నిరసనలపై లీగల్ ‘బుల్డోజర్ ’
- NVS PRASAD

- 1 day ago
- 3 min read
ప్రజాస్వామ్యంలో నిరసన.. హక్కు కాదా
నిరసన గళాలపై FIR ఒక ‘వేలాడే కత్తి’
క్రమంగా కరుగుతున్న స్వేచ్ఛ
డేటా ‘లీక్‌ల’ వ్యూహం
ప్రజా ఉద్యమాలకు ‘నేరస్థుల మూక’ ముద్ర
కేసులు పెట్టడం సులువు... నిరూపించడం సాధ్యమేనా


కోర్టుల్లో నిలవని అభియోగాలు.. ‘CAA’ నుండి ‘రైతుల ఉద్యమం’ వరకు ఏం జరిగింది?
కేసులు పెట్టిన ప్రభుత్వాల అసలు లక్ష్యం కోర్టుల్లో గెలవడం కాదు... భవిష్యత్తులో మరే పౌరుడూ తమ హక్కుల కోసం ప్రశ్నించకుండా మానసిక భయాన్ని నెలకొల్పడమే!’
భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన అత్యంత కీలకమైన హక్కుల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఒకటి. అయితే, ఇటీవల జులైలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, పౌరుల నిరసన గళాన్ని అణచివేయడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్న తీరు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ప్రారంభమైన ఒక ఉద్యమం, ఆ తర్వాత వివిధ రాష్ట్రాలకు విస్తరించడం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు, ప్రభుత్వాల రాజకీయ-న్యాయ వ్యూహాలు కేవలం శాంతిభద్రతల నిర్వహణకు మాత్రమే పరిమితం కాలేదు. అంతకు మించి పౌరులలో భయాన్ని నింపే ప్రక్రియగా మారింది.
చలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన బలప్రయోగాన్ని సమర్థిస్తూ ఢిల్లీ పోలీసులు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన 2,873 మందిలో 989 మందికి గతంలో క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసు వర్గాల పేరిట మీడియాలోకి వచ్చిన డేటా ఇది. వీరిలో 101 మంది హత్య కేసుల నిందితులు, 284 మంది దోపిడీ, దొంగతనం కేసుల నిందితులు, 229 మంది ఆయుధాల చట్టం కింద కేసులు ఉన్నవారు, 135 మంది చైన్ స్నాచింగ్ కేసుల్లో ఉన్నవారు, 67 మంది NDPS (మాదకద్రవ్యాల నిరోధక చట్టం) కింద కేసులు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు.
ఈ గణాంకాలు అధికారికంగా విడుదల చేసినవి కావు. ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిన ఈ వివరాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.. మహిళలు, కుటుంబాలు, విద్యార్థులు, చిన్నపిల్లలు పాల్గొన్న ఒక భారీ నిరసనను ‘నేరస్థుల మూక’గా చిత్రీకరించడం. దీని ద్వారా పోలీసుల కఠిన చర్యలకు ప్రజల్లో సమర్థన లభిస్తుంది.
నిరసనల సమయంలో సంచలనాత్మక క్రిమినల్ డేటాను బయటపెట్టి, ఆ తర్వాత నిశ్శబ్దంగా కేసులను ఉపసంహరించుకోవడం లేదా కోర్టుల్లో కొట్టేయడం ఒక అలవాటుగా మారిందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనం ప్రచురించింది.
2020 ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు (సీఏఏ)పై పోలీసులు 758 FIR నమోదు చేసి 1,900 మందికి పైగా అరెస్టు చేశారు. కానీ కోర్టు తీర్పులను పరిశీలిస్తే, దహనం, అల్లర్ల కేసుల్లో 80 శాతం కంటే ఎక్కువ కేసులు నిందితుల డిశ్చార్జ్‌తో ముగిశాయి. పరిశీలించిన 116 తీర్పుల్లో 97 కేసుల్లో నిందితులను కోర్టులు నిర్దోషులుగా ప్రకటించాయి. కల్పిత సాక్ష్యాలు, నకిలీ పోలీసు సాక్షులను న్యాయమూర్తులు తప్పుబట్టారు.
ఉత్తరప్రదేశ్ ఆస్తుల స్వాధీనం కేసులో సీఏఏ నిరసనకారులపై జారీ చేసిన 274 ఆస్తుల రికవరీ నోటీసులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
2021 రైతుల ఉద్యమంలో ఎర్రకోట ట్రాక్టర్ ర్యాలీపై దేశద్రోహం, హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే డిసెంబరు 2021లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకోగానే ఎలాంటి షరతులు లేకుండా ఎఫఐఆర్‌లన్నీ రద్దయ్యాయి.
2018 తూత్తుకుడి (తమిళనాడు) స్టెర్లైట్ ఉద్యమంలో నిరసనకారులను సామాజిక వ్యతిరేక శక్తులుగా ప్రచారం చేసినా, జస్టిస్ అరుణ జగదీశన్ కమిషన్ పోలీసుల విచక్షణారహిత కాల్పులను తప్పుబట్టడంతో ప్రభుత్వం కేసులన్నీ ఎత్తివేసింది.
