top of page

జీతాలో మహా ప్రభో..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 6 hours ago
  • 2 min read
  • నాలుగు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల విలవిలలు

  • అప్పులు, ఈఎంఐలు, పిల్లల ఫీజులతో సతమతం..

  • నిధి పోర్టల్ జాప్యంతో వేతనాల నిలుపుదలపై ఆగ్రహం

(సత్యం న్యూస్,శ్రీకాకుళం)

ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులే ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న వందలాది మంది కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు వరుసగా నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటికీ జమ కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల జీతం ఆలస్యమైనా కుటుంబ బడ్జెట్ తారుమారవుతుంది. అలాంటిది నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

480 మంది కాంట్రాక్ట్ సిబ్బందిపై ప్రభావం

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ వైద్యశాఖ పరిధిలో సుమారు 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో దాదాపు 480 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 330 మంది స్టాఫ్ నర్సులు, 10 మంది ఫార్మసిస్టులు కాగా, మిగిలిన వారు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారు. వారిలో కొందరు పదేళ్లకు పైగా, మరికొందరు ఐదు నుంచి ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు చెబుతున్నారు.

ఈఎంఐలు కట్టలేక.. బంగారం తాకట్టు పెట్టే దుస్థితి

జీతాలు నిలిచిపోవడంతో ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లించలేకపోవడం, ఇంటి ఖర్చులు నిర్వహించలేకపోవడం, పిల్లల విద్యా ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోలేకపోవడం వంటి సమస్యలు వెంటాడు తున్నాయి. వేసవి సెలవుల్లో కుటుంబంతో ఎక్కడికీ వెళ్లలేకపోయామని, ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో కొందరు ప్రైవేట్ అప్పులు చేయగా, మరికొందరు బంగారం తాకట్టు పెట్టి లేదా గోల్డ్ లోన్లు తీసుకుని జీవనం సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

నిధి పోర్టల్ జాప్యమే కారణమా?

ఉద్యోగుల వేతనాల నిలుపుదలకు ప్రధాన కారణంగా ‘నిధి్ణ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాల నమోదు ప్రక్రియ ఆలస్యం కావడమేనని తెలుస్తోంది. ఇప్పటివరకు సీఎఫ్ఎంఎస్‌ (్పుఖీవీS) ద్వారా జీతాలు చెల్లించగా, ప్రస్తుతం ప్రభుత్వం ‘నిధి్ణ పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ వివరాలు, సంబంధిత జీవోలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ, శ్రీకాకుళంలో మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

జీవోల మధ్య వ్యత్యాసాలు

330 మంది స్టాఫ్ నర్సుల్లో 49 మందికి సంబంధించిన నియామక జీవోలు, పోర్టల్‌లో నమోదు చేస్తున్న జీవోల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. నియామక ఉత్తర్వుల్లో లేని జీవోలను పోర్టల్‌లో నమోదు చేస్తే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత, సర్వీస్ ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మేము అభ్యంతరం చెబుతున్నాం” అని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

అధికారులపై బెదిరింపుల ఆరోపణలు

ఈ అంశంపై ప్రభుత్వ ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్‌ను పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సమస్యపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయవద్దని, జీవోల గురించి ప్రశ్నించవద్దని హెచ్చరిస్తున్నారని వారు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు జీతాలు బకాయి… మరోవైపు ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళన

నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ఉద్యోగాలకు సంబంధించిన వివరాల నమోదులో తలెత్తిన వివాదాలు వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితిని పెంచుతున్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించి బకాయి వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎన్నికల హామీలు ఏమయ్యాయి?

ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. రెగ్యులరైజేషన్ సంగతి పక్కనపెడితే, ఇప్పటికే చేసిన పనికి కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులే నేడు జీతాల కోసం ఎదురుచూడాల్సి రావడం దురదృష్టకరం. వెంటనే బకాయిలు విడుదల చేసి ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కల్పించాలని కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page