మోడీతోముచ్చటించిన చిన్నారులెవరు?
- Prasad Satyam
- 52 minutes ago
- 1 min read
దేశం వెతికిన సమాధానం ఇదే
నా చిన్నారి మిత్రులంటూ సోషల్‌మీడియాలో ఫొటోలు పెట్టిన ప్రధాని

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రధాని నరేంద్రమోడీ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో ఆదివారం కనిపించిన ఈ ఫొటోల కోసం యావత్ దేశం ఆరా తీసింది. నా చిన్నారి మిత్రులతో సమయం గడపడం గొప్ప అనుభూతినిచ్చిందని ప్రధాని ట్వీట్ చేయడంతో ఈ చిన్నారులు ఎవరా? అని చాలామంది గూగుల్ చేశారు. ఎక్కడా వీరి ఐడెంటిటీని ప్రధాని సోషల్ మీడియాలో ప్రకటించలేదు. దీంతో ఎవరైవుంటారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే.. ఈ చిన్నారులిద్దరూ కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుమార్తె, కుమారుడు.
శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా సేవా తీర్ద్‌లో కలిశారు. సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ ఆత్మీయ భేటి కొనసాగింది. ఇందులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తల్లి విజయమ్మ ఓ మొక్కను మోదీకి బహూకరిస్తూ ఏక్ పేడ్ మా కే నామ్ నినాదాన్ని గుర్తు చేశారు. అనంతరం ప్రధాని మోడీ సైతం రామ్మోహన్ నాయుడు పనితీరును మెచ్చుకుంటూ ‘మీ కుమారుడు చిన్న వయస్సులోనే గొప్పగా పనిచేస్తున్నారంటూ’ కితాబిచ్చారు.
తాజాగా ఆదివారం ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వచ్చిన చిత్రాలు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుమార్తె మిహిరా అన్వి శివాంకృతి, కుమారుడు శివాన్ ఎర్రన్నాయుడులవని ఇప్పుడు అందరికీ అర్ధమైంది.
ప్రధాని మోడీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పిల్లల ఫోటోలు రావడం పట్ల రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేస్తూ అక్కడ జరిగిన సంభాషణలను పంచుకున్నారు. సుమారు ఇరవై నిమిషాల పాటు జరిగిన భేటిలో తన పిల్లలతోనే ఆయన ఎక్కువ సమయాన్ని గడిపారని, తన కుమార్తె ప్రధాని మోడీ సంతకాన్ని ఇవ్వాలని కోరగా.. ప్రేమగా అందించారని, కొన్ని చాక్లెట్లు కూడా జత చేశారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తన కుమారుడిని అయన టేబుల్‌పై కూర్చోబెట్టుకుని.. పేరేంటి అని అడుగుతూ, ఆటలాడుతూ కాసేపు ఆనందంగా గడిపారని ‘సత్యం’కు తెలిపారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు తన పిల్లలతో సరదా సమయం గడిపి సేదతీరుతూ ఉంటే ఆనందంగా అనిపించిందని, ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.






Comments