2022 అగ్నిపథ్ నిరసనల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అభ్యర్థులపై, కోచింగ్ నిర్వాహకులపై తీవ్రమైన నాన్-బెయిలబుల్ కేసులు పెట్టారు. కానీ కొన్ని వారాల్లోనే ప్రభుత్వాలు సమీక్షించి ఆ ఎఫఐఆర్‌లలో చాలా వరకు ఉపసంహరించుకున్నాయి.
విచారణే శిక్ష
న్యాయవ్యవస్థలో క్రిమినల్ ప్రక్రియనే ఒక శిక్షగా మార్చడం వెనుక అధికారులకు మూడు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉంటాయి. ఆరంభంలోనే నిరసనకారులను నేరస్థులుగా ప్రచారం చేయడం. బాష్పవాయువు, లాఠీచార్జ్ వంటి చర్యలను చట్టబద్ధం చేసుకోవడం. ఆయుధ చట్టం, ఎన్‌డీపీఎస్, పీఎంఎలఏ లాంటి తీవ్ర చట్టాలు జోడించి బెయిల్ రాకుండా చేయడం.
ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు సమర్పించిన డేటా ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద శిక్షపడే రేటు 1 శాతం కంటే తక్కువ. ఉదాహరణకు, 2019లో డాక్టర్ కఫీల్ ఖాన్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగానికి బెయిల్ లభించినా, జాతీయ భద్రతా చట్టం (NIA) ప్రయోగించి 20 నెలల పాటు జైలులో ఉంచారు. చివరకు హైకోర్టు ఆ ప్రసంగంలో ఎలాంటి హింస లేదని తేల్చి FIRను కొట్టివేసింది, కానీ ఆయన చెల్లించాల్సిన వ్యక్తిగత మూల్యం అప్పటికే పూర్తయింది.
కోర్టు ఆదేశాలు, నాయకుల ప్రకటనలు
జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిపిన పోరాటంపై పోలీసులు నమోదు చేసిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ధారిత క్రిమినల్ చరిత్ర లేని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ, కేంద్రంతో పాటు ఏడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
“శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కు. పోలీసుల అధిక బలప్రయోగానికి రాజ్యాంగంలో ఎలాంటి సమర్థన లేదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వివిధ రాష్ట్రాల విభిన్న వైఖరి
బీహార్, అస్సాంలో జులై 26ను కటాఫ్ తేదీగా తీసుకుని కేసుల ఉపసంహరణకు నిర్ణయించాయి. బీహార్‌లోని సివాన్ జిల్లాలో పోలీసు అధికారి ఏకే-47తో కాల్పులు జరపడం వివాదాస్పదమవ్వడంతో, 339 మంది విద్యార్థులు/ మైనర్లను ప్రభుత్వం విడుదల చేసింది. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసుల సమీక్షకు ఆదేశించారు. అక్కడ అస్సాం కేబినెట్ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబ్బిసా మహంత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో, “పెద్దవారైన పిల్లల రాజకీయ అభిప్రాయాలకు తల్లిదండ్రులు బాధ్యులు కారు” అని సీఎం సమర్థించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇందుకు భిన్నంగా 70 మంది నిరసనకారులను “దేశవ్యతిరేక శక్తులు”గా అభివర్ణిస్తూ ప్రజా భద్రతా చట్టాల కింద 7 ఎఫఐఆర్‌లు నమోదు చేసింది. జూలై 26 హింసకు సంబంధించి నిందితుడు మహ్మద్ అఫ్రోజ్‌ను తీసుకెళ్లి ‘సీన్ రీకన్‌స్ట్రక్షన’ నిర్వహించింది.
ఒకవైపు భౌతిక కేసులు ఎత్తివేస్తున్నా, ఢిల్లీ పోలీసు సోషల్ మీడియా విభాగాలు మోదీ వ్యతిరేక కంటెంట్‌ను తొలగించాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు ఇచ్చాయి. ఏఐ/ డీప్‌ఫేక్ నిరసన వీడియోలను ప్రచారం చేస్తున్నారనే నెపంతో 450 ఖాతాలను బ్లాక్ చేయడానికి గుర్తించారు.
ఒక FIR మీ తలపై వేలాడే కత్తిలా మారినప్పుడు, చట్టపరమైన ప్రక్రియకే మన సమయం, డబ్బు వృథా అయిపోతుంది. ఇక్కడ కేసులు పెట్టిన ప్రభుత్వాల అసలు లక్ష్యం కోర్టులో గెలవడం కాదు.. భవిష్యత్తులో మరే పౌరుడూ తమ హక్కుల కోసం వీధిలోకి రాకుండా ఒక మానసిక భయాన్ని నెలకొల్పడమే! ప్రజాస్వామ్యంలో చట్టాలు పౌరులకు రక్షణగా ఉండాలి తప్ప, వారి హక్కులను అణచివేసే ఆయుధాలుగా మారకూడదు.






Comments