top of page

సాయంలో వివక్ష ఎందుకు?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 day ago
  • 2 min read
  • జెడ్పీ సమావేశంలో అధికార పార్టీని నిలదీసిన దువ్వాడ వాణి

  • ఏకవచన సంభోదనపై కూన రవి ఆగ్రహం

  • ‘జగన్మోహన్‌రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ

  • అర్ధాంతరంగా వాయిదా పడిన జెడ్పీ సమావేశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

టెక్కలి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఒక విద్యార్థిని, ఒక మహిళా రైతు మృతి చెందితే స్పందించని ప్రభుత్వం.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మాత్రం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారని టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చకు లేవనెత్తారు. టెక్కలి పరిధిలో మృతి చెందిన ఇద్దరూ నిరుపేదలని, పలాసలో మృతుడికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిన మాదిరిగానే ఇక్కడి ఈ రెండు కుటుంబాలకు కూడా సాయం చేయాలని దువ్వాడ వాణి జిల్లా అధికారులను నిలదీశారు. దీనిపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్ స్పందిస్తూ.. పలాసలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని, పార్టీ ఇచ్చిందని తెలిపారు. దానికి దువ్వాడ వాణి స్పందిస్తూ.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదని, టెక్కలి పరిధిలో మృతి చెందిన ఇద్దరూ ఈ రాష్ట్రానికి చెందిన వారేనని, ప్రభుత్వం అందరినీ ఒకేలా ఆదుకోవాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు, మంత్రి అచ్చెన్నాయుడు ఆ రెండు మృతులపై కనీసం స్పందించలేదని, ఆయనకు బాధ్యత లేదా? అంటూ దువ్వాడ వాణి ప్రశ్నించారు. కనీసం బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున పరామర్శించలేదన్నారు. పలాస ఘటనలో ప్రభుత్వం తక్షణం స్పందించి, ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని గుర్తు చేశారు. ఎరువుల కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడి తనువు చాలించిన నందిగాంకు చెందిన పినకాన కాంతమ్మ విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అప్పుడు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లారని దువ్వాడ వాణి ప్రశ్నించడంతో, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. అచ్చెన్నాయుడు టెక్కలి శాసనసభ్యుడని, అందుకే ఆయన్ని ప్రశ్నిస్తున్నామని దువ్వాడ వాణి పేర్కొన్నారు. దువ్వాడ వాణి తనకు కేటాయించిన సీటు నుంచి ఎమ్మెల్యే కూన రవి ఉన్న చోటకు వచ్చి ప్రశ్నిస్తుండడంతో, ‘ఇక్కడి నుంచి మీకు కేటాయించిన సీటు వద్దకు వెళ్లి మాట్లాడాలి’ అని ఆయన సూచించారు.

అంతలోనే వాణి వాదనకు మద్దతుగా వైకాపా జెడ్పీటీసీలందరూ కూన రవి చుట్టూ చేరి, టెక్కలి మృతులకు ఆర్థిక సాయం అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ప్రశ్నించారు. సభలో ఉన్న ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులు కొందరు ‘జగన్మోహన్‌రెడ్డి వచ్చి పరామర్శిస్తారు’ అని మాట్లాడడంతో వైకాపా జెడ్పీటీసీ సభ్యులందరూ ఎమ్మెల్యేల చుట్టూ చేరారు. దీనిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పందిస్తూ.. వైకాపా జెడ్పీటీసీలు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోకుండా సభలో రౌడీయిజం, గుండాయిజం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ సందర్భంలో జగన్మోహన్‌రెడ్డి కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని వైకాపా సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్టు జెడ్పీ చైర్‌పర్సన్ పిరియ విజయ ప్రకటించారు. అంతకుముందు సాగునీరు, జలవనరులు, వ్యవసాయ శాఖలపై చర్చ జరిపారు. పంట కాలువల నిర్వహణ, ఎరువుల పంపిణీపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు వైకాపా జెడ్పీటీసీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సీఈఓ వెంకటరామన్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page