top of page

ఇప్పుడు జారిపోవడానికి అసలు చీరలే లేవు

  • Guest Writer
  • Sep 27, 2025
  • 3 min read

(ఏఐ గారిని అడిగితే ఈ పిక్‌ ఇచ్చింది లెండి.. సరిపోయినట్టే ఉంది)

‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి.. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.. నువ్వు కొంటె చూపు చూస్తుంటేనే చలి.. చలి’.. కొండగాలికి చీర ఎగిరిపోతే ఎన్టీఆర్‌ కొంటె చూపులు భరించలేక అప్పట్లో జయప్రద పాడుకున్న పాట

‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మతియ్య.. దాని జిమ్మతియ్య.. అందమంతా చీరలోనే ఉన్నది’ .. వాణిశ్రీ చీరకట్టు చూసి నాగేస్సర్రావ్‌ మైండ్‌ బ్లాక్‌ అయి పాడుకుంటాడు

‘చందనా చీర కట్టి.. బొమ్మనా బ్లౌజు చుట్టి.. కొత్త పెళ్లి కూతురోచ్చే నేడే’.. గౌనేసుకున్న రంభను చూసి ముచ్చట పడి జేడి చక్రవర్తి పాడుకుంటాడు.

‘కట్టుజారి పోతా ఉందీ.. చీర కట్టు జారిపోతా ఉందీ..’ చిరంజీవిని చూడగానే విజయశాంతి చీర కట్టు జారిపోతుంది.

బహుశా తెలుగు సినిమాల్లో చీరకట్టు జారిపోవడం అదే మొదలు.. అదే ఆఖరు అనుకుంటా.. ఆ తర్వాత చీరల్లేవ్‌.. జారిపోవడాలూ లేవు.. ఇప్పుడీ చీరల గోలేంటి అంటారా?.. ఇప్పుడొచ్చే పిల్ల హీరోయిన్లు, పిల్లలున్న తల్లి హీరోయిన్లు వేసుకుంటున్న పొట్టి బట్టల మీద ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పొడవైన చర్చ జరుగుతుంది కదా.. మనం కూడా చిన్న డిస్కషన్‌ చేసుకుందాం!

ఎవరి సంగతో ఎందుకు? నావరకే వస్తే చిన్నప్పుడు సావిత్రి, జయసుధ, జయప్రద, జయచిత్ర, శ్రీదేవి, విజయశాంతి , భానుమతి ఇత్యాది నటీమణుల చీరలతోనే సినిమాలు నడిచిపోయాయి. దర్శక నిర్మాతలు హీరోయిన్ల క్యాస్టమ్స్‌ పొదుపులు ఇంకా పాటించని రాయల్‌ రోజులు అవి .. కాబట్టి ప్రాణాలకు హాయిగా ఉండేది. చాలా వరకు సినిమాలు నేను ఫ్యామిలీతో చూసినవే..

ఎన్టీఆర్‌ శ్రీదేవిని ముద్దు పెట్టుకునే సమయంలో రెండు పూల గుత్తులు అడ్డుపెట్టి మమ అనిపించేవాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు.

అయితే చక్కగా సాగిపోతున్న నావలో ప్రేక్షకులను విద్యుత్‌ ప్రవాహ కుదుపుల్లో పడేయడానికి’ బావలు సయ్యా. మరదలు సయ్యా ‘ అని సిల్క్‌ స్మిత ఎంటరయి ఎగరడమో.. ‘ గు గ్గు గుడిసుంది.. మ మ్మ మంచముంది ‘ అంటూ జయమాలిని.. జ్యోతి లక్ష్మీ ఇత్యాదులు ఏసీ థియేటర్లో టెంపరేచర్‌ పెంచటానికో ట్రై చేసేవారు. అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం. పక్క సీట్లలో చూస్తే ఫ్యామిలీ తెర మీద చూస్తే నిండుగా.. అంచేత మెల్లకన్ను పెట్టి ఎలాగోలా ఆ కాసేపు మ్యానేజ్‌ చేసుకునేవాళ్లం.

ఆ శకం వరకు సినిమాల్లో హీరోలతో, హీరోయిన్లతో ఎటువంటి ఇబ్బందులు లేవు. మధ్యలో వచ్చిన ఆస్థాన నర్తకినిలతో కొద్దిగా ఇబ్బంది అనిపించినా పోనీలే అని సర్దుకుపోతుంటే డిస్కో శాంతి రంగప్రవేశం చేసింది. జ్యోతిలక్ష్మి, జయమాలిని లు క్యాస్టమ్స్‌ విషయంలో అర్థ రూపాయి అనుకుంటే డిస్కో శాంతి పావలా అయిపోయింది. ఆ వెనకే అప్పటికింకా నా వయసు పదారేళ్లే అంటూ ముమైత్‌ ఖాన్‌ తయారయ్యింది. తినగా తినగ గారెలు చేదు అవుతాయని

మెల్లిగా ఆస్థాన నర్తకిని లకు కూడా గిరాకీలు తగ్గిపోయాయి.

