top of page

సుంకాల పెంపు.. స్మగ్లింగ్‌కు ఊపు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 10 hours ago
  • 3 min read
  • పన్ను పెంచిన ప్రతిసారీ ఇదే అనుభవం

  • విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా

  • దేశీయ మార్కెట్లలో అనధికార లావాదేవీలు

  • జిల్లాలోనూ బిల్లుల్లేకుండా తక్కువ ధరకే విక్రయాలు?

  • గత అనుభవాలు ఉటంకిస్తూ గోల్డ్ కౌన్సిల్ నివేదిక

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మన సెంటిమెంట్లు, భావోద్వేగాలతో పెనువేసుకున్న బంగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వికటిస్తున్నాయన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నది. ముడిచమురుతోపాటు బంగారానికి చాలావరకు దిగుమతులే ఆధారం కావడం.. అందుకోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి రావడం కేంద్రానికి భారంగా మారింది. దాంతో అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించరాదని భావిస్తున్న కేంద్రం బంగారంపై సుంకాన్ని ఏకంగా ఆరు నుంచి 15 శాతానికి పెంచేసింది. మరోవైపు కనీసం ఏడాదిపాటు పసిడి కొనుగోళ్లు బంద్ చేయాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే ఆ పిలుపు, నిర్ణయాలు ఆచరణలో వికటించే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా సుంకాల పెంపు వల్ల బంగారం స్మగ్లింగ్ పెరిగి, బిల్లుల్లేని అధికార లావాదేవీలు పెరిగిపోయే ప్రమాదముందుని అంటున్నారు. ఇప్పటికీ దేశంలోనే అనేక మార్కెట్లల్లో అధికారికంగా ప్రకటిస్తున్న మార్కెట్ రేట్ల కంటే తక్కువకే బంగారం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. ఉదాహరణకు ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అధికారికంగా రూ.1.50 లక్షలు ఉంటే దానికంటే తక్కువకే రూ.1.40 లక్షల స్థాయిలోనే అనధికారిక అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇటువంటి లావాదేవీలకు బిల్లులు ఉండవు. జిల్లాలోనూ ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని వ్యాపారులు అంగీకరించరు. అడిగితే అంతర్జాతీయ, జాతీయ రేట్ల కంటే తక్కువకు ఎలా ఇస్తామని తిరిగి ప్రశ్నిస్తారు. అక్కడే ఉండి అసలు కిటుకు. అధికారిక రేట్ల కంటే తక్కువకు అమ్మగలగడానికి కారణం.. స్మగ్లింగ్ బంగారం. సుంకాలు పెరిగినప్పుడల్లా భారతీయ మార్కెట్లలోకి స్మగ్లింగ్ బంగారం తరలివస్తుంటుంది. ఇదేం కొత్త విషయం కాదు. గతంలోనూ జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల సాక్షిగా ఇది వాస్తవం.

