top of page

మందులోళ్లు.. మహా మాయగాళ్లు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 3 min read
  • మందుల పేరుతో విషం అమ్ముతున్న సంస్థలు

  • ధనార్జనే ధ్యేయంగా పిల్లల ప్రాణాలతో చెలగాటం

  • ఓఆర్ఎస్‌లు, సూపర్ మిల్క్ పేరుతో మార్కెట్ దోపిడీ

  • ఔషధ నియంత్రణ తనిఖీలు నామమాత్రం.. చర్యలు పూజ్యం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

  • గత ఏడాది మధ్యప్రదేశ్‌లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు 20 మంది చిన్నారులను బలి తీసుకుంది.

  • తాజాగా ఆల్‌మాంట్ కిడ్స్ సిరప్‌లో విషపూరిత రసాయనం ఉందని తేలడంతో ఆ ఔషధానికి చెందిన ఒక బ్యాచ్ మొత్తాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి.

  • నిబంధనలకు విరుద్ధంగా ఫ్రూట్ జ్యూస్‌లు, పలు ఎనర్జీ డ్రింకులను  ఓఆర్ఎస్‌పేరుతో మార్కెటింగ్ చేయడాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది.

  • పిల్లల్లో శారీరక ఎదుగుదలకు ముఖ్యంగా హైట్ పెరగడానికి తమ సూపర్ మిల్క్ ఉత్పత్తులు వాడాలంటూ ఒక సంస్థ తప్పుడు ప్రచారం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

  • కుక్క కాటుకు గురయ్యే ప్రమాదమున్న వెటర్నరీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ముందుజాగ్రత్తగా ఇచ్చే అభjáYT ర్యాబ్ అనే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌లో లోపాలు ఉన్న ఒక బ్యాచ్ వినియోగించవద్దని విదేశాల హెచ్చరికలు

.. ఇవన్నీ చూస్తుంటే ప్రాణ రక్షణ ఔషధాలే మనుషుల పాలిట ప్రాణాంతక ఔషధాలుగా మారుతున్నాయన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఔషధాలు తయారు చేసే ఫార్మా పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, అధిక లాభార్జన యావ, ఎవరేం చేస్తారు లే అన్న నిర్లక్ష్యం వంటివి విషపూరిత ధోరణులు ఔషధాలను కలుషితం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో గత ఏడాది కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు తాగి 20 మంది చిన్నారులు చనిపోయారంటేనే ఔషధ తయారీ రంగం ఎంతగా దిగనాసిల్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇది జరిగిన తర్వాత కూడా తయారీ కంపెనీలు గుణపాఠం నేర్చుకోలేదు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు సైతం అప్రమత్తం కాలేదని పైన పేర్కొన్న ఐదు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాల స్థాయిలో ఔషధ నియంత్రణ శాఖలు పని చేస్తున్నా.. కఠినమైన ప్రమాణాలు, మార్గదర్శకాలు ఎన్ని ఉన్నా.. తయారీ స్థాయిలో పాతుకుపోయిన నిర్లక్ష్యం, మామూళ్లు మత్తులో పడి నామమాత్రపు తనిఖీలతో సరిపుచ్చడం వంటి పలు కారణాల వల్ల నాసిరకం మందులు బహిరంగ విపణిలోకి వచ్చిపడిపోతున్నాయి. తమ ఉత్పత్తులకు తయారీ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మాయ చేస్తూ అమ్మకాలు పెంచుకుంటున్నాయి. ఇలాంటి ఉత్పత్తులను వినియోగించిన ఆమాయక రోగులు బలైపోతున్నారు. అప్పుడు తీరిగ్గా కళ్లు తెరిచే అధికారులు ఆపసోపాలు పడుతూ, హడావుడి చేస్తూ ఫలానా బ్యాచ్‌కు చెందిన.. ఫలానా ఔషధాన్ని నాణ్యత ప్రమాణాల లోపం కారణంగా నిషేధించామని, దాన్ని అమ్మవద్దని, వినియోగించవద్దని హెచ్చరిస్తూ నోటీసులు, పత్రికా ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. మధ్యప్రదేశ్ మరణాలే దీనికి నిదర్శనం. చివరికి ఔషధ తయారీ సంస్థలు చిన్నారుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతూ అక్రమార్జనకు తెగబడుతున్నాయి. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు కూడా ఈ జాబితాలో చేరుతున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు.

పిల్లల సిరప్‌లో విషపూరిత రసాయనం

చిన్నారుల్లో జలుబు, అలర్జీలను తగ్గించేందుకు వాడే అల్మాంట్ కిడ్స్ అనే సిరప్‌లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో ఈ సిరప్‌ను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బీహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారుచేసిన ఈ సిరప్‌కు చెందిన ఏఎల్-24002 బ్యాచ్‌పై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) దేశవ్యాప్త అలర్ట్ జారీ చేసింది. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దీని వినియోగాన్ని నిలిపివేశాయి. ఈ వివాదం ఔషధ నియంత్రణ వ్యవస్థలోని లోపాలను లేవనెత్తుతోంది. ఈ సిరప్ వల్ల ఇంతవరకు ఎలాంటి మరణాలు నమోదు కానప్పటికీ, ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరప్‌లో వాడిని ఇథిలీన్ గ్లైకాల్ అనేది పారిశ్రామిక సాల్వెంట్‌గా వాడే విషపూరిత రసాయనం. ఇది మందుల్లో అసలు ఉండకూడదు. గతంలో ఇలాంటి కలుషిత మందుల వల్ల గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో బాలల మరణాలు సంభవించాయి. నేపథ్యంలో ఈ పరీక్షలు మరింత కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. ఇథిలీన్ గ్లైకాల్ శరీరంలోకి వెళితే కిడ్నీలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

