బంగ్లాకు స్వేచ్ఛ.. మనకు ఆయిల్ రక్ష!
- DV RAMANA

- 36 minutes ago
- 3 min read
గతంలో మన పెట్రో వ్యాపారం అమెరికా, బ్రిటన్ చేతుల్లోనే
1971 యుద్ధ సమయంలో సైన్యానికి ఇంధనం నిరాకరణ
దాంతో ఆ సంస్థలన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఇందిర సర్కార్
నెహ్రూ హయాం నుంచే మనకు రష్యా చమురు చేయూత

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ముడిచమురు సంక్షోభం మనకు కొత్త కాదు. తొంబై దశకంలో గల్ఫ్ యుద్ధం కారణంగా, ప్రస్తుతం అమెరికా`ఇరాన్ యుద్ధం కారణంగా మనదేశం చుమురు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీన్నుంచి బయటపడేందుకు ఆఫ్రికా దేశాలతోనూ ప్రత్యామ్నాయ ఒప్పందాలు చేసుకుంటున్నది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రో ధరలను దశలవారీగా పెంచుకుంటూ పోతున్నది. అయితే చరిత్రలో కాస్త వెనక్కి వెళ్తే చమురు సంక్షోభాలు మనకు కొత్త కాదని.. ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే.. రష్యా మాత్రం ఎప్పుడూ మనకు అండగానే ఉంటున్న విషయం తేటతెల్లం అవుతున్నది. అటువంటి ఘటనే 1971 సమయంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పట్లో మనదేశంలో మనతోనే వ్యాపారం చేస్తున్న అమెరికన్, బ్రిటన్ కంపెనీలు మన ప్రభుత్వానికే సహాయ నిరాకరణ చేశాయి. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కఠిన నిర్ణయాలతో వాటి మెడలు వంచారు. అంటే అ యుద్ధం బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించడమే కాకుండా మన చమురు రంగాన్ని విదేశీయుల నుంచి రక్షించిందన్నమాట.
ఆనాడు ఏం జరిగిందంటే..
పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ కోసం ఉద్యమించిన నాటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)కు మద్దతుగా భారత్ రంగంలోకి దిగడంతో 1971లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇండియన్ నేవీకి, ఎయిర్ ఫోర్సుకు అత్యవసరంగా ఆయిల్ కావలసి వచ్చింది. అప్పట్లో మనదేశంలో ఆయిల్ వ్యాపారమంతా అమెరికా, బ్రిటన్ కంపెనీల చేతుల్లోనే ఉండేది. ఈ విదేశీ చమురు సంస్థలు భారత సైన్యానికి ఆయిల్ సరఫరాకు నిరాకరించాయి. అమెరికా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న ఆ కంపెనీలు అమెరికా ఏం చెబితే అది చేశాయి. పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశం కావడంతో దానికి అనుకూలంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సాహసోపేత చర్యలు తీసుకోవడంతోపాటు ఆ విదేశీ చమురు కంపెనీల ఉనికే లేకుండా చేశారు. 1971 నాటికి భారతీయ పెట్రోలియం రంగం పూర్తిగా విదేశీ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉండేది. అమెరికాకు చెందిన బర్మా షెల్, ఎస్సో, కాల్టెక్స్ వంటి పెద్ద బహుళజాతి కంపెనీలే ఆయిల్ వ్యాపారం చేసేవి. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్టీసీ అప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల సైన్యానికి, దేశ అవసరాలకు కావలసిన ఇంధనం కోసం చాలా వరకు ఈ విదేశీ రిఫైనరీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. 1971 డిసెంబరులో భారత్`పాక్ యుద్ధం ప్రారంభం కాగానే భారత వాయుసేన యుద్ధ విమానాలకు, నౌకాదళ యుద్ధనౌకలకు ఇంధన అవసరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ యుద్ధంలో అమెరికా బహిరంగంగానే పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, రాయబారి హెన్రీ కిసింజర్ భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి ఈ విదేశీ చమురు కంపెనీలు భారత సైన్యానికి అదనపు చమురు సరఫరా చేయడానికి నిరాకరించాయి. యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితుల్లో తమ సామర్థ్యానికి మించి చమురును రిఫైన్ చేయడం, సరఫరా చేయడం సాధ్యం కాదని సాకులు చెప్పాయి.
