పరామర్శ ఒక నెపం... అసలు లక్ష్యం బలప్రదర్శనే
- Prasad Satyam
- 5 hours ago
- 3 min read
జగన్ ‘ములాఖత్ ’ స్కెచ్
అప్పలరాజు నెపంతో అంపోలు దాకా...
పరామర్శ మిస్సయినా... మైలేజ్ దక్కింది
ఆంక్షలు దాటి వచ్చిన జనం..
2024 ఓటమి తర్వాత కూడా తగ్గని ‘క్రౌడ్ పుల్లింగ్ ’
జగన్ పన్నిన రాజకీయ వ్యూహంలో ‘కూటమి’ పడిందా?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజు ములాఖత్ పేరుతో జరిపిన యాత్రలో ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. అప్పలరాజును పరామర్శిస్తానంటూ వచ్చిన జగన్ ఆయన్ను కలవకుండానే వెళ్లిపోయారని అధికార పక్షం తప్ప్పుపడుతున్నప్పటికీ జగన్, ఆయన పార్టీ అసలు లక్ష్యం అప్పలరాజును పరామర్శించడం కాదు. అది పార్టీ బలప్రదర్శనలో ఒక భాగం మాత్రమే. ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ అయిన గన్నవరం టు విశాఖపట్నం ఫ్లైట్‌లో దిగిన జగన్మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటే సాయంత్రం 6 గంటల లోపు అప్పలరాజును పరామర్శిస్తారనుకోవడం భ్రమే. క్రౌడ్ పుల్లింగ్‌లో ఇప్పటికీ తన సత్తా తగ్గలేదని 2024 ఓటమి తర్వాత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పరామర్శలు నిరూపించాయి. అటువంటప్ప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో జగన్ వస్తే ములాఖత్ జరిగే పని కాదు. జగన్ లక్ష్యమÖ అది కాదు. ఎందుకంటే.. అప్పలరాజుకు, ఆయన కుటుంబానికి సీదిరి అరెస్టు కాకముందే జగన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. మళ్లీ కొత్తగా అప్పలరాజును కలిసి ఓదార్చాల్సిన సందర్భం కల్పించుకోనవసరం లేదు. కానీ గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అన్ని సీట్లూ కోల్పోయిన వైకాపా రెండేళ్ల విరామం తర్వాత బలపడిందీ, లేనిదీ తెలుసుకోవాల్సిన అవసరం జగన్‌కు ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి పట్ల ప్రజల వ్యతిరేకత ఏమేరకు ఉందో తెలుసుకోవాల్సిన వ్యూహం కూడా ఇందులో దాగివుంది. ఈ ట్రాప్‌లోనే ప్రభుత్వం కూడా పడింది. పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించిన తర్వాత కూడా ఎంతమంది తన పర్యటనకు వస్తున్నారు? ఏమేరకు ఆదరిస్తున్నారనేది జగన్మోహన్‌రెడ్డికి గురువారం నాటి షోలో అర్థమైపోయింది. జగన్‌కు కావాల్సిందీ ఇదే. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైకాపా నాయకుడు పాలవలస రాజశేఖరం మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్‌రెడ్డి పాలకొండ వచ్చారు. అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో. కానీ అందులో బలప్రదర్శన లేదు. గురువారం అప్పలరాజు ములాఖత్‌లో రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల నాడి తెలుసుకుంటూనే ప్రజల్లో తనకున్న ఆదరణ పెరిగిందా? తరిగిందా? తెలుసుకోవాల్సిన అవసరం జగన్మోహన్‌రెడ్డిది. బహుశా అందుకే ఈ పర్యటనకు రూపకల్పన చేసుంటారు. ఎప్పటిలాగే కేడర్ చేసిన జనసమీకరణ కంటే జగన్మోహన్‌రెడ్డి పేరులో ఉన్న వైబ్రేషన్‌కే వచ్చిన సమÖహం ఎక్కువగా కనిపించింది. అన్నిటికీ మించి విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి అంపోలు జైలు వరకు సందుగొందుల్లో పోలీసులు రోప్‌పార్టీలను పెట్టినా జనాన్ని నిలువరించలేకపోయారు. అలా కాకుండా ప్రభుత్వం నిర్బంధ చర్యలకు దిగకుండా ఫ్రీగా వదిలేసుంటే జగన్మోహన్‌రెడ్డి ర్యాలీలకు, సభలకు జనం రావడం