మీరు కట్టండి.. మేం కొట్టేస్తాం!
- NVS PRASAD

- 6 hours ago
- 3 min read
అక్రమాస్తుల కేసుల కథలన్నీఅర్థాంతరంగానే కంచికి!
లంచాలు తీసుకునే చిన్న చేపలకు పెద్దశిక్షలు
ఆస్తులు కూడగట్టిన అవినీతి తిమింగలాలకు రక్షణ
ట్రయల్స్‌కు వెళ్లిన కేసులను కూడా విత్‌డ్రా చేసుకుంటున్న సర్కారు
ఏసీబీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంటే కేసులు పెట్టండి’.. అంటూ ఒకవైపు ఏసీబీని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఈ తరహా కేసులను పైస్థాయిలోనే విత్‌డ్రా చేసుకుంటోంది. దీనివల్ల అవినీతిని నిరోధించాలన్న స్ఫూర్తికి భంగం వాటిల్లుతుందని ఆలోచించకపోవడం విడ్డూరం. సాధారణంగా రూ.రెండు వేలు లంచం తీసుకుంటూ కిందిస్థాయి ఉద్యోగి దొరికిపోతే కచ్చితంగా శిక్ష వేస్తున్నారు. కానీ అధిక మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినవారిని ఏసీబీ పట్టుకుని ఎఫఐఆర్ నమోదు చేస్తే స్వయంగా ప్రభుత్వమే దాన్ని విత్‌డ్రా చేయిస్తున్నది. తాజాగా డీబీసీడబ్ల్యూవో బాలముకుందం ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఒకసారి ఏసీబీ అడుగు పెట్టిన తర్వాత కచ్చితంగా ఆదాయానికి మించే ఆస్తి ఉందనేది నిర్ధారిస్తుంది. అలా అని బాలమురళీ చిన్నింటోడు కాదు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో 99 శాతం లంచాల ద్వారా కూడబెట్టిన కేసులే. మిగిలిన ఒక్క శాతం భార్యాభర్తల ఉద్యోగం లేదా కుటుంబపరంగా వచ్చిన ఆస్తులు పిల్లలు పెడుతున్నా ఇన్‌కమ్ టాక్స్ లెక్కల్లో చూపించక దొరికిపోయినవి. అయితే ఈ ఒక్క శాతాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన కేసులను కూడా ప్రభుత్వం రద్దు చేసేస్తోంది. ఇప్పటికే లంచం తీసుకుంటున్నవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రక్రియలో నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం ఇప్ప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల్లో ఏసీబీ కొండను తవ్వి ఏనుగును పట్టుకున్నా వదిలేస్తున్నది.
ఎన్నెన్నో కేసులు
ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, రిఫ్రిజిరేటర్, ఏసీ లేని ఇళ్లు లేవు. ఏసీబీ లెక్కల ప్రకారం వీటన్నింటికీ ఓ రేటుంటుంది. సగటు ఉద్యోగి ఇవన్నీ జీతంతో కొన్నాడంటే ఏసీబీ నమ్మదు. అటువంటప్ప్పుడు ప్రతి అధికారికి ఆదాయానికి మించి ఆస్తి ఉన్నట్టే. జనం కూడా వందల కోట్లు ఆస్తులు బయటపడిన కేసుల గురించే చర్చించుకుంటున్నారు. అందుకే ఏసీబీ అధికారులు కూడా చిన్నాచితకా సంపాదించినవారి వివరాలు బయటపెట్టడంలేదు. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడితో రైడ్‌లు చేయాల్సివస్తే దొరికినదానికంటే ఎక్కువ ఉన్నట్టు మీడియాకు లీకులిస్తారు. దాని బుడితి కేసే ఒక ఉదాహరణ. బుడితి పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్ గొండు మురళీ ఇంటిపై 2024 నవంబరులో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఈ కేసులో ఆదాయానికి మించిన ఆస్తులు ఎంతున్నాయనేది అప్పట్లో ప్రకటించలేదు. మీడియా మాత్రం కోటానుకోట్లు దొరికిందంటూ స్క్రోలింగ్ ఇచ్చింది. వాస్తవానికి హెచ్‌యూఎఫ్ (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ) లెక్కల ప్రకారం ఎంత ఉండవచ్చు? ఎంత ఉంది? అనేది ఇప్పటికీ ఏసీబీ చెప్పలేదు. ధర్మాన కష్ణదాస్ రెవెన్యూ మంత్రిగా పని చేసినప్ప్పుడు ఆయన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా మురళీ ఉండేవారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఇంటిపై ఏసీబీ దాడి జరిగిన విషయం విదితమే. ఇప్పటి డీబీసీడబ్ల్యూవో బాలముకుందం అయినా, గతంలో డీబీసీడబ్ల్యూవోగా పని చేసిన ఆర్.కనకసింహాచలమైనా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగే ఉంటారు. కాకపోతే ప్రభుత్వం ఈ కేసులను ఎంతమేరకు కొనసాగిస్తుందనేదే సందేహాస్పదం.
