top of page

నమ్మకానికి నిలువుటద్దం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 3 hours ago
  • 3 min read
  • నరసన్నపేట టు నయా లీడర్‌షిప్

  • కృష్ణదాస్ బలాలు, భవిష్యత్ పరీక్షలు

  • జగన్‌కు నమ్మకస్తుడిగా, జిల్లా సారధిగా నేడు మరో పుట్టినరోజు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా వైకాపా సారధిగా ధర్మాన కృష్ణదాస్ విజయవంతమయ్యారా? విఫలమయ్యారా? అన్న చర్చకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ తావివ్వలేదు. ఎందుకంటే.. నమ్మకానికి నిలువుటద్దం ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ప్రసాదరావు కాంగ్రెస్‌లో కీలక స్థానంలో ఉన్న రోజుల్లోనే జగన్ వెంట నడిచిన కృష్ణదాస్ కంటే నమ్మకస్తుడు మరొకరు ఆయనకు కనిపించలేదు, కనిపించరు కూడా. నరసన్నపేట నుంచి మొదలైన దాస్ రాజకీయం ఉపముఖ్యమంత్రి స్థానం వరకు ఎదిగి, జిల్లాకు ఓ కొత్త అýంకారాన్ని తీసుకువచ్చింది. ఉపముఖ్యమంత్రిగా, రెవెన్యూమంత్రిగా రెండున్నరేళ్లు పని చేసిన కృష్ణదాస్ బలాలు, బలహీనతలు పార్టీకి తెలుసు. అయితే అధికారంలో లేనందున జిల్లా పార్టీ నాయకత్వం స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా పార్టీ నుంచి ప్రధాన కేడర్ జారిపోకుండా ఉన్నారంటే అది కృష్ణదాస్ నాయకత్వం మీద ఉన్న నమ్మకమే. అందువల్ల దాస్ కంటే సమర్ధుడు జిల్లాలో ఉన్నారన్నా జగన్మోహన్‌రెడ్డి నమ్మరు. దీనికి తోడు ప్రసాదరావు కూడా అన్నకు అండ దండగా నడుస్తున్నందున జిల్లా పార్టీ ఎలా ఉందన్న విషయం పక్కన పెట్టి భవిష్యత్ పరీక్షలను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నదానిపైనే ఇప్ప్పుడు అందరి ఆసక్తి.

నరసన్నపేట నియోజకవర్గంలో ఆయన వ్యక్తిగత రాజకీయ బలం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పార్టీని నడిపిస్తున్న తీరు రాజకీయంగా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ తన నియోజకవర్గంలో పలు సంక్షేమ, మౌలిక సదుపాయాల పనులకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాలు, విద్య-ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి పెట్టారు.

జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పునర్నిర్మాణం

2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలోకి వెళ్లిన నేపథ్యంలో జిల్లాలో పార్టీని చురుకుగా ఉంచే బాధ్యత ధర్మాన కృష్ణదాస్‌పై పడింది. జిల్లా అధ్యక్షుడిగా ఆయన మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించడం, రైతు, కార్మిక, సామాజిక విభాగాల సమావేశాలను సమన్వయం చేయడం, పార్టీ క్యాడర్‌ను చైతన్యపరచడం, ప్రభుత్వ విధానాలపై నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను నియంత్రించేందుకు కూడా ఆయన పలుమార్లు బహిరంగ హెచ్చరికలు చేశారు. క్రమశిక్షణ పాటించని నేతలపై చర్యలు తీసుకుంటామని గతంలోనే స్పష్టం చేశారు.

జగన్‌తో సాన్నిహిత్యం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన కృష్ణదాస్, జగన్‌కు అత్యంత నమ్మకస్థులలో ఒకరిగా గుర్తింపు పొందారు. పార్టీ ప్రారంభ దశ నుంచే ఆయన జగన్‌కు అండగా నిలిచారు. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించడం, అనంతరం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా ఆ విశ్వాసానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. జగన్ ప్రభుత్వాన్ని సమర్థించే అంశాల్లో ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ పార్టీ ఆధికారిక వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కూడా రాష్ట్ర అభివృద్ధి నమూనాపై పార్టీ అభిప్రాయాన్ని బహిరంగంగా వివరించారు.