అధికారిక దిగుమతుల్లో తగ్గుదల

బంగారంపై దిగుమతి సుంకం పెంపు నిర్ణయం దేశీయ పసిడి మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది మన దేశీయ బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 50 నుంచి 60 టన్నుల మేరకు.. అంటే సుమారు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. ఈ సంస్థను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఒక నివేదిక విడుదల చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పెంపుగా పేర్కొంటున్నారు. గత ఏడాది జూలైలో ప్రభుత్వం ప్రకటించిన సుంకాల తగ్గింపు ప్రయోజనాలను తాజా పెంపుదలతో వినియోగదారులు కోల్పోయినట్లే. దీనికి తోడు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు వీలైనంత దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే దేశంలో వార్షిక బంగారం డిమాండ్‌ను సుంకాలు మాత్రమే కాకుండా ప్రస్తుత పసిడి ధరలు, ప్రజల ఆదాయ స్థాయిలు, దేశీయ ద్రవ్యోల్బణం, రుతుపవనాల పరిస్థితులు వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన నివేదికలో పేర్కొంది. కౌన్సిల్ రూపొందించిన ఆర్థిక నమూనాల ప్రకారం.. దిగుమతి సుంకాల ప్రభావం ఆభరణాల కొనుగోలుదారులపై ఒకలా, డిజిటల్ లేదా ఫిజికల్ గోల్డ్ కడ్డీలు, నాణేలలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లపై మరోలా ఉంటుంది. సుంకాల మార్పులకు, ధరల హెచ్చుతగ్గులకు పెట్టుబడి డిమాండ్ చాలా వేగంగా, సున్నితంగా స్పందిస్తుంది. కానీ ఆభరణాల డిమాండ్ మాత్రం మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. మనదేశంలో ఆభరణాల వినియోగం గోల్డ్ ధరలపైనే కాకుండా వివాహాలు, పండుగలు, ఇతర సామాజిక సందర్భాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ధరలు, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల దృష్ట్యా ప్రజలు నగలను కొనుగోలు చేస్తూనే ఉంటారు కాబట్టి సుంకాల పెంపు వల్ల ఆభరణాల డిమాండ్ పెద్దగా పడిపోదు. దీనికి భిన్నంగా, కడ్డీలు, నాణేల రూపంలో లాభాల కోసం చేసే పెట్టుబడి డిమాండ్ మాత్రం ప్రభుత్వ ఆంక్షలు, సుంకాలు, ఆదాయ స్థాయిలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో కురిసే వర్షపాత సరళి కూడా అక్కడి రైతుల ఆదాయాన్ని శాసించి, స్వల్పకాలంలో వారి కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది.

అక్రమ మార్గాల్లో బంగారం రవాణా

ఈ నివేదికలో మరో కీలకమైన అంశాన్ని గోల్డ్ కౌన్సిల్ బహిర్గతం చేసింది. దేశంలో దిగుమతి సుంకాలు పెరిగిన ప్రతిసారీ అక్రమ మార్గాల్లో విదేశాల నుంచి బంగారం ప్రవాహం కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నదని గణాంకాలతో సహా కౌన్సిల్ స్పష్టంగా పేర్కొంది. 2013`26 మధ్య కాలంలోని గణాంకాల ప్రకారం సుంకాలు పెంచినప్పుడు స్మగ్లింగ్ పెరగడం, సుంకాలు తగ్గినప్పుడు అక్రమ రవాణా గణనీయంగా తగ్గడం స్పష్టంగా కనిపించింది. ఉదాహరణకు 2013లో ప్రభుత్వం సుంకాన్ని నాలుగు శాతం పెంచినప్పుడు ఆ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 టన్నుల మేరకే ఉన్న అనధికారిక దిగుమతులు 2014 నాటికి ఏకంగా 70 టన్నులకు చేరుకున్నాయి. అంటే ఏడాది కాలంలోనే బంగారం స్మగ్లింగ్ ఏడు రెట్లు పెరిగింది. ఒకసారి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు మార్కెట్లో బలపడితే.. ఆ తర్వాత సుంకాలు స్థిరంగా ఉన్నప్పటికీ వాటిని నిర్మూలించడం ప్రభుత్వ వ్యవస్థలకు చాలా కష్టంగా మారుతుందని కౌన్సిల్ హెచ్చరించింది. 2022 జూలైలో దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచినప్పుడు కూడా ఇదే రకమైన స్మగ్లింగ్ ధోరణి మార్కెట్లో పునరావృతమైంది. మరోవైపు 2024 జూలైలో సుంకాన్ని ఆరు శాతానికి తగ్గించిన వెంటనే అక్రమమార్గాల గుండా దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు సున్నా స్థాయికి పడిపోయాయని డబ్ల్యూజీసీ గుర్తుచేసింది. ఈ చారిత్రక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 15 శాతానికి సుంకం పెంపు నిర్ణయం అధికారిక మార్కెట్ డిమాండ్‌ను పది శాతం వరకు తగ్గించడమే కాకుండా.. దాదాపు అదే స్థాయిలో బంగారం అక్రమ లావాదేవీలకు మార్గం తెరిచినట్లు ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page