top of page

ఇంగ్లీష్ కష్టంగా ఉందంది.. అంతలోనే ఎంతపని చేసింది?

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 12 hours ago
  • 2 min read
  • మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

  • వార్డెన్, నైట్ వాచ్‌మెన్ నిర్లక్ష్యంపై బంధువుల తీవ్ర ఆగ్రహం

  • హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ

  • కేసు నమోదు చేసిన పోలీసులు

(సత్యంన్యూస్, కొత్తూరు)

కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ (కేజీబీవీ టైప్-4) వసతి గృహంలో గురువారం అర్థరాత్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీతంపేట మండలం లక్కయ్యగూడ గ్రామానికి చెందిన సవర బిడ్డికయ్య, తుప్పమ్మ దంపతుల చిన్న కుమార్తె సవర పూజ (16)గా అధికారులు మృతురాలిని గుర్తించారు. వీరు ప్రస్తుతం రాజాంలో నివాసం ఉంటున్నారు.

15 రోజుల క్రితమే పూజ కొత్తూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరంలో చేరింది. కళాశాలకు అనుబంధంగా ఉన్న కేజీబీవీ హాస్టల్‌లోనే ఉంటూ చదువుకుంటోంది. గురువారం ఉదయం కుమార్తెను చూడటానికి తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో ‘ఇంగ్లీష్ సరిగా అర్థం కావడం లేదు, చదవడం కష్టంగా ఉంది.. ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి’ అని పూజ తల్లిదండ్రులను కోరింది. దానికి తండ్రి బిడ్డికయ్య సర్దిచెబుతూ, రెండు రోజులు పోయాక కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి గ్రూప్ మార్చేందుకు ప్రయత్నిస్తానని నచ్చజెప్పారు.

అర్థరాత్రి ఫ్యాన్‌కు ఉరి... పుస్తకంలో ‘సారీ’!

తల్లిదండ్రులు వెళ్లిన కొన్ని గంటల్లోనే, గురువారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత హాస్టల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో పూజ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, ఆత్మహత్య చేసుకున్న స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఒక వాటర్ డ్రమ్ముపై తెరిచి ఉన్న పుస్తకాన్ని గుర్తించారు. ఆ పుస్తకంలో ‘లక్కీ, లక్కీ, లక్కీ... సారీ’ అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బంధువుల తీవ్ర ఆరోపణలు - హత్యేనని అనుమానం!

అయితే అధికారుల కథనాన్ని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో విద్యార్థిని హాస్టల్ గది దాటి మొదటి అంతస్తుకు వెళ్తుంటే నైట్ వాచ్‌మెన్, డ్యూటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? అని వారు ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ఎవరో పూజను హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

దర్యాప్తు వేగవంతం:

కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తూరు తహసీల్దార్ సమక్షంలో మృతురాలి కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.5వేలు అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని, సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page