top of page

ఆర్నెల్ల అమాత్యుడి అత్యాశ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే రెండుసార్లు మంత్రి

  • ఒకసారి సుమారు 5 నెలలు.. మరోసారి 3 నెలలు

  • రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వరకే వెసులుబాటు

  • కానీ గడువుకు ముందే పదవి పోతే..

  • మళ్లీ పూర్తి అర్నెళ్లు చేయొచ్చని వింత వాదన

  • మంగళవారం విచారించనున్న సుప్రీంకోర్టు సీజేఐ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

చట్టసభల సభ్యులు కాని వ్యక్తులు మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులను చేపట్టడానికి అనర్హులని మన రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ నిబంధనకు కొంత సడలింపు ఇచ్చింది. చట్టసభ సభ్యుడు కాకుండానే ఎవరైనా పైన పేర్కొన్న పదవులు చేపడితే.. ఆ పదవులు చేపట్టిన నాటినుంచి ఆరునెలల్లోగా ఆ పరిధిలోని ఏదో ఒక చట్టసభకు ఎన్నికవ్వాలని కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ వెసులుబాటును పలు సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో రాజకీయ అవసరాలకు కూడా వినియోగించుకున్న ఉదంతాలు ఉన్నాయి. కానీ రాజ్యాంగం కల్పించిన ఆరునెలల వెసులుబాటును ఎవరికివారు తమకు అనుకూలంగా, అనువైన సమయంలో దఫదఫాలుగా వినియోగించుకోవచ్చా? ఈ రాజ్యాంగ వివాదం ఇప్పుడు పరిష్కారం కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. బీహార్‌లో ఏ చట్టసభకు ప్రాతినిధ్యం వహించని ఒక నాయకుడు ఏకంగా రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా వెలగబెట్టడం, అడిగితే తనకున్న ఆరునెలల వెసులుబాటును రెండు దఫాలుగా వినియోగించుకోవడం తన హక్కన్నట్లుగా వ్యహరిస్తుండటం విశేషం. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు సర్వోన్నత న్యాయస్థానం స్వీకరించడంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. న్యాయస్థానం ఏం చెబుతుందా? అని రాజకీయవర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివాదానికి కారణమైన ఆ ఉదంతమేమిటో చూద్దాం.

రెండుసార్లు మంత్రి

బీహార్‌లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సమాట్ర్ చౌదరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కేబినెట్‌లో దీపక్‌ప్రకాష్ కుశ్వాహ మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్రీయ లోక్‌మోర్చా నాయకుడైన ఈయన ఆ పార్టీకి కూటమి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తూ పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ముందు ఉన్న నితీష్‌కుమార్ ప్రభుత్వంలోనూ దీపక్‌ప్రకాష్ 2025 నుంచి మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఎన్డీయే పార్టీల మధ్య అధికార మార్పిడిలో భాగంగా నితీష్‌కుమార్ కేబినెట్ రాజీనామా చేయగా.. కొన్ని రోజుల వ్యవధిలో బీజేపీ నేత సమ్రాట్‌చౌదరీ ముఖ్యమంత్రిగా కొత్త కేబినెట్ ఏర్పాటైంది. ఇందులోనూ రాష్ట్రీయ లోక్‌మోర్చా ప్రతినిధిగా దీపక్‌ప్రకాష్ పంచాయతీరాజ్ మంత్రి బాధ్యతలు చేపట్టారు. రెండుసార్లు మంత్రి అయిన ఆయన ప్రజాప్రతినిధి కాకపోవడం విశేషం. ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా గానీ ఎన్నిక కాని ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంది. కానీ అలా చేయకుండానే ఆరు నెలల గడువు దాటిపోయినా కూడా ఆయన మంత్రి పదవిలో దర్జా వెలగబెడుతున్నారు. 2025లో తొలిసారి మంత్రి అయిన ప్రదీప్‌ప్రకాష్ నితీష్ ప్రభుత్వ రాజీనామాతో ఈ ఏడాది ఏప్రిల్ 15న పదవి కోల్పోయారు. అప్పటికి మంత్రిగా ఆయన నాలుగు నెలల 26 రోజులు పని చేశారు. ఆ తర్వాత 22 రోజులు ఎలాంటి పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. అనంతరం 2026 మే ఏడో తేదీన సమ్రాట్ చౌదరి సీఎంగా కొత్త కేబినెట్ ఏర్పడగా అందులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత మÖడు నెలలుగా ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆరు నెలలకు మించి మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన ప్రశ్న. ఎన్నిక కాకుండానే ఒక మంత్రి ఆరు నెలలకు పైగా పదవిలో ఎలా కొనసాగుతున్నారో ప్రభుత్వం వివరించాలంటూ బీహార్ ప్రభుత్వాన్ని సీజేఐ ఆదేశించారు. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ కోసం ఈ నెల నాలుగో తేదీకి వాయిదా వేశారు.

