top of page

ఊపందుకోని వరిసాగు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 2 days ago
  • 3 min read
  • ఆకాశంవైపు ఆశగా రైతన్నల ఎదురుచూపు

  • జిల్లాలో 39.7 శాతం లోటు వర్షపాతం

  • సరిపడ విత్తనాలు, ఎరువులు ఉన్నాయంటున్న అధికారులు

  • నిండుకున్న చెరువులు-ఎండిపోతున్న నారుమడులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలోని అధిక శాతం రైతులు ఖరీఫ్ సీజన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తారు. ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ పనులు ఊపందుకుంటాయి. కానీ 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు వరినారును కాపాడుకోవడానికి తాపత్రయపడుతుండగా, మరికొందరు విత్తనాలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. వర్షాభావం కారణంగా సాగు పనులు మందగించడం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో వంద శాతం వరి విత్తనాలు చల్లే ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా 70 శాతానికి మించలేదని చెబుతున్నారు.

జిల్లాలో లోటు వర్షపాతం

జూన్ 1 నుంచి జూలై 12 వరకు జిల్లాలో సాధారణంగా 196.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే -39.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా లోటు వర్షపాతం విభాగంలోకి చేరింది. వర్షాలు ఆలస్యం కావడంతో చెరువులు, కాలువలు, చిన్న నీటి వనరులు పూర్తిస్థాయిలో నిండలేదు. భూగర్భ జలమట్టాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లాలో 4.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టే లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ నిర్ధారిస్తుంది. అందుకు అనుగుణంగా పొలాలు దుక్కి చేసి, నారుమళ్ల పెంపకాన్ని జూన్ 15 నాటి నుంచే ప్రారంభిస్తారు. అయితే ఈసారి వర్షాల రాక ఆలస్యం కావడంతో నారుమళ్ల పెంపకం, పొలాల సిద్ధం, వరి నాట్ల ప్రక్రియ ఆలస్యమైంది. పంట కాలువల కింద మాత్రమే కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లు సిద్ధం చేసి విత్తనాలు చల్లారు. సకాలంలో వర్షాలు కురవక కొన్ని చోట్ల ఆయిల్ ఇంజన్లు, ట్యాంకర్లతో నారుమళ్లను తడుపుతున్నారు. కొన్ని చోట్ల వర్షం కోసం ఎదురు చూస్తూ నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కొంతమేర వరి సాగు కొనసాగుతున్నప్పటికీ, వర్షాధార ప్రాంతాల్లో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు ఆలస్యం అయితే వరి దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

దిగుబడిపై ప్రభావం

నీటి కొరత, కూలీల లభ్యత సమస్యల దృష్ట్యా జిల్లాలో అనేక చోట్ల సంప్రదాయ నాట్ల విధానానికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిని (ఎద) గత కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. ఈ విధానంలో నారుమళ్ల అవసరం ఉండదు. నీటి వినియోగం తగ్గడంతో పాటు కూలీ ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే కలుపు నివారణ, పంట నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ విధానంలో పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వరితో పాటు సుమారు లక్ష ఎకరాల్లో రాగులు, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, పత్తి, కందులు వంటి పంటలు కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందించింది. వీటిపై వర్షాభావం తీవ్ర ప్రభావం చూపించింది. సకాలంలో వర్షాలు కురిస్తే అపరాలు, నూనెగింజల సాగు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని, లేదంటే వీటి సాగు గణనీయంగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో 41,120 క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలు, 14 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచింది. అవసరమైన మేరకు రైతులకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గత ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 28 బస్తాల వరి దిగుబడి నమోదుకాగా, ఈసారి మెరుగైన సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంతో 32 బస్తాల దిగుబడి సాధించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా, వర్షాల రాక ఆలస్యం కావడంతో వరి దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు.

విస్తారంగా వర్షాలు కురిస్తే..

ప్రస్తుతం రైతుల ఆశలన్నీ వర్షాలపైనే నిలిచాయి. ఈ నెల 15 నుంచి విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు గాడిన పడే అవకాశముంది. లేకపోతే సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు దిగుబడులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే నష్టాలను కొంతవరకు తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల ఎంపిక, సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో వరి నారుమళ్లు, ఎదలు వేయడం ఆలస్యమైంది. పంట కాలువల కింద వరి నారుమళ్లుసిద్ధం చేసి నాట్లు వేయడానికి సిద్ధమైన వారు మాత్రమే ఎరువుల కోసం తాపత్రయ పడుతున్నారు. కౌలు రైతులు భూమి దున్నాలంటే ‘ఎరువులు సరఫరా చేస్తేనే భూమిని కౌలుకు తీసుకుంటాం’ అని మొండికేయడంతో భూయజమానులు ఎరువులను నిల్వ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో భూమిని కౌలుకు తీసుకున్న రైతే ఎరువులను సమకూర్చుకొని పండించిన పంటలో భాగాన్ని యజమానికి ఇచ్చేవాడు. ఎరువుల లభ్యత తగ్గడం, సవాలక్ష ఆంక్షల నేపథ్యంలో ఎరువులు ఇస్తేనే కౌలుకు భూములు తీసుకుంటామని నిర్ణయించడంతో పరిస్థితి మారిపోయింది.

ఆధార్ ఆధారంగా ఎరువుల పంపిణీ

జిల్లాలో ఖరీఫ్‌లో వివిధ రకాల పంటల సాగు కోసం అవసరమైన 37,707 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటికే 18,215 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరాయని రెండు రోజుల క్రితం కలెక్టర్ ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం 14,269 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 277 ప్రైవేట్ డీలర్లు ఉండగా, ప్రస్తుతం 191 విక్రయ కేంద్రాల్లో యూరియా స్టాక్ అందుబాటులో ఉంది. ఆధార్ ఆధారంగా ఎరువుల పంపిణీ చేస్తున్నారు. ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నెంబరుకు వచ్చే ఓటీపీతో ఎకరా కంటే తక్కువ ఉన్నా ఒక యూరియా బస్తాను పంపిణీ చేస్తున్నారు. ఎకరా కంటే ఎక్కువ ఉంటే పరిమితి మేరకు యూరియాను అందిస్తున్నారు. అయితే దీని కోసం రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page