ఇప్పుడు ఆ బాధ్యతను పిల్ల హీరోయిన్లు, పిల్ల తల్లి హీరోయిన్లు భుజాన వేసుకుని కళామతల్లి సంస్కృతి మరుగుపడిపోకుండా రెండు అర పీసు వస్త్రాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. చూసారా? చూస్తుండగానే మన కళ్ళ ముందు చీరలు మాయమైపోయాయి. మనకు తెలీకుండానే మనం పాశ్చాత్య సంస్కృలోకి వెళ్ళిపోతున్నాం. మధ్యలో రెండు పూల గుత్తులు అడ్డు పెట్టి ఎన్టీఆర్‌ శ్రీదేవిని ముద్దు పెట్టుకుంటేనే ఏదో రాద్దాంతం జరిగిపోయిందని ఆవేశపడిపోయాం. ఇప్పుడు హీరో హీరోయిన్లు పూల గుత్తుల అడ్డంతో పనిలేకుండా ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు నోళ్ళు పెట్టుకుంటుంటే నోరెళ్ళబెట్టి చూస్తున్నాం.

చీర కట్టు జారిపోతుందీ అని విజయశాంతి అంటుంటే అయ్యో ఎలాగా? అనుకున్నాం. ఇప్పుడు అనుకోవడానికేముంది?

చిన్నప్పుడు ఇంగ్లీష్‌ సినిమాల్లో బిట్లు వేస్తారని తెలిసి కొంతమంది ‘కరెంట్‌’ కోసం విజయవాడ నుంచి మంగళగిరి పోయి మరీ ఒక థియేటర్లో చూసేవాళ్ళు. ఇప్పుడంత శ్రమ అవసరం లేకుండా ఇంటర్నెట్‌ పుణ్యమా అని ఇళ్లలోనే సదుపాయాలు వచ్చేశాయి. విత్తు ముందా? చెట్టు ముందా? మాదిరి నాకు ఒక డౌటు. చూసేవాళ్లని బట్టి పిల్లకాయలు అలా ఎక్స్పోజింగ్‌ చేస్తున్నారా?.. లేకపోతే వాళ్ళు ఎక్స్పోజింగ్‌ చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారా?.. ఏది కరెక్ట్‌?

గొప్పనటి భానుమతి సినిమాల్లోకి వెళ్తానంటే నీ ఒంటి మీద ఇతరుల చేయి పడదు అనుకుంటేనే సినిమాల్లోకి వెళ్ళు అని తండ్రి చెబితే అదే మాట మీద నిలబడి ఐదు దశాబ్దాల పాటు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి హీరో అనిపించుకుంది ఆమె. ఎక్కడిదాకో ఎందుకు.. ఈమధ్య రజనీకాంత్‌ కూలీ సినిమాలో ప్రతి నాయకి పాత్ర పోషించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్న రచితా రామ్‌ సంగతి తెలుసు కదా.. ఆ అమ్మాయికి కన్నడనాడులో బ్రహ్మాండమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అలాంటి అమ్మాయిని తల్లితండ్రులు చీ నువ్వసలు మా కూతురివే కాదు.. నీ ముఖం మాకు చూపించకు ‘ అని అసహ్యించుకున్నారు. ఎందుకో తెలుసా?.. గతంలో తెలిసో తెలియకో ఒకే ఒక సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్రతో బోల్డ్‌ సీన్స్‌ లో నటించింది. బట్టల్లేకుండా ఏ కన్నతల్లితండ్రులు మాత్రం తమ కూతుర్ని వెండి తెర మీద చూడటానికి ఇష్టపడతారు?. దాంతో ఆ అమ్మాయి రియలైజ్‌ అయి ఇకపై స్కిన్‌ తో కాకుండా టాలెంట్‌ తోనే సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకుంటా అని ప్రతిజ్ఞ చేసింది. అప్పట్నుంచి ఆ అమ్మాయి వెనుతిరిగి చూసుకునే సందర్భమే రాలేదు. అలాగే ఎటువంటి చర్మ సౌందర్య ప్రదర్శనలు లేకుండానే సావిత్రి ,సౌందర్య లు చక్కటి నటీ మణులు గా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌందర్య అయితే పాత తరం నటి కూడా కాదు. ఎక్స్పోజింగ్‌ మొదలైన రోజుల్లోనే మిగిలిన హీరోయిన్లను డ్యామినేట్‌ చేసి కేవలం తన టాలెంట్‌ తో మాత్రమే సినిమాల్లో చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మరి హఠాత్తుగా ఈ వస్త్ర పొదుపులు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఎందుకొచ్చాయి?. గమనిస్తున్నారా?..

సినీ హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకుంటే తప్పేంటి? వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు అని అభ్యుదయ వాదం చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు అటువంటి బట్టలు వేసుకుంటే ఒప్పుకుంటారా?.. మహాకవి శ్రీ శ్రీ గారన్నట్టు ప్రైవేట్లో మీ లైఫ్‌ మీ ఇష్టం.. పబ్లిక్‌ లోకి వస్తే ఎన్నైనా అంటాం.. ఇవాళ ఫ్యామిలీతో కలిసి మనం సినిమాలు చూసే పరిస్థితులు ఉన్నాయా?.. పోనీ ఇళ్లలో ఓటిటీ లు చూసే పరిస్థితులు ఉన్నాయా?.. ఈ పరిస్థితులు మారాలి! .. అలా అని ఇలా ప్రశ్నలు వేస్తే, మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి బ్రో అంటారు కొంతమంది పావన నవ జీవన బృందావన నిర్మాతలు.. చేసేదేముంది? కానివ్వండి..


- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page