top of page

IT నిపుణుడు.. అయ్యాడు మట్టిమనిషి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 hours ago
  • 2 min read
  • లక్షల్లో జీతం.. దేశవిదేశాల్లో ఉన్నతోద్యోగం

  • కానీ కల్యాణ్‌కిషోర్‌ను సొంతూరికి లాక్కొచ్చిన అభిలాష

  • మూడేళ్ల క్రితం సొంత భూముల్లోనే ఆర్గానిక్ సేద్యం

  • సిక్కోలు సంతలో స్వయంగా తన ఉత్పత్తుల విక్రయం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ఈ ఫొటో చేశారా.. నెలలో రెండు ఆదివారాల్లో నగరంలో జరిగే సిక్కోలు సంతలోని స్టాల్లో నిలబడి మామిడి పళ్లు అమ్ముతున్న వ్యక్తి వ్యాపారి కాదు. తన పంటను తనే అమ్ముకుంటున్న ఔత్సాహిక రైతు. అయితే పట్టుకతో రైతు కాదు.. ఆయనది వ్యవసాయ కుటంబమÖ కాదు. ఉన్నత విద్యావంతుడైన ఆయన ఐటీ రంగంలో విదేశాల్లో పనిచేసిన ఉన్నతోద్యోగి. కానీ అభిలాష, ఆసక్తి.. ఆయన్ను కృషీవలుడిగా మార్చేశాయి.

ఇప్పుడు యువత గమ్యం విదేశం.. లక్ష్యం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. డిగ్రీ, ఇంజినీరింగ్, మార్కెటింగ్.. ఇలా ఏ తరహా కోర్సు చేసినా ఏదోవిధంగా ఐటీ రంగంలోకి ప్రవేశించాలని తపిస్తుంటారు.. కృషి చేస్తుంటారు. కానీ ఆ రంగంలో ఉన్న ఎత్తుపల్లాలు, నిరంతర ఒత్తిళ్లు, సంక్షోభాలు.. అన్నింటికీ మించి ఇటీవలి కాలంలో ఉద్యోగ భద్రత లోపిస్తుండటం వంటి అంశాలు ఈ రంగంలో ఉన్నవారినే వెనక్కి లాగుతున్నాయి. వ్యక్తిగత అభిరుచులు కూడా ఈ మార్పులకు దోహదం చేస్తున్నాయి. ఈమధ్యే బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగిని తన పనిస్థలం నుంచి ఇంటికి ఆటోలో ప్రయాణిస్తూ దాని డ్రైవర్‌తో జరిపిన సంభాషణలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తనకొచ్చే జీతం కంటే అతని ఆదాయమే ఎక్కువని గుర్తించి అతన్నే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఐటీ, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన చాలామంది తమ ఉద్యోగాలకు బై చెప్పి.. వ్యవసాయం, తదితర స్వయం ఉపాధి రంగాల్లో స్థిరపడుతున్న ఉదంతాలు తరచూ బయటకొస్తున్నాయి. ఎక్కడివరకో ఎందుకు.. మన శ్రీకాకుళంలోనే ఐటీ నుంచి స్వయం ఉపాధి వైపు మళ్లిన వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే తంగుడు కల్యాణ్ కిషోర్. ఐటీ రంగంలో రెండు దశాబ్దాల సర్వీసు ఉన్న ఆయన ఆ రంగాన్ని కాదని మట్టిని నమ్ముకున్నారు. మూడేళ్ల క్రితం ఔత్సాహిక రైతుగా రూపాంతరం చెందారు. తమ సొంత భూముల్లోనే వ్యవసాయం చేస్తూ, నలుగురితో చేయిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చి..

శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన తంగుడు కల్యాణ్ కిషోర్ మాజీ ఐటీ ఉద్యోగి. ఆయన కుటంబానికి వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ వారు వ్యవసాయదారులు కాదు. ఆయన తాతగారు తహసీల్దారుగా పనిచేస్తే.. తండ్రి తంగుడు సుధాకర్ ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ వారసత్వంలో తన తరానికి తగినట్లు కల్యాణ్‌కిషోర్ ఉన్నత విద్య అభ్యసించి ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించారు. మన దేశంలోని హైదరాబాద్, బెంగళూరు నగరాలతోపాటు ఇంగ్లండ్‌లోని లండన్ వంటి నగరాల్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేశారు. ఆస్ట్రాజెనికా వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లోనూ కల్యాణ్ కిషోర్ పని చేశారు. సుమారు ఇరవయ్యేళ్లు వివిధ హోదాల్లో పనిచేసి మంచి ఉద్యోగ జీవితం సాగించిన ఆయనకు స్వదేశానికి తిరిగి వెళ్లి ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. లక్షల రూపాయల జీతం, ఉన్నత ఉద్యోగం వదిలేసి 2023లో పుట్టిన ఊరైన శ్రీకాకుళానికి వచ్చేశారు. ఏం చేయాలని ఆలోచించిన ఆయన్ను చివరికి ఆర్గానిక్ వ్యవసాయ రంగం ఆకర్షించింది. దాంతో ఆ రంగంలోకి అడుగుపెట్టారు.

తనే రైతు.. తనే విక్రేత

కిషోర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవారైన పిల్లలు చదువుకుంటుండగా, భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంలోకి అడుగుపెట్టాలన్న ఆయన నిర్ణయాన్ని తొలుత కుటుంబ సభ్యులు నిరుత్సాహపర్చినప్పటికీ .. పూర్తిగా వ్యతిరేకించలేదు. ఆయన అభిలాషను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారు. దాంతో తమ కుటంబానికి ఉన్న వ్యవసాయ భూముల్లో స్వయంగా వ్యవసాయం ప్రారంభించారు. పొందూరు మండలం బాణాం గ్రామ పరిధిలో ఉన్న 20 ఎకరాల్లో మామిడితోటలు వేశారు. వాటిలో అంతర పంటలుగా మినుములు, వేరుశనగ వంటివి పండిస్తున్నారు. అలాగే శ్రీకాకుళం నగర పరిధిలోనే ఫ్రెండ్స్ కాలనీ వెనుక భాగంలో ఉన్న భూమిలో వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. తోటమాలిని, పనివారిని పెట్టి స్వయంగా ఈయనే పర్యవేక్షిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే పంటల సాగులో రసాయనిక ఎరువుల జోలికి పోవడంలేదు. పూర్తిగా జీవన ఎరువులు వాడుతూ ప్రకృతి సిద్ధమైన(ఆర్గానిక్) వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని అందుకు తగినట్లు ఎర్రబియ్యం, నల్లబియ్యం, మామిడి పళ్లు, వేరుశనగ, తదితర తన పొలాల్లో పండిన ఆర్గానిక్ ఉత్పత్తులను స్వయంగా తనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నగరంలోని 80 ఫీట్ రోడ్డుల్లో రెండు వారాలకోసారి ఆదివారం పూట సిక్కోలు సంత పేరుతో నిర్వహిస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి తన ఉత్పత్తులను తనే స్వయంగా విక్రయించుకుంటున్నారు. ఈ రంగం ప్రోతాహకరంగానే ఉందని, పెద్దగా లాభాలు లేకపోయినా తన ఆసక్తి మేరకు స్వయం ఉపాధి పొందుతున్నామన్న సంతృప్తి లభిస్తున్నదని అంటున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన, అమ్మకాలు పెరిగితే లాభదాయకత పెరుగుతుందన్నారు. ఆ దిశగానే మనిషి ఆరోగ్యానికి ఆర్గానిక్ పంట ఉత్పత్తులు చేసే మేలును, సిక్కోలు సంత లక్ష్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి, సిక్కోలు సంతకు ప్రాచుర్యం కల్పించేందుకు నిర్వాహకుడు దార్లపూడి రవితో కలిసి కృషి చేస్తున్నారు.

```

ఇలాంటి విద్యావంతులు, ఉద్యోగులు ప్రవేశిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం, దాని ఉత్పత్తుల విక్రయ మేళా సిక్కోలు సంతపై ప్రతేక కథనం తర్వాత సంచికలో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page