ఆరు దాటితే హడల్!
- BAGADI NARAYANARAO

- 1 day ago
- 2 min read
టిడ్కో కాలనీలో ఆరుగురి అరాచకం
కాలం చెల్లిన బైకులతో విశృంఖల విహారం
అడిగినవారిపై దాడులతో వీరంగం
బైండోవర్ కేసులతో సరిపెట్టిన పోలీసులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ద్విచక్ర వాహనాలను అతివేగంతో నడుపుతుండటంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ఇది తప్ప్పు అని ప్రశ్నించినందుకు శెట్టి చిన్నారావు అనే వ్యక్తిని ఆ మÖకలు రోడ్డుపై ఈడ్చి కొట్టాయి. ఇది మరీ దారుణమని ఇరుగుపొరుగు మహిళలు నిలదీస్తే వారిని దూషిస్తూ వారిపై దాడి చేసి బట్టలు చించేశారు. సమీపంలో ఉన్న టైలరింగ్ షాపుపై రాళ్లు, ఇటుకలు విసిరి కాలనీవాసులను బెదిరించారు. బాధితుడు చిన్నాకు చెందిన టైలరింగ్ షాపులో దూరి షట్టర్లు లాగి షాపును ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. బైక్‌లపై వచ్చేవారిని ఎవరైనా ఆపితే రోడ్డుపైనే అంతుచూస్తామని, వారి పిల్లలను చంపేస్తామని బెదిరించారు.
వివరాల్లోకి వెళితే..
ఈ నెల 2న సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డుపై పిల్లలు ఆడుతుండగా, కొందరు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై అత్యంత వేగంగా దూసుకుపోతుండటంతో రోడ్డుపై తిరిగే చిన్నపిల్లలకు ప్రమాదం సంభవిస్తుందని పాత్రునివలసకు చెందిన శెట్టి చిన్నారావు ద్విచక్ర వాహనాలను ర్యాష్‌గా నడుపుతున్న యువకులను నిలదీశాడు. దాని పర్యవసానమే పాత్రునివలసలో టిడ్కో ఇళ్ల వద్ద నివాసముంటున్నవారు కంటి మీద నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తమపై ఫిర్యాదు ఇచ్చినందుకు ఈ మÖకలు ముందుగానే వార్నింగ్ ఇచ్చిన మేరకు ఏ క్షణాన ఏం చేస్తారోనని హడలిపోతున్నారు. సాయంత్రం ఆరు దాటితే పాత్రునివలస టిడ్కో ఇళ్లల్లో నివాసం ఉంటున్నవారు హడలిపోతున్నారు. సుమారు 600 కుటుంబాలు నివాసం ఉన్న టిడ్కో కాలనీలో కేవలం ఆరుగురు యువకులు చేస్తున్న అలజడి వల్ల రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. 15 రోజుల క్రితం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి సిబ్బందితో కలిసి టిడ్కో కాలనీలో యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. స్థానికంగా ఉన్న ఇద్దరు యువకులతో కలిసి పరిసర ప్రాంతాలకు చెందిన మరికొందరిని వెంటబెట్టుకుని టిడ్కో కాలనీలో హంగామా సృష్టిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్డులపై బైక్‌లను 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగురు యువకుల్లో రామదాసుపేటకు చెందినవారు ఊరంతా కలిసొచ్చి దాడి చేస్తామని టిడ్కో కాలనీవాసులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో భయపడిన టిడ్కో కాలనీకి చెందిన మహిళలంతా సోమవారం నిందితులు తరుణ్, దినేష్‌తో పాటు మరో నలుగురిపై ఎసఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు బాధ్యులైన యువకులను స్టేషన్‌కు పిలిపించినట్లు తెలిసింది. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆరుగురు యువకులు వినియోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని తల్లిదండ్రులతో హాజరు కావాలని పోలీసులు ఆదేశించినట్లు భోగట్టా. పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా కొందరు మాత్రమే ఒక ద్విచక్ర వాహనాన్ని తీసుకుని హాజరైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు గట్టిగా చెప్పడంతో బుధవారం ఉదయం ఆరుగురు యువకులతో పాటు తల్లిదండ్రులు, వారు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాలతో హాజరయ్యారు.
తరుణ్ గ్యాంగ్ వినియోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలకు ఎటువంటి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. ఈ రెండు వాహనాలకు కాలం చెల్లిపోయిందని, వాటిని మరమ్మతులు చేసి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ముందు హాజరైన ఆరుగురిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేయకుండా శ్రీకాకుళం తహసీల్దారు కార్యాలయానికి తరలించి బైండోవర్ చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కాలనీవాసులను తరుణ్, దినేష్ బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారిని గుర్తించి వారి వాహనాలను దహనం చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు చెబుతున్నారు.
టిడ్కో సముదాయంలో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కాలనీకి చెందిన తరుణ్, దినేష్‌తో పాటు రామదాసుపేట, పాత్రునివలసకు చెందిన కొందరు యువకులు వీటినే అడ్డాగా చేసుకుని గంజాయి, మద్యం సేవిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. తరుణ్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేయడమే వృత్తిగా మార్చుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తరుణ్‌పై అనేక చోట్ల చోరీ కేసులు ఉన్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. రాత్రి వేళ చోరీలు చేస్తూ కొంతమంది యువకులను గ్యాంగ్‌గా చేసుకుని వెంట తిప్పుకోవడం కోసం మద్యం, గంజాయిని అలవాటు చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాత్రునివలస, పెద్దపాడు, రామదాసుపేట గ్రామాల పరిధిలో పొట్టేళ్లను దొంగతనం చేస్తూ ఒకసారి పట్టుబడి తప్పించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పొట్టేళ్లు దొంగతనం చేస్తున్నట్లు రూరల్ పోలీసులకు తరుణ్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. తరుణ్ సారథ్యంలో ఆరుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి టిడ్కో కాలనీని అడ్డాగా మార్చుకుని చుట్టుపక్కల గ్రామాల్లో ఆగడాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మాత్రం బాధ్యుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించి బైండోవర్‌తో సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ అనే యువకుడికి అనేక నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని టిడ్కో వాసులు చెబుతున్నారు.






Comments