ఇండియన్ ఆయిల్ రంగప్రవేశం
విదేశీ కంపెనీల సహాయ నిరాకరణ భారత సైన్యాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇందిర నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)ను నేరుగా రంగంలోకి దించింది. ఐవోసీ తన శక్తికిమించి రేయింబవళ్లు పనిచేసి వాయుసేన, నౌకాదళ అవసరాలకు నిరంతరాయంగా ఆయిల్ సరఫరా చేసింది. మన అధికారులు, ఇంజనీర్లు నిర్విరామంగా శ్రమించి లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా వంటి లాజిస్టిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. దీనివల్ల యుద్ధరంగంలో ఒక్క విమానం గానీ, ఓడ గానీ ఇంధనం లేక ఆగిపోవాల్సిన దుస్థితి తలెత్తలేదు. అప్పటికి గండం గట్టెక్కినా.. ఈ అనుభవం భారత ప్రభుత్వ కళ్లు తెరిపించింది. విదేశీ చమురు కంపెనీలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి, ఆమె వ్యూహకర్తలకు అర్థమైంది. యుద్ధం ముగిసిన వెంటనే ఆ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇందిర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం చేసి విదేశీ కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకుంది. ఆ చట్టం ద్వారా ఎస్సో కంపెనీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)గా మార్చారు. బర్మా షెల్ కంపెనీని జాతీయం చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)గా మార్చారు. కాల్టెక్స్ సంస్థను పూర్తిగా హెచ్‌పీసీఎల్‌లో విలీనం చేశారు. ఈ ఘటన భారత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దేశాన్ని పెట్రోలియం రంగంలో స్వయంసమృద్ధి సాధించేలా, ఇంధన భద్రతను మన చేతుల్లోకి తీసుకునేలా చేసింది. 1974`76 మధ్యకాలంలో ఈ విదేశీ కంపెనీలను స్వాధీనం చేసుకోవడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు.. జాతీయ రక్షణ, యుద్ధ సమయంలో విదేశీ కంపెనీల సహాయ నిరాకరణను దీనికి ప్రేరణగా, కారణాలుగా పేర్కొన్నారు. మాజీ రా అధికారి బి.రామన్ రాసిన ‘ది కౌబోయ్స్ ఆఫ్ రా’ అనే పుస్తకంలోనూ ఈ వ్యూహాత్మక చర్యల గురించి ప్రస్తావించారు.
రష్యా అండదండలు
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ చమురుపై నియంత్రణ మాత్రం మనకు అంత వేగంగా దక్కలేదు. చాలా ఏళ్లు విదేశీ కంపెనీల చేతుల్లోనే ఉండిపోయింది. బ్రిటీష్ కంపెనీ బర్మా షెల్, అమెరికన్ కంపెనీలు స్టాండర్డ్ వాక్యూమ్, కాల్టెక్స్ మాత్రమే ఇక్కడ చమురు విక్రయించేవి. భారత్‌లోనే రిఫైనరీలు ఏర్పాటు చేయాలని దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం ఆ కంపెనీలను కోరగా.. రిఫైనరీలు ఏర్పాటు చేసే బదులు ఇరాన్ నుంచి నేరుగా పెట్రోల్ తీసుకువచ్చి అమ్మడమే లాభదాయకమంటూ ఆ సంస్థలు నిరాకరించారు. దాంతో అప్పటి పెట్రోలియం మంత్రి కె.డి.మాలవీయ ఒక వ్యూహాత్మక ప్లాన్ వేశారు. 1957లో సోవియట్ యూనియన్ ( ఒకప్పటి అవిభక్త రష్యా)కు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలను భారత్‌కు పి¾లిపించి దేశంలో చమురు నిల్వల అన్వేషణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు 1960 ఆగస్టు 17న ఎం.వి.ఉజ్గోరాడ్ అనే సోవియట్ నౌక 11,390 టన్నుల డీజిల్‌తో ముంబై రేవుకు చేరుకుంది. ఆ దేశం నుంచి భారత్‌కు అందిన తొట్టతొలి చమురు సరఫరా అదే. దీనికి డాలర్లలో కాకుండా ‘రూపాయి - రూబుల్’ కరెన్సీ పద్ధతిలో చెల్లింపులు జరిగాయి. దాంతో ఒక్క డాలర్ కూడా బయటకు పోలేదు. రష్యా తక్కువ వడ్డీకే, రూపాయిల్లోనే చెల్లింపులకు అంగీకరించడం అప్పట్లో డాలర్ల కొరతతో ఉన్న భారతదేశానికి ఒక పెద్ద ఊరటగా నిలిచింది. ఈ పరిణామాలన్నీ ఆమెరికాను అవాక్కయ్యేలా చేశాయి.






Comments