ఐదేళ్ల నిరీక్షణకు ముగింపు.. అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశం
- BAGADI NARAYANARAO

- 1 hour ago
- 2 min read
డి-పట్టాల రద్దు.. సన్ రెస్టారెంట్ తొలగింపునకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్
నాలుగేళ్లు నిలిచిన ఫైల్
రాగోలు భూవివాదానికి తెర

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఐదేళ్ల నిరీక్షణ తర్వాత శ్రీకాకుళం మండలం రాగోలులోని ఐదున్నర సెంట్లు డి`పట్టా భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఆర్డీవో ప్రత్యూష ఈ నెల 27న ఉత్తర్వులు జారీచేశారు. నాలుగేళ్ల క్రితం జరగాల్సిన ప్రక్రియ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపి గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసిన నాలుగు డి`పట్టాలను రద్దు చేస్తూ అందులో నిర్మించిన అక్రమ కట్టాడాన్ని తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే..
రాగోలు 147/2లో ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల్లో గోర్జి (పంచాయతీరాజ్ రోడ్డు)గా నమోదైవుంది. ఈ భూమిపై నలుగురికి పట్టాలు ఇస్తే వాటిని లబ్ధిదారులు దుర్వినియోగం చేసి విక్రయించేశారు. డి`పట్టా భూమిలో అనధికారికంగా వాణిజ్య సముదాయాన్ని ఆమదాలవలస జెడ్పీటీసీ బెండి గోవిందరావు సన్ రెస్టారెంట్‌ను నడిపిస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్ప్పుడు పంచాయతీ అధికారుల అనుమతి తీసుకోకుండా వాణిజ్య సముదాయం నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో అప్పటి ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చేయడానికి సిద్ధమయ్యారు. వైకాపా నాయకులు జోక్యం చేసుకొని కొంత గడువు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. గడువు కోరిన గోవిందరావు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు భూస్వభావం, అక్రమ నిర్మాణంపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. 2022 ఏప్రిల్ 29న డి`పట్టాలు కలిగిన నలుగురు లబ్ధిదారులకు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆమదాలవలసకు వైకాపా నాయకులు జోక్యం చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు గోవిందరావు ప్రత్యర్ధులు ఫిర్యాదు చేశారు. సీఎంవో ద్వారా వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన లోకేష్ దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. డి`పట్టా భూమిలో వాణిజ్య సముదాయం నిర్మించిన గోవిందరావుకు 2025 జూన్ 14, జూలై 19న, నవంబర్ 25న, డిసెంబర్ 30న నోటీసులు పంపించి వివరణ కోరారు. నోటీసులు అందుకున్న గోవిందరావు రెవెన్యూ అధికారులు పదేపదే నోటీసులు ఇస్తూ మానసికంగా వేధిస్తున్నారని హైకోర్టులో రెవిన్యూ అధికారులపై పిటిషన్ వేసినట్టు తెలిసింది. పిటిషన్‌లో ఈ భూమి 147/2బికి చెందినదని సర్వే నెంబర్ 147/2తో సంబంధం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రస్తుత నిర్మాణ స్థితిపై చట్టానికి లోబడి విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు 1993లో డి`పట్టాలు పొందినట్టు రికార్డుల్లో ఉన్న ఏ.రామారావు, బూర్లె రమణ మూర్తి, శిర్ల శశికళ, మెండ లక్ష్మీలకు నోటీసులు జారీ చేసి, వారి నుంచి వివరాలను రికార్డు చేశారు. అదే సమయంలో అదే భూమి మీద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన గోవిందరావుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నిర్మాణంతో తనకు సంబంధం లేదని న్యాయవాది ద్వారా గోవిందరావు వివరణ ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు సదరు నిర్మాణానికి ఎవరి పేరుతో విద్యుత్ మీటర్ జారీ చేసిందని ఆ శాఖ అధికారులకు లేఖ రాశారు. దీనిపై విద్యుత్‌శాఖ బెండి గోవిందరావు పేరుతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్టు సమాచారం ఇచ్చారు.
సర్వే నెంబర్ 147/2లో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నుంచి జారీ చేసినట్టు చెబుతున్న డి`పట్టాలను లబ్ధిదారులు విక్రయించినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నలుగురిలో ఒకరికి ఒకటింపావు సెంట్లు, మిగతా ముగ్గురికి చెరో సెంటున్నర స్థలంతో కలిసి పావు తక్కువ ఆరు సెంట్లు స్థలంతో పాటు అదనంగా మరో పావు సెంటు స్థలాన్ని ఆక్రమించి మొత్తం 6 సెంట్లు స్థలంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెంబర్ 147/2లో మొత్తం 99 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు స్థలంగా నమోదై ఉంది. దీంతో స్థానికులు తమ నడకదారిలో అక్రమ నిర్మాణం మొదలైనట్లు 2022లోనే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసినా చివరి నిమిషంలో రాజకీయ జోక్యంతో నిర్మాణం తొలగింపు నిలిచిపోయింది. ఇప్ప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కోర్టు విధించిన నిబంధనల మేరకు విచారణ జరిపి ఆర్డీవో నాలుగు పట్టాలను రద్దు చేసి, అక్రమ నిర్మాణం తొలగించాలని తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు.






Comments