top of page

కల నెరవేరింది.. కలత మిగిలింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 days ago
  • 3 min read
  • విశాఖ రైల్వే జోన్ వచ్చినా ప్రయోజనాలు పాక్షికమే

  • దక్షిణకోస్తాలో చోటు దక్కని ఉద్దానం ప్రాంతం

  • వాల్తేర్ నుంచి విడిపోయిన పర్యాటక, ఖనిజ మార్గాలు

  • ఒడిశా కోసం ఏపీ ప్రయోజనాలకు విఘాతం

  • నాయకులు పట్టించుకోకుంటే తీరని నష్టం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

రాష్ట్రప్రజల దశాబ్దాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ నిరీక్షణ, అలుపెరుగని పోరాటం ఫలితంగా రాష్ట్రానికి సొంత రైల్వేజోన్ సమకూరుతున్నది. రైల్వేల్లోని కొందరు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. వీలైనంతవరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ టార్గెట్‌కు అనుగుణంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవన్నీ కొలిక్కి వచ్చేదాని బట్టి అపాయింటెడ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంతా బాగానే ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటవుతున్నందుకు సంతోషపడే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు. జోన్ ఇచ్చే విషయంలో వాత పెట్టి పూత పూసే తరహాలో రైల్వే బోర్డు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రైల్వే జోన్ ఇస్తున్నా.. దానికి ఆర్థిక వనరులను లాగేసుకుని డొల్లగా మిగిల్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రానికి రైల్వేజోన్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు జోన్ బయటే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఆయా ప్రాంతాల రైల్వే అవసరాలను పట్టించుకునేవారు ఉండరన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖలో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తుండగా.. అదే ఉత్తరాంధ్రలో భాగమైన శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు విశాఖ జోన్ పరిధిలోకి రాకుండా వెలేసినట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి. కొత్త జోన్ సరిహద్దులను ఖరారు చేసిన విధానం ఈ పరిస్థితికి కారణమైంది.

వర్గీకరణలో వివక్ష

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ సరిహద్దులను నిర్ణయించే క్రమంలో అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి స్థూలంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను విడదీసి కొత్త జోన్ పరిధిలో చేర్చారు. గుంతకల్ డివిజన్‌లోని కొన్ని మార్గాలను మాత్రం సౌత్ సెంట్రల్ జోన్‌లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం తూర్పుకోస్తా జోన్‌లో ఉన్న ఉత్తరాంధ్రను ఏకమొత్తంగా కాకుండా కొన్ని ప్రాంతాలనే కొత్త జోన్‌లో చేర్చి మిగతావాటిని తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడలో చేర్చేలా లేదా పాత ఖుర్దారోడ్డు డివిజన్‌లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి విశాఖ(ప్రస్తుత అల్లూరి జిల్లా) జిల్లా పరిధిలోని అరకు ప్రాంతం, పారిశ్రామిక మార్గంగా పేర్కొంటున్న కేకే లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌లో చేర్చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్న ఉత్తరాంధ్రలో భాగమైన శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాలను కొత్త జోన్‌లో విలీనం చేయకుండా తూర్పుకోస్తా జోన్ పరిధిలోని పాత ఖుర్దా డివిజన్‌లోనే కొనసాగించాలని నిర్ణయించడం వివక్షాపూరితమని ఆ ప్రాంతీయులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2013లో రాష్ట్ర విభజన సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామంటూ పార్లమెంటు ఆమోదించిన ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సమయంలోనే ‘ఒక రాష్ట్రం.. ఒక జోన’ అన్న నినాదాన్ని అచరిస్తామని కూడా పేర్కొంది. కొన్నేళ్ల జాప్యం తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఆనాటి హామీ ప్రకారం దక్షిణకోస్తా రైల్వేజోన్‌ను పట్టాల మీదకు ఎక్కించింది. అయితే తూర్పుకోస్తా జోన్ నుంచి వాల్తేర్ డివిజన్‌ను విడదీస్తే తాము నష్టపోతామంటూ ఒడిశా మోకాలడ్డటానికి ప్రయత్నించడంతో ఆ రాష్ట్రాన్ని సంతప్తిపర్చడానికి కొత్త జోన్‌లో కోత విధించారని అంటున్నారు. కానీ దాన్ని కప్పుపుచ్చుకునేందుకు విశాఖ డివిజన్‌ను కూడా కొనసాగిస్తున్నామని రైల్వేవర్గాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి.

