top of page

రీ-సర్వే2.0..హక్కుల రక్షణ సాధనమా... భావి వివాదాల ప్రమాదమా?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

“లక్ష్యాల వేటలో చట్టబద్ధమైన ప్రక్రియలు మరుగున పడుతున్నాయా? వేగం పేరిట రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయా?”

ర్యాంకుల ఒత్తిడిలో ‘విలేజ్ సర్వేయర్లు’!

భూమి సరిహద్దులు కొలవాల్సిన సర్వేయర్లు.. ఇప్పుడు కార్యాలయాల్లో సిస్టమ్స్ ముందు అర్ధరాత్రి దాకా లాగిన్ ప్రక్రియలు చేయాల్సి వస్తోంది. వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో జరగాల్సిన డేటా ఎంట్రీ పనులను కూడా సర్వేయర్ల చేతే చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారుల మౌఖిక ఆదేశాలు, వాట్సాప్ టార్గెట్ల ఒత్తిడితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, కొందరు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా సర్వే ముగించి రికార్డులు ఖరారు చేస్తే, రేపు వచ్చే చట్టపరమైన వివాదాలకు క్షేత్రస్థాయి సిబ్బందే బలిపశువులు అయ్యే ప్రమాదం ఉంది.

రైతులకు వివాదరహిత, శాశ్వత భూ హక్కులు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రీ-సర్వే 2.0’ అమలుపై క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సర్వే పూర్తి చేయాలన్న దిశగా ప్రభుత్వం గడువు విధించడంతో, ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనేక పొరపాట్లు దొర్లుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం కంటే... డ్యాష్‌బోర్డ్ ర్యాంకులు, పురోగతి శాతాలు చూపించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని సిబ్బందే నేరుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

సెక్షన్ 9(2) నోటీసులు ఏవి?

రీ-సర్వే ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం సెక్షన్ 9(2) నోటీసు. నిబంధనల ప్రకారం సర్వే చేసిన భూమి విస్తీర్ణం, సరిహద్దులు, యాజమాన్య వివరాలతో రైతుకు నోటీసు ఇవ్వాలి. రైతు వాటిని సరిచూసుకొని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసే చట్టబద్ధమైన హక్కు ఉంది. ఆ సమస్యలను పరిష్కరించాకే ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)’ సిద్ధం చేయాలి. చాలా ప్రాంతాల్లో 9(2) నోటీసులు ఇవ్వకుండానే, రైతుల అభ్యంతరాలు వినకుండానే అధికారులు నేరుగా ‘ఫైనల్ పాస్‌బుక్‌లు’ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాత రికార్డులు, అడంగల్ ఆధారంగానే ఆఫీసుల్లో కూర్చొని డేటా నమోదు చేస్తే... రేపు క్షేత్రస్థాయిలో సరిహద్దులు, భూ విస్తీర్ణాల్లో తేడాలు వచ్చి కొత్త వివాదాలు తలెత్తవా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

బాధ్యత ఎవరిది? పరిష్కారం ఏంటి?

ఒక్కసారి తుది భూ రికార్డులు తయారయ్యాక వాటిని దిద్దడం అత్యంత సంక్లిష్టమైన పని. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి సర్వేలో ప్రతీ దశ చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలి. 9(2) నోటీసులను తప్పనిసరిగా రైతులకు అందించి, వారి సందేహాలను నివృత్తి చేయాలి. సిబ్బందిపై అనవసర ఒత్తిడి తగ్గించి క్షేత్రస్థాయి ధృవీకరణకు తగిన సమయం ఇవ్వాలి. టార్గెట్లు పూర్తయ్యాయా లేదా అన్నది కాదు... రైతుకు శాశ్వత, వివాదరహిత భూ హక్కు లభించిందా లేదా అనేదే ‘రీ-సర్వే 2.0’ అసలు విజయానికి కొలమానం!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page