ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
- DV RAMANA

- 1 hour ago
- 4 min read
విశాఖ తీరంలో జోన్ కూత
ఆరు దశాబ్దాల పోరాట ఫలం అందివస్తున్న శుభతరుణం
సోమవారం నుంచి రైల్వేజోన్ అధికారికంగా కార్యకలాపాలు
డెక్, స్వర్ణజయంతి భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు
శతాబ్దానికిపైగా వాల్తేర్ విశిష్టత ముగిసిన అధ్యాయమే
ప్రస్తుతానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లేనట్లే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం.. సుదీర్ఘ నిరీక్షణ.. సుమారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని పరిపూర్ణం చేసే ఫలితం కొన్ని గంటల దూరంలోనే ఉంది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్న నానుడికి తగినట్లే.. చాలా ఆలస్యంగానైనా ఆంధ్రుల ప్రత్యేక రైల్వే జోన్ కల కళ్ల ముందు సాక్షాత్కరించేందుకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్(సౌత్‌కోస్ట్ రైల్వే జోన్) సోమవారం(జూన్ ఒకటి) నుంచి అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి తాత్కాలిక కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపు వంటివన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించి అతిముఖ్యమైన ప్రత్యేక జోన్ ప్రారంభోత్సవాన్ని ప్రముఖులతో నిర్వహిస్తారా లేదా అన్నది ఇంతవరకు ఖరారు కాకపోయినా సోమవారం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కావడం ఖాయమైంది. దాంతో దేశంలో 20వ రైల్వే జోన్‌గా విశాఖలోని దక్షిణ కోస్తా రైల్వేజోన్ అవతరించనుంది. దేశంలో ప్రస్తుతం 18 సాధారణ రైల్వేజోన్లు, ఒక మెట్రో రైల్వేజోన్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాటి సరసన విశాఖ జోన్ చేరుతుంది.
ఇదీ స్వరూపం
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణమధ్య రైల్వే, భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే జోన్‌లను వర్గీకరించి దక్షిణకోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఖరారు చేశారు. దీని ప్రకారం దక్షిణమధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివజన్లతోపాటు తూర్పుకోస్తా పరిధిలో ఉన్న వాల్తేర్ డివజన్‌ను రెండుగా విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌ను తూర్పుకోస్తాలో కొనసాగిస్తూ.. వాల్తేరుకు బదులు విశాఖపట్నం డివిజన్‌ను కొత్త జోన్‌లో చేర్చారు. దాంతో నాలుగు డివిజన్లతో సుమారు 4100 కి.మీ. రైలు మార్గంతో కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం ఆరిలోవలో శరవేగంగా జరుగుతోంది. అంతవరకు జోన్ కార్యకలాపాలను తాత్కాలికంగా విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏకు చెందిన డెక్ భవనంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఈ జోన్ పరిధిలోకి రాష్ట్రం మొత్తం చేరుతుందని భావించినా అలా జరగకపోవడం విచారకరం. ప్రస్తుతం వాల్తేర్ డివిజన్ పరిధిలో ఉన్న విశాఖ జిల్లాలోని అరకు`కిరండూల్ లైన్‌ను తూర్పుకోస్తాలోని రాయగడ డివిజన్‌లో చేర్చారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురం, మరో మÖడు స్టేషన్లు నైరుతి రైల్వే పరిధిలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బెళ్లి డివిజన్ పరిధిలోనే ఉంచేశారు. దాంతో మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతా విశాఖ జోన్ పరిధిలో చేరినా.. ఆ రెండు ప్రాంతాలు మాత్రం రెండు వేర్వేరు జోన్లలోనే ఉండిపోతున్నాయి. మరోవైపు జోన్‌కు అవసరమైన ఉన్నతాధికారు నియామకాలన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఆ మేరకు వారంతా ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. ఆ కిందిస్థాయిలో 128 గెజిటెడ్, 1100 నాన్ గెజిటెడ్ పోస్టులను రైల్వేబోర్డు మంజూరు చేసింది. వీటిలో చాలావరకు దక్షిణమధ్య రైల్వే నుంచి, మిగతావి తూర్పుకోస్తా రైల్వే నుంచి సర్దుబాటు చేశారు.