వారసత్వ రాజకీయాలు - డాక్టర్ కృష్ణ చైతన్యకు అవకాశాలు

ధర్మాన కుటుంబంలో తదుపరి తరం రాజకీయాల్లోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పోలాకి జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ కృష్ణ చైతన్యను 2029 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. అందుకు అనుగుణంగా స్థానిక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీ సమావేశాల్లో చురుకైన పాత్ర, యువతతో ప్రత్యక్ష అనుసంధానం, సామాజిక సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలపై స్పందించడం వంటి చర్యల ద్వారా భవిష్యత్ నాయకుడిగా ఆయనను పరిచయం చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతోందనే అభిప్రాయం స్థానికంగా బలంగా వినిపిస్తుంది. అయితే భవిష్యత్తులో ఆయనకు ఏ స్థాయి బాధ్యతలు వస్తాయో పార్టీ అధిష్ఠానం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

ధర్మాన సోదరుల సమన్వయం

ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ మధ్య విభేదాలున్నాయనే ప్రచారం గతంలో వచ్చినప్పటికీ ఇద్దరూ పలుమార్లు వాటిని ఖండించారు. ఒకరిపై ఒకరు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రైతు సమావేశాలు, పార్టీ శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వంపై విమర్శలు, జిల్లా స్థాయిలో ఉద్యమాలు వంటి కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొంటున్నారు. ధర్మాన కృష్ణదాస్ ముందు కొన్ని ప్రధాన సవాళ్లు ఉన్నాయి. 2024 ఎన్నికల ఓటమి తర్వాత క్యాడర్‌లో ఉత్సాహాన్ని నిలబెట్టడం. ఇందుకు కేవలం పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేపడితే సరిపోదని కృష్ణదాస్‌కు తెలుసు. ఆజాతశత్రువు కాబట్టి దాసన్న ఒక మాట చెబితే, అందులో స్వార్ధం ఉండదనే నమ్మకం కేడర్‌ది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు దాసన్నను వ్యతిరేకించే పార్టీ కార్యకర్త లేదు. అది ఆయన బలం. అన్నిటికీ మించిన సౌలభ్యం కృష్ణదాస్‌కు మాత్రమే ఉంది. కార్యకర్తకు నష్టం జరిగితే ప్రసాదరావు వల్ల, మేలు జరిగితే కృష్ణదాస్ వల్ల అనే ప్రచారం జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. అయితే అన్నదమ్ములిద్దరూ ఒకటే కాబట్టి కేడర్‌ను ఒడిసిపట్టుకోగలిగారు. ధర్మాన కృష్ణచైతన్య ఎలా అయితే నరసన్నపేట తెర మీదకు ప్రత్యక్షంగా రానున్నారో, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా జెన్ జీ యువత ఓట్ల కోసం యువనా యకులను ప్రోత్సహించాలి.

ధర్మాన కృష్ణదాస్ రాజకీయ ప్రస్థానంలో మూడు ప్రధాన బలాలు కనిపిస్తాయి. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విశ్వాసం, శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ధర్మాన కుటుంబానికి ఉన్న బలమైన స్థానిక రాజకీయ నెట్‌వర్క్. అదే సమయంలో, అభివృద్ధి ఫలితాలపై ప్రజల అంచనాలు, ప్రతిపక్షంలో పార్టీని చురుకుగా ఉంచాల్సిన అవసరం, కొత్త తరానికి నాయకత్వ మార్పు వంటి అంశాలు ఆయన ముందున్న ప్రధాన పరీక్షలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలు ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడిగా, రాజకీయ వ్యూహకర్తగా ఎంతవరకు సఫలమవుతారో నిర్ణయించే కీలక దశగా మారే అవకాశం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page