ఆ ప్రాంతాలకు నష్టం

విశాఖను జోనల్ కేంద్రం చేస్తున్నందున ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వాల్తేర్ జోన్‌ను ఇక్కడి నుంచి రాయగడకు పూర్తిగా తరలించాలనేది రైల్వేబోర్డు తొలి ప్రణాళిక. దీనిపై ఆంధ్ర రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన బోర్డు ప్రస్తుత వాల్తేర్ డివిజన్ పరిధిని కుదించి అనేక ప్రాంతాలను రాయగడ కొత్త డివిజన్‌లో చేర్చేసింది. ఫలితంగా సుమారు 1600 కిలోమీటర్ల పరిధి కలిగిన వాల్తేర్ డివిజన్ విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుకోవడంతోపాటు సుమారు 401 కి.మీ. పరిధికే పరిమితమైంది. అంటే రాయగడ డివిజన్ పరిధి 1100కు పైగా కిలోమీటర్లుగా నిర్థారించడంతోపాటు కీలక పర్యాటక ఆదాయ కేంద్రాలుగా ఉన్న అరకు, అనంతగిరి, బొర్రా వంటి స్టేషన్లు, రైల్వేమార్గాలు.. అలాగే ఇనుప ఖనిజం రవాణాకు కీలకమైన కొత్తవలస`కిరండూల్(కేకే) లైన్‌ను తీసుకెళ్లి రాయగడ డివిజన్‌కు అప్పగించేశారు. పర్యాటక, ఖనిజ, ప్యాసింజర్ రవాణాల ఆదాయంతో దేశంలోనే అతిపెద్ద ఆదాయం ఆర్జిస్తున్న రైల్వే డివిజన్‌గా పేరొందిన వాల్తేర్ కొత్త జోన్‌లో కొత్తపేరుతో ఆదాయం లేని డివిజన్‌గా మిగిలిపోతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం జిల్లాది మరో వ్యధ. ఈ జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు అంటే ఒడిశా ముఖద్వారం వరకు ఉన్న స్టేషన్లు, రైల్వే లైన్లు ప్రస్తుతం భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వేజోన్‌లోని ఖుర్దారోడ్డు డివిజన్‌లో ఉన్నాయి. విశాఖ కేంద్రం కొత్త రైల్వేజోన్ ఏర్పడితే తాము కూడా తమను కూడా అందులో చేర్చేస్తారని దానివల్ల ఇతర ప్రాంతాలతో సమానంగా రైల్వే సౌకర్యాలు సమకూరుతాయని ఉద్దానం ప్రాంతవాసులు ఆశపడ్డారు. కానీ దానికి విరుద్ధంగా కొత్త విశాఖ రైల్వేజోన్ పరిధిని పలాస స్టేషన్ ముందు వరకే పరిమితం చేసి.. పలాస స్టేషన్ నుంచి ఇచ్ఛాపురం వరకు ఇప్పుడున్నట్లు ఖుర్దా డివిజన్‌లోనే కొనసాగించాలని నిర్ణయం జరిగిపోయింది. దీనివల్ల రైల్వే నియామకాలతో ఉద్దాన యువత స్థానికేతరులుగానే పోటీపడాల్సి ఉంటుంది. అలాగే రైల్వే లైన్లు, స్టేషన్ల అభివద్ధి, ఇతర రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇప్పట్లాగే తూర్పుకోస్తా రైల్వేలోని ఒడిశా, బెంగాల్ అధికారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడంలేదు. జిల్లా మొత్తాన్ని విశాఖ రైల్వే జోన్‌లో చేర్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ హామీలు ఎలా ఉన్నా ఒకే రాష్ట్రం.. ఒకే జోన్ అన్నది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని రైల్వే నిపుణులు చెబుతున్నారు.

సిబ్బంది సమకూరిన వెంటనే..

ఇప్పటికే రైల్వేజోన్‌కు సంబంధించి ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. జోన్‌కు 1100 మంది నాన్ గెజిటెడ్ సిబ్బంది అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు సిబ్బంది నుంచి అప్షన్లు ఆహ్వానించారు. కొత్త జోన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న దక్షిణమధ్య, తూర్పుకోస్తా జోన్ల సిబ్బందికి ఈ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత డివిజన్ల సిబ్బందికి ప్రాధాన్యత ఉంటుంది. చివరిగా ఇతర ప్రాంతాల రైల్వే ఉద్యోగులకు అవకాశం ఇస్తారని రైల్వేవర్గాలు వెల్లడించాయి. కొత్త జోన్‌కు వచ్చేందుకు పెద్దసంఖ్యలో సిబ్బంది అప్షన్లు ఇచ్చినా వారిని రిలీవ్ చేసేందుకు ఆయా జోన్ల అధికారులు వెనుకంజ వేస్తున్నారు. వారిని రిలీవ్ చేస్తే తమ జోన్లలో సిబ్బంది కొరత ఏర్పడి, పని ఒత్తిడి పెరుగుతుందన్నది వారి భావన. అయితే ప్రాథమికంగా కనీసం 500 మంది సిబ్బంది వచ్చినా జోన్ కార్యకలాపాలు ప్రారంభించడానికి సరిపోతారని, అలా జరిగిన వెంటనే గెజిట్ జారీచేస్తారని తెలిసింది. కాగా అపరేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయని తెలిసింది. ఇప్పటికే జోన్‌కు జనరల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్ ఉన్నారు. వీరు మొత్తం పది విభాగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page