కేసులన్నిటిదీ అదే దారి
ఒక్కో హాస్టల్ విద్యార్థి నుంచి రూ.15 వసూలుచేస్తూ దొరికిపోయిన బాలముకుందం ఇంటిపై రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. సరిగ్గా ఇలాగే 2011లో డీబీసీడబ్ల్యూవోగా పని చేసిన రంగని కనకసింహాచలం ఇంటిపై కూడా దాడి చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని నిర్ధారించారు. ఆ మేరకు ఛార్జిషీటు కూడా వేశారు. తీరా ప్రాసిక్యూషన్ మొదలయ్యే సమయానికి ప్రభుత్వం ఆ కేసును విత్‌డ్రా చేసుకుంది. ఒక కేసు ఈ స్థాయికి వచ్చిన తర్వాత విత్‌డ్రా చేసుకోవడమనేది ఒక రికార్డు. అది డీబీసీడబ్ల్యూవో కనకసింహాచలం విషయంలో జరిగింది. అయితే ఇది ఒక్క బీసీ సంక్షేమ శాఖకో, మరో శాఖకో మాత్రమే పరిమితం కాదు. ఏసీబీ ఎంతమంది మీద రైడ్ చేసినా ప్రభుత్వ స్థాయిలో మేనేజ్ చేసేసుకుంటున్నారు. ఈ జాఢ్యం కూడా ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి డబ్బున్నోడి కేసులు డ్రాప్ అయిపోతున్నాయి. 2010లో డుమా పీడీగా పని చేసిన దన్నాన నారాయణరావుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. నారాయణరావు స్వతహాగా ఆస్తిపరుడు. దీంతో 2013లో ఈ ఎఫఐఆర్‌ను ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఇదే 2010లో హౌసింగ్ ఏఈగా పని చేసిన చప్ప సత్యనారాయణపై అసెట్స్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయనకు క్యాన్సర్ సోకడంతో మానవీయ కోణంలో ఈ కేసును క్లోజ్ చేశారు. 2016 నవంబరు ఒకటో తేదీన అప్పటి ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కాగా 2024లో ప్రభుత్వం దీన్ని డ్రాప్ చేసింది. ప్రస్తుతం ఆయన సింహాచలం దేవస్థానం ఈవోగా పని చేస్తున్నారు. 2017 మే నెలలో ఇక్కడ ఆర్టీవోగా పని చేసిన హైమారావుపైన ఆస్తుల కేసు నమోదైంది. రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో సోదాలు చేసి మరీ ప్రభుత్వానికి ఏసీబీ వివరాలు సమర్పించింది. అయితే 2024లో ప్రభుత్వం ఈ కేసును డ్రాప్ చేసింది. 2013 మార్చి 25న అప్పటి ఏపీఈపీడీసీఎల్ పలాస ఏడీఈ శాసపు మధుసూదనరావు ట్రాపయ్యారు. ఆ తర్వాత ఆయన మీద అసెట్స్ కేసు కూడా నమోదైంది. 2015లో పే అండ్ అకౌంట్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన వై.భారతీలక్ష్మి మీద కూడా ఆస్తుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ రెండు కేసులు కోర్టులో ట్రయల్స్ దశలో ఉన్నాయి. 2016 ఏప్రిల్‌లో విజయనగరం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పిల్లి చిన్నోడు మీద అసెట్స్ కేసు నమోదు చేసి, కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయన భార్యపై కూడా ఇవే సెక్షన్లు వాడారు. 2017లో పాతపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ ఈఈ బలివాడ కష్ణమోహన్పైన, 2018లో శ్రీకాకుళం మున్సిపాలిటీలో డిప్యూటీ ఈఈ గొట్టిముక్కల శ్రీనివాస్‌పైన అసెట్స్ కేసు నమోదు చేశారు. వీటిలో గొట్టిముక్కల కేసు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. బహుశా విత్‌డ్రా చేస్తారేమో! 2019లో ఈపీడీసీఎల్ విజిలెన్స్ చీఫ్‌గా ఉన్న ఎస్పీ క్యాడర్ అధికారి టి.హరికష్ణపైన, 2020 జనవరిలో పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరిలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ ఈఈ తూతిక మోహనరావుపైన, అలాగే 2020 నవంబరులో సాలూరు పంచాయతీరాజ్ డీఈపైన ఆస్తుల కేసులు నమోదయ్యాయి. వీటిపై ప్రభుత్వానికి రిపోర్టు వెళ్లింది. ఏం జరుగుతుందో వేచిచూడాలి. 2022 అక్టోబరులో పాలకొండ కమిషనర్ రామారావు ట్రాపయ్యారు. ఆ తర్వాత ఆయనపై అసెట్స్ కేసు కూడా నమోదైంది. ఇలాంటి కేసుల్లో ఒకటో రెండో మినహా మిగిలిన అన్నింటినీ ప్రభుత్వమే ఉపసంహరించుకోవడం గమనార్హం. తక్కువ మొత్తంలో లంచం తీసుకుంటూ దొరికిపోయి పనిష్మెంట్ అనుభవిస్తున్నవారు మొర్రో అని ఏడుస్తుంటే, భారీ మొత్తాల ఆక్రమాస్తుల కేసులు మాత్రం ఏళ్ల తరబడి తేలకపోగా, క్లైమాక్స్‌లో ప్రభుత్వం విత్‌డ్రా చేసుకోవడంతో కథ కంచికి చేరిపోతోంది.






Comments