మామÖలేనని, దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్ప్పుకునే అవకాశం దక్కేది. దీనికి 2024 ఎన్నికలకు ముందు వైకాపా నిర్వహించిన సిద్ధం సభలకు వచ్చిన జనాలను, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్లకు ముడిపెట్టి ప్రభుత్వం తీరిగ్గా తీసిపారేసే అవకాశం ఉండేది. కానీ ఇప్ప్పుడు పోలీసు ఆంక్షల మధ్య కూడా జనాలు రావడం చూస్తే జగన్మోహన్‌రెడ్డి ట్రాప్‌లో ప్రభుత్వం పడినట్టు కనిపిస్తుంది. జిల్లాలో పార్టీ సమీక్ష గాని, సీనియర్ నాయకులతో మాట్లాడటం గాని చేయని జగన్మోహన్‌రెడ్డి తాను జనాన్నే నమ్ముకున్నానని పరోక్షంగా పార్టీ నేతలకు కూడా సందేశం ఇచ్చినట్లయింది. 2024లో ఓటమి తర్వాత వైకాపా జిల్లాలో సంస్థాగతంగా బలహీనపడింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు, కేడర్ చెక్కుచెదరకపోయినా పనితీరులో మాత్రం తేడా వచ్చింది. వాటి సర్దుబాటుకో, రాబోయే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసమో తన పర్యటనలో జగన్మోహన్‌రెడ్డి ఎక్కడా నాయకులతో మాట్లాడలేదు. జనం తనవెంటే ఉన్నారని, స్థానికంగా తన పార్టీ నాయకులు దాన్ని ఓటుగా మలచుకుంటే చాలన్న సంకేతాన్ని పంపించారు. అయితే సీదిరి అప్పలరాజు ఎపిసోడ్‌లో ఇప్పటికే సమాజం రెండుగా చీలింది. యాదవ వర్సెస్ మత్స్యకార ఒక ఫ్యాక్టర్ కాగా, వైకాపా వర్సెస్ టీడీపీ మరో ఫ్యాక్టర్. ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో మాత్రం జగన్ ఫెయిలయ్యారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దానయ్య వయసుపై చేసిన వ్యాఖ్యలు, అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మకు మద్దతిచ్చే అంశంలో జగన్ లాజిక్కులు మిస్సయిపోయారు. చట్టం కోణంలో చూడాల్సిన ఇష్యూను సామాజిక కోణంలో ప్రొజెక్ట్ చేయాలని చూశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్‌రెడ్డి స్థాయికి ఈ మాటలు సరికావు. సాధారణంగా రోడ్డు ప్రమాదం కేసుల్లో కుట్రకోణాలు ఉండకూడదని, తల్లిదండ్రులను ఇరికించే రాజకీయాలు ఉండకూడదని చెప్పివుంటే సరిపోయేది. అలా కాకుండా మాట్లాడిన జగన్ కచ్చితంగా సోషల్‌మీడియా ట్రోల్స్‌కు దొరికిపోతారు. ములాఖత్‌లో అప్పలరాజును పరామర్శించకపోయినా, ఆయనకు పెద్ద ఎత్తున మైలేజీని తెచ్చిపెట్టే విధంగా జగన్ పర్యటన ముగిసింది. వాస్తవానికి అప్పలరాజును ఈ కేసులో జైలుకు పంపిన మంత్రాంగం పలాస ఎమ్మెల్యేదో, జిల్లాకు చెందిన మంత్రులదో కాదు. కేవలం ప్రమాదం జరిగిందని, అది అప్పలరాజు కొడుకు జరిపాడని తెలుసుకోవడంతోనే జిల్లాస్థాయి నాయకుల పాత్ర ముగిసిపోయింది. ఇందులో పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం, తండ్రీ కొడుకులను రిమాండ్‌కు పంపడం వంటివన్నీ అమరావతి స్థాయిలోనే జరిగాయి. అందుకే అక్కడి నుంచే జగన్మోహన్‌రెడ్డి బలప్రదర్శనకు వచ్చారు. ఎప్పటిలాగే ఆయన అనుకున్నది చేశారు. పార్టీపైన ప్రజలకు ఉన్న మోజు, ప్రభుత్వంపైన వ్యతిరేకత అంచనా వేసుకొని వెళ్లిపోయారు. రొటీన్‌గా బెయిల్ వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి అప్పలరాజే ఓ దండం పెట్టి వస్తారు. కానీ నిర్బంధం, కట్టడి వంటి చర్యల ద్వారా ప్రభుత్వం తన మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకుంది. జగన్మోహన్‌రెడ్డి ర్యాలీకి వచ్చిన జనాల్లో 80 శాతం గ్రామీణ ప్రాంతాలవారే. దీంతో రూరల్‌లో కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజల అభిప్రాయమేమిటో చెప్పకనే తెలిసిపోయింది.






Comments