శ్రీకాకుళంలో మారుతున్న ట్రెండ్
- Prasad Satyam
- 1 day ago
- 2 min read
జీటీ రోడ్డుపై కార్పొరేట్ వ్యాపారాల జోరు
ఏడురోడ్ల జంక్షన్ నుండి రామలక్ష్మణ జంక్షన్ వరకు విస్తరణ
నగరంలో సరికొత్త షోరూమ్‌లు.. క్యూ కడుతున్న దిగ్గజ బ్రాండ్లు
చుక్కలనంటిన స్థలం ధరలు.. GT రోడ్డులో సెంటు రూ.2 కోట్లు
రోడ్ల వెడల్పు జరిగితేనే మరిన్ని వ్యాపార అవకాశాలు
చెన్నై, CMR, RS బ్రదర్స్.. GT రోడ్డుకే ఓటు!

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది అని అప్ప్పుడెప్ప్పుడో సినిమాలో పాడుకుంటే, మొన్న జెన్ జీ జంతర్‌మంతర్ వద్ద మారిన స్వరంతో తరం మారిందన్న సంకేతాలిచ్చింది. ప్రతీ 20 ఏళ్లకు సమాజంలో మార్పు వస్తుంది. దాన్నే వ్యాపారస్తులు ట్రెండ్ అంటారు. ఇప్ప్పుడు శ్రీకాకుళం నగరం కూడా కొత్త ట్రెండ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అవసరాలకు సరిపడా రోడ్లు వెడల్పు చేసే నిధులు లేకపోవడంతో జీటీ రోడ్డుకే ఈ ట్రెండ్ అంతా పరిమితమైపోయింది. ప్రస్తుతానికి జీటీ రోడ్డు అంటే ఎంతవరకు ఉందో జనాలకు అర్థమయ్యే రోజు వచ్చింది. ఒకప్ప్పుడు జీటీ రోడ్డు అంటే.. ఏడురోడ్ల జంక్షన్ నుంచి స్టేట్‌బ్యాంకు మెయిన్ బ్రాంచి వరకే. ఆ తర్వాత షాపులున్నా వ్యాపారాలు జరగవనే ప్రచారం ఉండేది. ఎప్ప్పుడైతే ఈ ప్రాంతం ప్యాక్ అయిపోయిందో స్టేట్‌బ్యాంక్ నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు జీటీ రోడ్డు వ్యాపారాలు విస్తరించాయి. ఇప్ప్పుడు అదే రోడ్డు రామలక్ష్మణ జంక్షన్ వరకు వ్యాపారాలకు అనువుగా ఉంటుందని అర్ధమవుతుంది. స్థానిక జామియా మసీదుకు ఎదురుగా ఏరికోరి సీఎంఆర్ షాపింగ్‌మాల్ వచ్చిన తర్వాత ఇప్ప్పుడు ఆ జంక్షన్‌కు కళ పెరిగింది. సరిగ్గా దీనికి ఆనుకొనే ఇప్ప్పుడు మరో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఒకవైపు న్యూకాలనీ రోడ్డు, మరోవైపు జీటీ రోడ్డు కూడా ఫేసింగ్‌లో ఉండటం వల్ల RS బ్రదర్స్ బట్టలషాపు వస్తుందనే ప్రచారం జరుగుతుంది. పక్కనే CMR ఉండటం వల్ల డీల్ కుదరకపోతే GRT బంగారం షాపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళంలో బంగారం వ్యాపారంలో కార్పొరేట్ సంస్థలు మరికొన్ని రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే అందరికీ జీటీ రోడ్డే కావాలి. అయితే సూర్యమహల్ దాటి ఇప్ప్పుడు షాపులు నిర్మించినా వ్యాపారానికి డోకా లేదని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ నిరూపించింది. ఇప్ప్పుడు అదే బాటలో బాకర్‌సాహెబ్‌పేట జంక్షన్ వద్ద మారుతి ట్రూ వాల్యూ ఉన్న స్థలంలో మరో షాపింగ్‌కాంప్లెక్స్ వెలుస్తోంది. ఇందులో ది చెన్నై షాపింగ్‌మాల్ రానుంది. ఇటువైపు RS బ్రదర్స్, అటువైపు చెన్నై షాపింగ్‌మాల్ ఎంటరైతే మధ్యలో ఉన్న చిన్నాచితకా షాపులు లేపేసి ఇక కార్పొరేట్లకు అనుకూలంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ఊపందుకుంటాయనడంలో సందేహం లేదు. కల్యాణ్ జ్యూయలర్స్ జీటీ రోడ్డులో షాపు కోసం ఎప్పటి నుంచో వేట మొదలుపెట్టింది. ఇప్పటికే విజేత హటల్‌లో ఉన్న లలితా జ్యూయలర్స్ జీటీ రోడ్డులో వీనస్ హటల్‌కు ఎదురుగా కొత్త భవనంలోకి మారిపోనుంది. అలాగే స్థానిక చినమండలవీధి జంక్షన్ వద్ద కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఎవరు వ్యాపారానికి వస్తారనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే కళానికేతన్ ఖాళీ చేసి రిలయన్స్ సంస్థ ఆ భవనానికి అద్దె చెల్లిస్తుంది. అంటే అక్కడ కూడా రిలయన్స్‌కు సంబంధించిన చీరల దుకాణం లేదా బంగారం షాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి జీటీ రోడ్డుకు సరిజోడీగా శ్రీకాకుళంలో మరికొన్ని కమర్షియల్ ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే రోడ్లు వెడల్పు కాకపోవడం వల్ల ఇక్కడ స్థలాలు ఖాళీగా పడివున్నాయి. పాలకొండ రోడ్డులో ఏడురోడ్ల జంక్షన్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఖజానా జ్యూయలర్స్ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంది. అదే టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్‌ను ఇక్కడ పెద్దగా ఆదరించలేదు. పాలకొండ రోడ్డులో ఉన్న బంగారం, చీరల దుకాణాలు మాత్రం కార్పొరేట్ బట్టల దుకాణాలన్నీ జీటీ రోడ్డులోనే ఉండాలని కోరుకుంటున్నాయి. వాస్తవానికి రామలక్ష్మణ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు ఉన్న ప్రాంతంలో వ్యాపారాలు దండిగా జరుగుతాయి. కాకపోతే ఇందుకు అనువైన రోడ్డు లేకపోవడం వల్ల షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడానికి యజమానులెవరూ ముందుకు రావడంలేదు. జీటీ రోడ్డులో సెంటు స్థలానికి రూ.2 కోట్లు ఇస్తామన్నా దొరక్కపోగా, PSNM హైస్కూల్ రోడ్డులో మాత్రం సెంటు రూ.65 లక్షలు చెబితే కొనేవాడు లేడు. కారణం కమర్షియల్‌గా డెవలప్ కాకపోవడమే. ఈ రోడ్డు వెడల్పు కోసం కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రులు శంకుస్థాపన చేసి చాలా రోజులైనా ఇంతవరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. రాబోయే మూడేళ్లలో ఈ రోడ్డు గాని 60 అడుగుల మేర వెడల్పయితే శ్రీకాకుళం కమర్షియల్‌గా మరింత అభివృద్ధి చెందుతుంది.






Comments