పోరాట ఫలం

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేబోర్డు ఏర్పాటు డిమాండ్ ఇప్పటిది కాదు. దీని వెనుక సుమారు ఆరు దశాబ్దాల పోరాటం ఉంది. బ్రిటిష్ హయాంలో ఏర్పాటైన రైల్వే వ్యవస్థను స్వాతంత్య్రానంతరం మన అవసరాలకు, నిర్వహణకు అనుగుణంగా వర్గీకరించారు. ఆ మేరకు 1950వ దశకంలో దేశంలో రైల్వే వ్యవస్థను ఆరు జోన్లుగా విభజించారు. అనంతరం భాషాప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభిజించిన తర్వాత.. వాటికి అనుగుణంగా మళ్లీ రైల్వేలను పునర్వ్యవస్థీకరించి మరికొన్ని జోన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 1966లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్‌తో కలిసి ఉన్న సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్ ఏర్పాటైంది. అప్పట్లోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. జోనల్ కేంద్రంగా రాష్ట్రానికి ఆ చివరన సికింద్రాబాద్‌లో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలకు అందుబాటులో ఉండటంలేదని, అందువల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను జోన్ చేయాలన్న సామాన్యులతోపాటు వ్యాఫారవర్గాలు, ఉద్యోగులు, రాజకీయ నేతల నుంచి డిమాండ్లు పెరిగాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక వినతిపత్రాలు కూడా వెల్లువలా అందాయి. ఆ తర్వాత కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త రైల్వేజోన్లు ఏర్పాటు చేసినా విశాఖను జోన్ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటైన 2003 నుంచి ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. రైల్వేజోన్ సాధన సమితిని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు కూడా మొదలుపెట్టారు. రైల్‌రోకోలు, బంద్‌లు, డీఆరఎం ఆఫీసు వద్ద ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రానికి, ప్రత్యేకించి విశాఖకు వచ్చే మంత్రులు, ఉన్నతాధికారులందరికీ వినతిపత్రాలు ఇచ్చారు. ఇదే తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం.. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టాలని నిర్ణయించిన కేంద్రంలోని అప్పటి యÖపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ ఏర్పాటు చేస్తూనే.. ఆంధ్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు దీర్ఘకాల డిమాండ్ అయిన విశాఖ రైల్వేజోన్ మంజూరు చేస్తామని చట్టం సాక్షిగా హామీ ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం అవతరించినా విశాఖకు రైల్వేజోన్ మాత్రం రాకపోవడంతో మళ్లీ ఆందోళనలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో 2019లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కూడా దాన్ని ఆచరణలోకి తేవడంలో తీవ్ర జాప్యం జరిగింది. చివరికి ఈ ఏడాది ప్రారంభం నుంచి జోన్ ఏర్పాటు సన్నాహాలు ఊపందుకున్నాయి. గత నెలలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దక్షిణ కోస్తా రైల్వేజోన్ మనుగడలోకి వచ్చింది.
వాల్తేర్ డివిజన్ మాయం