ఆరు నెలలు దాటినా..

అయితే ఈ వివాదంపై బీహార్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. దీపక్‌ప్రసాద్ ఏకధాటిగా ఆరు నెలలు మంత్రిగా కొనసాగలేదు.. మొదటిసారి నాలుగు నెలల 26 రోజులు మాత్రమే మంత్రిగా ఉన్నారని.. మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున మొదటి పదవీకాలం వర్తించదని.. రెండుసారి మంత్రిగా ఇంకా ఆరు నెలలు పూర్తికాలేదని అందువల్ల రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు కాదని ప్రభుత్వవర్గాలు వాదిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ఒక ధర్మసందేహం వ్యక్తమవుతోంది. చట్టసభలకు ఎన్నిక కాని వ్యక్తి మొత్తంగా ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉండవచ్చా లేక విడతలవారీగా పదవీకాలన్ని పరిగణిస్తారా? అన్నదే ఆ సందేహం. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్నే స్పష్టంగా నిర్వచించాల్సి ఉంది. అయితే విడతలవారీగా ఆరునెలలు పూర్తి చేయాలన్న వాదనకే గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అదో దుస్సంప్రదాయంగా మారే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వ, పార్టీ పెద్దలు తమకు ఇష్టమైన వారిని మంత్రులుగా నియమించి సరిగ్గా ఆరునెలలకు ఒకటి రెండు రోజులు ముందు రాజీనామా చేయించి.. మళ్లీ మంత్రిగా తీసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది. అలా ఎన్నిసార్లు అయినా ఒక నాయకుడిని విడతలవారీగా మంత్రిగా కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ప్రమాదం ఉంది.

గతంలో నిబంధనల పాటింపు
  • గతంలో ఇటువంటి పరిణామాలు ఎప్పుడూ సంభవించలేదు. దేవెగౌడ చట్టసభకు ఎన్నిక కాకుండానే ప్రధానమంత్రి పదవి అధిష్టించారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఆరునెలల్లోనూ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

  • అదే విధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి చేపట్టిన తర్వాతే ఆరు నెలల గడువులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

  • ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరథ్ సింగ్ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలనుకున్నారు. అయితే కారోనా కారణంగా నిర్దేశిత ఆరు నెలల గడువులోగా ఎన్నికలు జరగకపోవడంతో రాజ్యాంగానికి కట్టుబడి గడువుకు కొన్ని రోజుల ముందు సీఎం పదవిని రాజీనామా చేశారు.

  • ఇక మన రాష్ట్రంలోనే 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నక్సలైట్ల కాల్పుల్లో మరణించగా, అప్పటికి రాజకీయాల్లోనే లేని ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకొచ్చి 2018 నవంబర్ 11న ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం గడువులోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వకపోవడంతో రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలకు సరిగ్గా ఒక్కరోజు ముందు శ్రావణ్‌కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

  • ఇవన్నీ రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడిన ఉదంతాలు.. కానీ ఎప్పుడూ ఎక్కడా దానికి భిన్నభాష్యం చెప్పడానికి ఎవరూ ప్రయత్నించలేదు. కానీ బీహార్ మంత్రి దీపక్‌ప్రకాష్ విషయంలో మంత్రిగా ఆరునెలలుగా పూర్తి కాకుండానే గ్యాప్ వచ్చిందన్న కారణంతో మరో ఆరునెలలు ఆ పదవిలో ఉంటామనడం అత్యాశే కాకుండా రాజ్యాంగం కల్పించిన వెసులుబాటుకు వక్రభాష్యం చెప్పినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page