అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
- Prasad Satyam
- 2 hours ago
- 2 min read
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు
ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు
మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు అంత నమ్మకం. దాన్ని ఏరోజూ దాటి ఆయన పని చేయలేదు. అటువంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మిస్తున్న కాంక్రీట్ దిమ్మలు ఇప్ప్పుడు రాజకీయ సెగలకు కారణమవుతుండటం గమనార్హం.
రాజకీయంగా గుండ కుటుంబాన్ని గుర్తు చేసుకోవడం ఎమ్మెల్యే శంకర్‌కు ఇష్టంలేకే ఆయన శిలాఫలకం కోసం ఆయన అభిమానుల పేరుతో నిర్మిస్తున్న కాంక్రీట్ దిమ్మలను కూలదోశారని సోషల్‌మీడియాలో చాలామంది వాపోతున్నారు. కాసేపు అప్పలసూర్యనారాయణ వ్యక్తిత్వాన్ని, ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన సేవలను పక్కన పెడదాం. అదే విగ్రహం మన గేటు ముందో, మన కార్యాలయం ముందో పెడతామంటే ఎంతమంది అంగీకరిస్తాం. మున్సిపల్ చట్టం ప్రకారం మన సొంత స్థలంలో ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులిస్తారు. ఆ తర్వాత కూలదోయాలో, లేదో? నిర్ణయిస్తారు. అదే ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడితే నోటీసు, గీటీసు జాన్తా నై అంటూ కొట్టిపారేస్తారు. ఇప్ప్పుడు అప్పలసూర్యనారాయణ విగ్రహం కోసం కాంక్రీట్ దిమ్మలు నిర్మించడానికి అనుమతులు ఉన్నాయా? లేవా? అనేది అటు గుండ అభిమానులు గాని, మున్సిపల్ అధికారులు గాని, లేదూ ఎమ్మెల్యేతో తిరుగుతున్న నేతలు గాని ఇంతవరకు తేల్చి చెప్పలేరు. అప్పలసూర్యనారాయణ విగ్రహం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర్నుంచి మొన్నటి కమిషనర్ కూర్మారావు వరకు అందరికీ దరఖాస్తు చేశామని అప్పలసూర్యనారాయణ అభిమానులు చెబుతున్నారు. అయితే ఆమేరకు అనుమతులు వచ్చాయా? లేదా? అనేది ఇంతవరకు బహిర్గం కాలేదు. సందిట్లో సడేమియా అంటూ గుండకు, గొండుకు మధ్య అగ్గి రగులుతున్న సమయంలో పాత కమిషనర్ కూర్మారావు అందులో నెయ్యి పోశారు. స్థానిక పసగాడ నారాయణ మిల్లు జంక్షన్ వద్ద సూర్యనమస్కారాలు చేస్తున్న విగ్రహాల వద్ద అప్పలసూర్యనారాయణ అభిమానులు కాంక్రీట్ దిమ్మ నిర్మించారు. దీన్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. కారణం.. అనుమతులు ఇంకా రాలేదని చెప్పారు. మున్సిపల్ స్థలంలో అనుమతి లేకుండా కడుతున్న కాంక్రీట్ దిమ్మను తొలగించినందుకు సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారికి కూర్మారావు మెమో ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. కనీసం ఆ సమయంలోనైనా వాటికి అనుమతులు ఉన్నాయని, కూల్చడం సరికాదంటూ కమిషనర్ ఓ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అంటే అనుమతులు లేనివాటినే టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చారని అర్థమవుతుంది. అక్కడితో ఆగని