కొత్త రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియలో ముఖ్యమైన పరిణామం రైల్వేల చరిత్రలోనే అత్యంత పురాతనమైన వాల్తేర్ రైల్వే డివిజన్ కనుమరుగు కావడమే. విశాఖ నగరంలోని ఒక చిన్న ప్రాంతమైన వాల్తేరు పేరుతో ఎప్పుడో 133 ఏళ్ల క్రితం 1893లో బ్రిటీష్ హయాంలో ఈ రైల్వే డివిజన్ ఏర్పాటైంది. అప్పట్లో ఈస్ట్‌కోస్ట్ రైల్వేలైన్ పేరుతో కొనసాగిని ఈ డివిజన్ పరిధిలో కటక్, ఖుర్దారోడ్డు, పూరి వరకు ఉన్న 96 కి.మీ. రైలుమార్గం మాత్రమే ఉండేది. 1896లో కటక్ నుంచి ఇవతల ఉన్న ఒడిశా ప్రాంతాలతో పలాస, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను కలుపుతూ 1280 కి.మీ. మేరకు రైల్వేలైన్‌ను విస్తరించారు. 1902లో ఇందులో కొంతభాగాన్ని బెంగాల్`నాగపూర్ రైల్వే పరిధిలో చేర్చింది. పురాతనమైన వాల్తేర్ డివిజన్ స్వాతంత్య్రం వచ్చాక మొదట కలకత్తా కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే జోన్‌లో, ఆ తర్వాత అదే కేంద్రంగా ఏర్పాటైన ఆగ్నేయ(సౌతఈస్ట్రన్) రైల్వే పరిధిలో ఉండేది. ఆ తర్వాత 2003లో భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన తూర్పుకోస్తా జోన్ పరిధిలో చేర్చారు. సుమారు 1106 కి.మీ. రైల్వే మార్గాలతో, కేకే లైన్ వంటి అతికీలకమైన ఖనిజ రవాణా కారిడార్‌తో, అరకు వంటి టూరిజం లైన్లతో దేశంలోనే అత్యధిక ఆదాయం సంపాదించిపెట్టే రైల్వే డివిజన్‌గా వాల్తేర్ అభివృద్ది చెందింది. దీని ఎదుగుదలకు విశాఖ నగరంలో పోర్టు స్థాపించడం బాగా దోహదం చేసింది. విశాఖ పోర్టుకు రైల్వే లైన్లు అనుసంధానించడంతో ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇనుము, బొగ్గు వంటి ఖనిజాల రవాణాకు వాల్తేర్ డివిజన్ చిరునామాగా మారింది. తర్వాతకాలంలో పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో సరుకు రవాణాతోపాటు ప్రయాణికుల రద్దీ కూడా బాగా పెరిగి వాల్తేర్ డివిజన్ ప్రాధాన్యతను పెంచింది. కాగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో జరిపిన పునర్వ్యవస్థీకరణలో వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేసి ఒకదాన్ని రాయగడ డివిజన్ పేరుతో ఈస్ట్‌కోస్టు జోన్‌లో ఉంచారు. రెండో ముక్కను విశాఖపట్నం డివిజన్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణకోస్తా జోన్‌లో చేర్చారు. ఇక వాల్తేరుగా ఉన్న రైల్వేస్టేషన్ పేరును కూడా ఇటీవలి కాలంలోనే విశాఖపట్నం జంక్షన్‌గా మార్చేశారు. ఫలితంగా శతాబ్దానికిపైగా అద్భుతమైన రికార్డు కలిగిన, ఈ ప్రాంతంలో రైల్వేకు చిరునామాగా ఉన్న వాల్తేర్ పేరు ఇక చరిత్రకే పరిమితం.
అన్ని ఏర్పాట్లతో సిద్ధం

డాక్టర్ పూడి హరిప్రసాద్, చీఫ్ పైనాన్షియల్ అడ్వైజర్
కొత్త జోన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక కార్యక్రమాలేవీ ఇంతవరకు ఖరారు కాకపోయినా.. సోమవారం నుంచి కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు దక్షిణకోస్తా రైల్వేజోన్ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ డాక్టర్ పూడి హరిప్రసాద్ చెప్పారు. ‘సత్యం’ ప్రతినిధి ఆయన్ను ఫోనులో సంప్రదించగా జోన్ ప్రారంభానికి సర్వం సిద్ధమైందన్నారు. సొంత భవనాల నిర్మాణం జరుగుతున్నందున తాత్కాలికంగా వీఎంఆర్‌డీఏకు చెందిన డెక్ భవనంలోని రెండు అంతస్తులను పూర్తిగా.. అలాగే స్వర్ణజయంతి భవనాన్ని తీసుకుని కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 600 మందికిపైగా అధికారులు, సిబ్బంది విధుల్లో చేరారని వెల్లడించారు. కొత్త జోన్ వల్ల ఇక్కడి నుంచే పాలన సాగించే వెసులుబాటు కలిగినా.. కీలకమైన రైల్వే నియామకాలకు సంబంధించి మాత్రం ఇంకా స్వేచ్ఛ లభించలేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. రైల్వేబోర్డు విధానాల ప్రకారం రెండు జోన్లకు ఒక రైల్వే రిక్రూట్‌మెంటు బోర్డు(ఆరఆర్‌బీ) ఉంటుందని.. ఆ ప్రకారం సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఉన్న ఆరఆర్‌బీ ద్వారానే విశాఖ జోన్ ప్రస్తుతానికి ఉంటుంది. భవిష్యత్తులో ఈ విషయంలో కూడా విశాఖ జోన్‌కు అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






Comments