పుల్వామా పాపాలపై ‘గుర్తుతెలియని’ దెబ్బ
- Guest Writer
- May 23
- 2 min read
పాక్‌లో ఉగ్రవాది బుర్హాన్ హతం
సరిహద్దు అవతల ముగుస్తున్న భారత్ వ్యతిరేక శక్తుల అధ్యాయం
భారత నిఘా నీడన వణుకుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లు

భారత గడ్డపై రక్తం చిందించిన ముష్కరులకు కాలం చెల్లుతోంది. సరిహద్దు అవతల సురక్షిత స్థావరాల్లో తలదాచుకుంటూ, కాశ్మీర్‌లో అలజడి సృష్టించాలని చూస్తున్న ఉగ్రవాదులను ‘కాలం’ వెంటాడి మరీ వేటాడుతోంది. 2019 ఫిబ్రవరిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఆత్మాహుతి దాడి సూత్రధారులలో ఒకడైన ‘అల్ బదర్’ టాప్ కమాండర్ అర్జుమంద్ గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్ (27) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో దారుణ హత్యకు గురయ్యాడు.
గురువారం ముజఫరాబాద్‌లోని గోజ్రాలో ఓ ప్రైవేట్ కళాశాల నుంచి బయటకు వచ్చిన బుర్హాన్‌ను మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని సాయుధులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించి మట్టుబెట్టారు. గత నాలుగేళ్లుగా పాక్ గడ్డపై భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్న సిరీస్‌లో ఇది తాజా చేరిక.
చదువుకోడానికి వెళ్లి ఉగ్రవాదిగా మారాడు
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రత్నీపొరా గ్రామానికి చెందిన బుర్హాన్ (జననం 1999), 2017లో ఉన్నత చదువుల కోసమంటూ పాస్‌పోర్ట్, వీసాతో అధికారికంగానే పాకిస్తాన్‌కు వెళ్లాడు. అయితే, అక్కడ చదువు పక్కనబెట్టి, పాక్ నిఘా సంస్థ ‘ఐఎసఐ’ పెంచి పోషిస్తున్న ‘అల్-బదర’ ఉగ్రవాద సంస్థ ఉచ్చులో పడ్డాడు. మతోన్మాదం తలకెక్కిన బుర్హాన్, అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థకు ప్రధాన ముఖచిత్రంగా మారాడు. దక్షిణ కాశ్మీర్‌లోని అమాయక యువతను బ్రెయిన్‌వాష్ చేయడం, ఉగ్రవాద నియామకాలు చేపట్టడం, వారికి ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా చేయడంలో కీలక సూత్రధారిగా ఎదిగాడు.
జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఉగ్రవాద చర్యలు, గ్రనేడ్ దాడులు, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో బుర్హాన్ పాత్రను పక్కా ఆధారాలతో నిరూపించిన భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, 2022 ఏప్రిల్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అతనిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ISI వ్యూహాన్ని చిన్నాభిన్నం చేసిన భారత్
పుల్వామా దాడి తర్వాత అంతర్జాతీయంగా ఎదురైన తీవ్ర ఒత్తిడి, భారత్ జరిపిన ‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స’ ధాటికి జైషే మహ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎలఈటీ) వంటి పెద్ద ఉగ్రసంస్థల కార్యకలాపాలను పాకిస్తాన్ బహిరంగంగా సాగించలేకపోయింది. దీంతో ‘అల్-బదర’ వంటి చిన్న, నిద్రాణంగా ఉన్న సంస్థలను తెరపైకి తెచ్చి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలని ఐఎసఐ వ్యూహం రచించింది. జైషే మహ్మద్ పాత క్యాడర్‌ను అల్-బదర్‌లో విలీనం చేసే బాధ్యతను బుర్హాన్‌కే అప్పగించింది. అయితే, భారత భద్రతా బలగాల పటిష్ట వ్యూహాలు, సరిహద్దుల్లో నిరంతర నిఘా కారణంగా ఉగ్రవాదుల నియామకాలు పూర్తిగా మందగించాయి. కాశ్మీర్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలనుకున్న బుర్హాన్ ప్రయత్నాలను భారత ఏజెన్సీలు అడుగడుగునా తిప్పికొట్టాయి.
పాక్‌లో ‘గుర్తుతెలియని’ భయం` వరుస వికెట్లు
బుర్హాన్ హత్య యాదృచ్ఛికం కాదు. గత నాలుగేళ్లుగా పాకిస్తాన్ సురక్షిత స్వర్గధామంగా బతుకుతున్న అంతర్జాతీయ ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఈ దాడుల సరళి పాక్ ఏజెన్సీలకు నిద్రలేకుండా చేస్తోంది.
భారతదేశానికి లభించిన అతిపెద్ద ‘అడ్వాంటేజ్’
పాక్ గడ్డపై ఉగ్రవాదుల ఏరివేత వెనుక ఎవరున్నారనేది అధికారికంగా మిస్టరీ అయినప్పటికీ, దీనివల్ల భారత్‌కు వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా అపారమైన ప్రయోజనం చేకూరింది.
సీనియర్ హ్యాండ్లర్లు, రిక్రూటర్లు వరుసగా మరణించడంతో లష్కర్, జైష్, అల్-బదర్ వంటి సంస్థల సమాచార వ్యవస్థలు, నిధుల సరఫరా మార్గాలు (టెర్రర్ ఫండింగ్) పూర్తిగా దెబ్బతిన్నాయి.
యువతను బ్రెయిన్‌వాష్ చేసే బుర్హాన్ లాంటివారు ఖతం కావడంతో, కాశ్మీర్ లోయలో స్థానిక యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది.
సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాదుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, తీవ్రమైన అనిశ్చితి, ప్రాణభయం నెలకొన్నాయి.
ఒకప్పుడు భారతదేశంపైకి ఉగ్రవాదాన్ని, హింసను ఎగుమతి చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు తనే పెంచి పోషించిన భయం, అనుమానం, అంతర్గత ముఠా కలహాల చక్రబంధంలో చిక్కుకుంది. భారత భద్రతా సంస్థల నిరంతర నిఘా, ‘ఆపరేషన్ సిందూర’ వంటి ఉగ్రవాద నిరోధక చర్యల విజయవంతమైన అమలుతో జమ్మూ కాశ్మీర్‌లో శాంతి వెల్లివిరుస్తోంది. భారత గడ్డపై రక్తం చిందిస్తే, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా శిక్ష తప్పదనే బలమైన సందేశం ఈ ఘటనల ద్వారా స్పష్టమవుతోంది.
- టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో






Comments