కూర్మారావు వాటిని తిరిగి నిర్మిస్తామని ఇంకెక్కడో స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు గుర్తు. నిజంగా అప్పలసూర్యనారాయణ మీద అభిమానముంటే కూర్మారావు ఉన్నప్ప్పుడే విగ్రహాల ఏర్పాటు కోసం అనుమతులు ఇచ్చివుండవచ్చు. అలా చేయకుండా కూల్చినవారికి మెమోలిచ్చి ఈ సున్నితమైన అంశాన్ని ఆయన మరింత జఠిలం చేసి వెళ్లిపోయారు. ఇప్ప్పుడు తాజాగా మళ్లీ గుండ అభిమానులు కాంక్రీట్ దిమ్మలు వేస్తే మరోసారి టౌన్‌ప్లానింగ్ తొలగించింది. ఎందుకంటే.. ఇప్పటికే ఎమ్మెల్యే గొండు శంకర్ ఎక్కడైతే పాత కాంక్రీట్ దిమ్మలు తొలగించారో, దానికి ఎదురుగానే కొత్త దిమ్మలు నిర్మించి, అక్కడ అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేయడానికి అనుమతులు పొందారు. ఇప్ప్పుడు దానికి ఎదురుగా ఆయన అభిమానులు మళ్లీ దిమ్మలు నిర్మించడం వెనుక అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటు చేసుకోనివ్వడంలేదన్న సందేశం పంపడం తప్ప మరో కోణం కనిపించడంలేదు. వాస్తవానికి అప్పలసూర్యనారాయణ సంస్మరణ సభలోనే గొండు శంకర్ గుండ విగ్రహం ఏర్పాటుకు తానే ముందుకొస్తానని ప్రకటించారు. నిజంగా దీన్ని రాజకీయానికి వాడకుండా అప్పలసూర్యనారాయణ విగ్రహమే నగరంలో నిలువెత్తుది ఉండాలనుకున్నప్ప్పుడు అప్పలసూర్యనారాయణ అభిమానులు ముందుగా నిలదీయాల్సింది ఎమ్మెల్యే గొండు శంకర్‌ను. సంస్మరణ సభలో ఆయన మాటిచ్చారని, ఇంతవరకు విగ్రహ ఏర్పాటు కోసం ఎందుకు ఉలుకూ పలుకూ లేదని నిలదీయాలి. ఆ విగ్రహం ఎక్కడ పెడతారో తేల్చాలని ప్రశ్నించాలి. అలా కాకుండా సిమెంట్ దిమ్మలు కట్టేశాం కాబట్టి కూల్చడానికి వీళ్లేదంటే.. భవిష్యత్తులో ప్రతీ నాయకుడికీ ఇలాంటి ఏర్పాట్ల కోసం అభిమాన సంఘాలు ముందుకొస్తాయి. మొన్నటికి మొన్న సూర్యమహల్‌కు ఆనుకొని మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం కడితేనే అనేక నిరసన స్వరాలు వినిపించాయి. అప్పలసూర్యనారాయణ అన్నట్టు శిలాఫలకాల కంటే ప్రజల మనఃఫలకాలలో నిలవడమే శాశ్వతం. టిక్కెట్ కోసం జరిగిన పోరాటంలో గుండ, గొండు రెండు వర్గాలైన మాట వాస్తవం. కానీ అప్పలసూర్యనారాయణ విగ్రహం ఏర్పాటుకు వర్గాలు, పార్టీలు అతీతమని వేరేగా చెప్పనక్కర్లేదు.
గుండ విగ్రహం ఏర్పాటుకు నెలల క్రితమే దరఖాస్తు చేస్తే, ఇంతవరకు ఎందుకు అనుమతులు ఇవ్వలేదని ప్రశ్నించాల్సింది. అలాగే ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉంది కాబట్టే అనుమతులు రాలేదని ధైర్యంగా ప్రకటించివుంటే ఇంకా బాగుండేది. అలా కాకుండా అనుమతులకు దరఖాస్తు చేశాం కాబట్టి నిర్మాణాలు చేపట్టేస్తాం, అది కూడా పబ్లిక్ ప్లేస్‌లో అంటే మాత్రం అధికారులే నలిగిపోతారు. పర్మిషన్ ఇవ్వాల్సిన కూర్మారావు అది ఇవ్వలేదు సరికదా.. కూల్చిన టౌన్‌ప్లానింగ్ అధికారికి మెమోలు ఇచ్చారు. గుండ అభిమానులు తాము నిర్మించినది సక్రమం కాబట్టే కమిషనర్ మద్దతిచ్చారని భావించడంలో తప్ప్పు లేదు.






Comments