top of page

ఈ బుడతడు.. తండ్రి కలలకు వారసుడు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 10 hours ago
  • 2 min read
  • ఆరేళ్ల చిరుప్రాయంలోనే బాడీబిల్డర్ అవతారం

  • తనకంటే పెద్దవారిని, ప్రొఫెషనల్స్‌కు సవాల్

  • జూనియర్ ముంబైశ్రీ టైటిల్ సొంతం

  • న్యాయనిర్ణేతలనే ఔరా అనిపించిన రచిత్


(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఈ ఫొటో చూశారా? ఒక బక్కపలచని బాలుడు తనకంటే పెద్దవారు, బలశాలులు అయినవారి మధ్య కండల ప్రదర్శన చేస్తున్నట్లున్న ఆ ఫొటోలోని దశ్యం చూసి ఆ బాలుడి సరదా తీర్చడానికి ఆయన చుట్టూ కండలవీరులు నిలబడి ఫొటోకు ఫోజులిచ్చారని అనుకుంటే పొరపాటే. ఆ బాలుడిది సరదా కాదు.. అదో కఠోర సంకల్పం. సగంలో ఆగిపోయిన తండ్రి కలను సాకారం చేసేందుకు పూనిన దీక్ష. ఆ సంకల్ప బలమే ఆ బక్కబాలుడిని శరీరసౌష్టవ (బాడీ బిల్డింగ్) పోటీల్లో పాల్గొని తనకంటే మూడురెట్లు పెద్దవారైనా బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్స్‌తో పోటీపడేందుకు సాహసించేలా చేసింది. తండ్రి కలలకు రెక్కలు తొడిగి రెపరెపలాడేలా చేసిన ఆ బాలుడి విజయగాధే నిజమైన స్ఫూర్తిమంత్రం. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని దివంగత అబ్దుల్ కలాం చెబితే.. ఈ బాలుడు తనది కాని తండ్రి కలనే తన సొంత కలగా భావించి సాకారం చేశాడు. ఇంతకీ ఆ బాలుడెవరు? తండ్రి కలను ఆయన తీర్చడమేమిటి?? అన్న సందేహాలకు సమాధానమే ఈ కథనం.

ప్రమాదంతో బాడీబిల్డింగ్‌కు దూరం

ముంబై మహానగరానికి చెందిన ఉమేష్ మధుసూదన్ పాంచల్ ప్రముఖ బాడీ బిల్డింగ్ క్రీడాకారుడిగా ఆ ప్రాంతంలో పేరుపొందాడు. శరీరసౌష్టవ (బాడీ బిల్డింగ్) పోటీల్లో రాష్ట్రస్థాయిలో రజత(సిల్వర్) పతకం సాధించిన చరిత్ర అతనిది. అతని కుమారుడే రచిత్ పాంచల్. ఆరేళ్ల వయసున్న ఈ బుడతడు ముంబై వాడాలాలోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్లో సీనియర్ కేజీ చదువుకుంటున్నాడు. తండ్రి బాడీబిల్డర్ కావడంతో స్వతహాగానే ఆ క్రీడపై ఆసక్తి పెరిగింది. తండ్రితోపాటు వ్యాయామశాలకు వెళ్తూ తండ్రి గురువైన విశాల్ పరాబ్ అనే కోచ్ వద్దే బాడీబిల్డింగ్ శిక్షణ పొందడం ప్రారంభించాడు. దాంతోపాటు సైక్లింగ్, రన్నింగ్ క్రీడల్లోనూ సాధన చేస్తున్నాడు. కాగా బాడీ బిల్డర్ అయిన ఈ కుర్రాడి తండ్రి ఉమేష్ 2024 మార్చి తొమ్మిదో తేదీన ముంబైశ్రీ టైటిల్ పేరుతో జరగనున్న బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ దురదష్టం ఆయన్ను వెంటాడింది. పోటీలకు సరిగ్గా రెండురోజుల ముందే ఉమేష్ ప్రమాదానికి గురయ్యారు. అంధేరిలోని తన కార్యాలయం నుంచి వాసాయిలోని ఒక క్లయింట్‌ను కలిసేందుకు బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో అతని ఎడమకాలు తీవ్రంగా దెబ్బతిన్నది. దాంతో నడవలేక మంచం పట్టిన ఉమేష్ బాడీబిల్డింగ్ పోటీలకు దూరమయ్యారు. ఐదు నెలల వ్యవధిలో రెండు శస్త్రచికిత్సలు చేయాల్సివచ్చింది. ఫలితంగా పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది నెలలకుపైగా పట్టింది. అయితే మునుపటిలో పోటీల్లో పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా బాడీబిల్డర్‌గా ప్రముఖ స్థానానికి ఎదగాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి.

తండ్రి లక్ష్యమే తన లక్ష్యంగా..

ఈ పరిస్థితుల్లో అప్పటికే తండ్రి బాటలో బాడీబిల్డింగ్ శిక్షణ తీసుకుంటున్న ఆరేళ్ల రచిత్ పాంచల్.. తండ్రి రక్తాన్నే కాకుండా, ఆయన కన్న కలలను కూడా వారసత్వంగా తీసుకున్నాడు. తండ్రి కల ఎక్కడ ఆగిందో.. అక్కడినుంచే దాన్ని సాకారం చేసే కషి ప్రారంభించాడు. అందుకోసం తన వయసువారితో కాకుండా తండ్రి వయసు వారితోనే పోటీ పడటం ప్రారంభించాడు. ఆ విధంగా మొదటిసారి 2025 ఏప్రిల్‌లో గిర్గావ్‌లో జరిగిన బాడీబిల్డింగ్ పోటీల్లో తొలిసారి పాల్గొన్నాడు. ఆ వేదికపై ఇతర బాడీబిల్డర్లతో పోటీ పడుతున్న తమ పుత్రుడు రచిత్‌ను చూసి తండ్రి ఉమేష్, తల్లి సోనాల్ పట్టలేని సంతోషంతో ఆనందభాష్పాలు రాల్చారు. అనంతరం ఇటీవల అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముంబై మలాడ్ ఈస్ట్‌లో ప్రారంభమైన జూనియర్ ముంబైశ్రీ పోటీల్లో బాల రచిత్ పాల్గొన్నాడు. ఈ పోటీల అండర్`23 కేటగిరీలో 55 కేజీల విభాగంలో తనకంటే చాలా పెద్దవారైన 30 మందికిపైగా బాడీబిల్డర్లను సవాల్ చేస్తూ కట్స్ వంటి శరీరసౌష్టవ అంశాలను ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించి న్యాయనిర్ణేతలను అబ్బురపరచడమే కాకుండా విజేతగా నిలవడం విశేషం. ఈ పోటీలను మలాడఈస్ట్‌కు చెందిన జైభవానీ జిమ్, గ్రేటర్ బాంబే బాడీబిల్డింగ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. తన పుత్రరత్నం సాధించిన అపూర్వ విజయాన్ని కళ్లారా చూసిన ఆ తండ్రి రెండేళ్ల బాధ గర్వంగా ఉప్పొంగింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page