top of page

ఎందుకు మొదలైంది.. ఎందుకు ఆగింది?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 12 hours ago
  • 2 min read

భారత్‌-పాక్‌ మధ్య జరుగుతున్న యుద్ధం విశేషాలు తెలుసుకునేందుకు గత కొన్ని రోజులుగా దేశప్రజలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అదే క్రమంలో శనివారం సాయంత్రం టీవీలు వీక్షిస్తున్న వారికి హఠాత్తుగా స్క్రీన్‌పై బ్రేకింగ్‌ న్యూస్‌ రూపంలో ప్రత్యక్షమైన వార్త ఒక విధంగా షాక్‌కు గురిచేసింది. నమ్మశక్యంగా లేక ఛానల్స్‌ మార్చి మార్చి చూడటం ప్రారంభించారు. ఏ ఛానల్‌ ట్యూన్‌ చేసినా ఒకటే వార్త.. అదే భారత్‌`పాక్‌ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా ప్రకటించారన్నదే ఆ బ్రేకింగ్‌ న్యూస్‌ సారాంశం. ఆ తర్వాత ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ ప్రకటించడంతో దాదాపు భారతీయులందరూ హతాశులయ్యారు. యుద్ధంలో భారత్‌ స్పష్టమైన ఆధిపత్యం కొనసాగిస్తున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటన్న ప్రశ్నలు, విమర్శలు, రకరకాల ఆరోపణల జడి మొదలైంది. అప్పటివరకు మోదీ వ్యూహాల గురించి, భారత యుద్ధపాటవాలు, విజయాల గురించి సోషల్‌ మీడియాలోనూ, జాతీయ ఛానళ్లలోనూ హోరెత్తిస్తున్న కాషాయ శ్రేణులు, వారి వాట్సప్‌ యూనివర్సిటీలకు ఒక్కసారిగా తాళం పడిరది. ఈ పరిణామాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డాయి. పాకిస్తాన్‌ కాళ్ల బేరానికి రావడం వల్లే మోదీ కాల్పుల విరుమణకు అంగీకరించారని కొందరు కాషాయ భక్తులు సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. కానీ యుద్ధం ఎందుకు మొదలుపెట్టారు? మధ్య ఎందుకు ఆపేశారు? మధ్యలో ఏం సాధించారు? అంటూ నలువైపుల నుంచి వస్తున్న ప్రశ్నల శరాల హోరులో ఆ సమర్థింపులు కూడా వీగిపోయాయి. నిజమే కదా.. రెండు దాయాది దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎందుకు తలెత్తింది? అని ప్రశ్నించుకుంటే ఏప్రిల్‌ 22న పహల్గాంలో అమాయక టూరిస్టులపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు మతం పేరుతో సాగించిన మారణకాండ ప్రస్తుత ఘర్షణాత్మక పరిస్థితికి బీజం వేసింది. దానిపై రోజుల తరబడి తర్జనభర్జనలు పడి చర్చోపచర్చలు సాగించి భారత ప్రభుత్వ పెద్దలు, వ్యూహకర్తలు చివరికి ఈ నెల ఏడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసింది. కేవలం ఉగ్ర తండాలపైనే భారత్‌ దాడి చేస్తే.. దానికి ప్రతిగా పాకిస్తాన్‌ మాత్రం తమ సరిహద్దుల్లోని భారతీయ పౌర ఆవాసాలు, సైనిక శిబిరాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిరది. ఫలితంగా ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం మొదలైంది. పాక్‌ క్షిపణులను, రాకెట్లను, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను నాశనం చేసి ఆ దేశ వైమానికి స్థావరాలను సైతం భారత వాయుసేన తుత్తనీయలు చేసింది. మూడురోజులపాటు వరుసపెట్టి జరిగిన దాడుల్లో పాక్‌పై భారత్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. యుద్ధం అదేరీతిలో కొనసాగితే కొద్దిరోజుల్లోనే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ కైవసం చేసుకునే అవకాశాలు కనిపించాయి. అ తరుణంలో హఠాత్తుగా శనివారం సాయంత్రం ఇరుదేశాల మధ్య కాల్పుల విరుమణకు అంగీకారం కుదిరిందని ప్రకటించడం విస్మయం కలిగించింది. పాకిస్తాన్‌కు ఎటువంటి షరతులు పెట్టకుండానే, ఒప్పందాలు చేసుకోకుండానే కాల్పులు విరమించడం విమర్శలు రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే ప్రస్తుత యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పటికీ పహల్గాం దాడి నిందితులు పరారీలోనే ఉన్నారు. వారిని పట్టుకుని భారత్‌కు అప్పగిస్తామని పాక్‌ కనీసం హామీ అయినా ఇవ్వలేదు. పీవోకే భారత్‌దేనని మన పాలకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. మరి దాన్ని భారత్‌కు అప్పగించేందుకు కూడా పాక్‌ పాలకులు ఇప్పటికీ ముందుకు రావడంలేదు. కనీసం భారత్‌ దాడులకు వెరచి పాక్‌ తోకముడిచి శరణు వేడిన దాఖలాలు కూడా లేవు. దీనిపై భారత్‌ మాదిరిగా విస్పష్ట ప్రకటన చేయకపోగా పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాకు కృతజ్ఞతలు తెలిపితే.. ఆ దేశ అత్యున్నత మిలటరీ జనరల్‌ కాల్పుల విరమణను తాము కోరలేదని, భారతే శరణు వేడిరదన్నట్లు వాకృచ్చాడు. మొత్తం వ్యవహారం చూస్తుంటే పాకిస్తాన్‌కు అనుకూలంగా అమెరికా చక్రం తిప్పినట్లు.. దాని ఒత్తిడికి భారత పాలకులు లొంగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ విమర్శలను ఎదుర్కొనే క్రమంలోనే ఆపరేషన్‌ సింధూర్‌ ముగిసిపోలేదని ఆదివారంనాటి అత్యున్నత సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page