పాతాళానికి సూపర్‌మిల్క్ ప్రచారం

వయసు పెరుగుతున్నా పిల్లల్లో తగిన ఎదుగుదల లేకపోయినా.. వయసుకు తగిన ఎత్తు పెరగకపోయినా తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. వాటిని సాధించడానికి పడరాని పాట్లు పడుతుంటారు. అలుపెరుగని ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బులు కుమ్మరిస్తుంటారు. సరిగ్గా ఇదే బలహీనతను ఆసరా చేసుకుని కొన్ని సంస్థలు మార్కెట్ మాయాజాలానికి పాల్పడుతున్నాయి. అందులో భాగమే మార్కెట్‌ను ముంచెత్తుతున్న పలు రకాల సూపర్ మిల్క్ మిక్స్‌లు. వీటిని పిల్లులతో తాగిస్తే ఎత్తు బాగా పెరిగి పొడగరులుగా తయారవుతారని.. సదరు ఉత్పత్తి సంస్థలు ప్రచారంతో హారెత్తిస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. వినియోగదారులను మోసం చేసి డబ్బులు గుంజుకోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొడవు లేదా ఎత్తు పెరగడానికి సూపర్ మిల్స్ కాదు కదా.. శ్రేష్టంగా భావించే ఆవు పాలతో కూడా సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఎత్తు పెరుగుదల అనేది జెనటిక్స్ అంటే జన్యుపరమైన అంశం. ఇది కుటుంబ వంశవక్షంపై ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో ముందు తరాలవారు పొడగరులైతే వారి సంతతి పిల్లలు కూడా పొడగరులవుతారు. వారు పొట్టివారైతే.. ఇప్పటి తరంవారు పొట్టివారిగానే ఉంటారు. అంతే తప్ప ప్రొటీన్ ఫ్యాక్టర్ వన్, ఐజీఎఫ్ వన్ వంటి సమ్మేళనాలతో కూడిన మిల్క్ మిక్స్‌లు, సూపర్ మిల్క్‌ల వల్ల ఎత్తు పెరగడం అసాధ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇటువంటి ప్రచారాలతో ఉత్పత్తులను అమ్ముకుని కోట్లు ఆర్జిస్తున్నాయి.

అన్నీ ఓఆర్ఎస్‌లు కావు

ఫ్రూట్ జ్యూస్‌లు, ఇతర పానీయాల తయారీ సంస్థలు మరో రకమైన మార్కెట్ మాయాజాలానికి తెగబడుతూ ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి చిన్న రుగ్మత, శారీరక అస్వస్థత కలిగినా ఎనర్జీ డ్రింకులు తాగడం సాధారణం. ఇవి తాగితే శరీరం శక్తి పుంజుకుంటుందని అందరూ నమ్ముతుంటారు. వీటినే ఓఆరఎస్ (ఓరల్ రీహైడ్రేట్ సాల్వెంట్స్) పేరుతో మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లలో ఎనర్జీ డ్రింకులంటూ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఓఆరఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నీ ఎనర్జీ డ్రింకులు అయిపోవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారైన ఎలక్ట్రాల్ పౌడర్ వంటివే అసలైన ఎనర్జీ లేదా ఓఆరఎస్ డ్రింకులుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో కొన్ని సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి భారత ఫుడ్ సేఫ్టీ సంస్థ ఎఫఎసఎసఏఐ డబ్యుహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పానీయాల ప్యాకేజీలపై ఓఆరఎస్ అన్న లేబుల్ తొలగించాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇటీవల అదే తరహా ఆదేశాలు జారీ చేసింది.

యాంటీ ర్యాబిస్ మందుల్లోనూ లోపాలు

కుక్క కాటు నుంచి ముందస్తు రక్షణ కోసం పశువైద్యులు, ఇతర వెటర్నరీ సిబ్బందికి ఇచ్చే అభయ ర్యాబ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్‌కు చెందిన కె.ఎ.24014 బ్యాచ్ మొత్తం స్టాకును మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2025లోనే ఈ బ్యాచ్‌లో లోపాలను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్యాచ్ లోపాలపై 2023 నుంచి పరీక్షలు, అధ్యయనాలు జరుపుతున్నట్లు సదరు టీకాల తయారీ సంస్థ పేర్కొంది. అంటే 2023 నాటికే నాసిరకం లేదా నకిలీ అభjáYTర్యాబ్ టీకాలు మార్కెట్లో ఉన్నా.. ఆ విషయాన్ని ఉత్పత్తి సంస్థ ఎందుకు బహిరంగపర్చలేదన్నది ప్రశ్నార్థం. అలాగే సుమారు రెండేళ్లపాటు మార్కెట్లో ఎంత స్టాక్ అమ్ముడుపోయింది.. ఎంతమంది నష్టపోయారన్న వివరాలు సదరు సంస్థ వెల్లడించకపోవడం, ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది.

ఈ ఉదంతాలన్నీ ఔషధ రంగంలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి మరిన్ని సంస్కరణల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page