయడం అసంతప్తికి కారణమైంది. చివరకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కార్యాలయానికి సైతం ఇంతవరకు దర్శన, సాంస్కతిక కార్యక్రమాల ఎంట్రీ పాస్‌లు అందకపోవడం పరిస్థితి ఏమిటో చెప్పకనే చెబుతోంది.
వెలుగుతున్న నగరం
ఇతరత్రా ఏర్పాట్లు మాత్రం దివ్యంగా ఉన్నాయి. నగరం విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నది. అరసవల్లికి వెళ్లే రోడ్లన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఈ నెల 19 నుంచే డచ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ రైడ్, 80 అడుగల రోడ్డులో హాట్ ఎయిర్ బెలూన్ విహార సేవలు జరుగుతున్నాయి. కోడి రామ్మూర్తి స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్, ఆమ్యూజ్‌మెంట్ పార్క్, విద్యార్థులు, పుస్తకప్రియుల కోసం బుక్స్, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు రోజులుగా సురభివారు ప్రదర్శిస్తున్న నాటకాలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. గురువారం శ్రీనివాస కల్యాణం, శుక్రవారం మాయాబజార్ నాటకాలు ప్రదర్శించనున్నారు. ఇతర సాంస్కతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి ఆర్కెస్ట్రా, పవన్ బ్యాండ్, మిమిక్రీ షోతో పాటు ప్రముఖ గాయకుడు గోరేటి వెంకన్న గళం, జబర్దస్త్ టీమ్ సభ్యుల స్కిట్లు, ఢీ డ్యానర్ల షో ఉన్నాయి. శుక్రవారం 80 అడుగుల రోడ్డులో సుమారు 10వేల మందితో మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 45 సాంస్కతిక, ఆధ్యాత్మిక బందాలు, వేలాది నగర ప్రజలతో శోభాయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జిల్లాస్థాయి గ్రామీణ క్రీడలు, రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. విజేత జట్టుకు రూ.50వేలు, రన్నరప్‌కు రూ.30 వేలు నగదు పురస్కారం అందిస్తారు. వాటితో పాటు వెయిట్ లిఫ్టింగ్, కర్రసాము, సంగిడీలు, ఉలవబస్తాల మోత వంటి సంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలు జరగనున్నాయి. వీటిలో కూడా విజేతలకు రూ.5వేల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. మొత్తం రూ.1.95 లక్షలు ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఎన్ని రోజులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అసలు ఘట్టమైన రథసప్తమి నాడు భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకోకుండా ఉంటే అదే పదివేలు. క్యూలైన్‌లో నిల్చుంటే పది నిమిషాల్లో టిక్కెటిచ్చి.. అరగంటలో దర్శనం చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. దానికి ముందు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలకు లైన్ క్లియర్ చేస్తే అసలు భక్తులు ఏ స్థాయిలో హాజరవుతున్నారో ఒక అంచనా దొరుకుతుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.










Comments