top of page

అర్ధశతాబ్ది తర్వాత మళ్లీ కరాచీ ముట్టడి

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 21 hours ago
  • 2 min read

భారత్‌-పాక్‌ మధ్య అప్రకటిత యుద్ధం ప్రారంభమై తీవ్రస్థాయిలో జరుగుతోంది. పహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి 22 మందిని పొట్టనపెట్టుకున్న దారుణం యావద్భారతావనిని ఆగ్రహానికి గురి చేసింది. దానికి ప్రతిగా సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడమే లక్ష్యంగా భారత్‌ మెరుపుదాడులు చేయడం ఉగ్రవాదానికి వెన్నుకాస్తున్న పాకిస్తాన్‌కు కంటగింపుగా మారి కవ్వింపు చర్యలను తీవ్రతరం చేయడం ద్వారా తన గొయ్యిని తానే తవ్వుకుంది. సరిహద్దులోని భారత ప్రాంతాలపై మోర్టార్లు, డ్రోన్లతో పాక్‌ సైన్యం దాడులకు పాల్పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత సాయుధ బలగాలు కూడా ప్రతిదాడులు ప్రారంభించాయి. మరోవైపు పాక్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాయుధ ఉద్యమం చేస్తున్న బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పాక్‌ సైన్యాన్ని తరిమికొడుతూ క్వెట్టా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దాంతో పాకిస్తాన్‌ పరిస్థితి మద్దెల దరువులా తయారైంది. ముఖ్యంగా భారత సైన్యం పాక్‌ జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయలాంటి కరాచీ రేవుపై అతిపెద్ద దాడికి పాల్పడటంతో సరిగ్గా 54 ఏళ్ల క్రితంనాటి చేదు అనుభవాన్ని పాక్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో జరిగిన భారత్‌`పాక్‌ యుద్ధంలో కూడా భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఉన్న కరాచీ పోర్టును రెండుసార్లు దిగ్బంధించి తీవ్ర నష్టం కలగజేసింది. దాని ఫలితంగానే నాడు పాకిస్తాన్‌ యుద్ధం నుంచి తోక ముడవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి అనుభవమే పాక్‌కు ఎదురవుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖను అతిక్రమించి పాక్‌ భూభూగం నుంచే జమ్మూ, పఠాన్‌కోట్‌, అక్నౌర్‌, తదితర ప్రాంతాలపై పాక్‌ సైన్యం పాల్పడుతున్న దాడులకు ప్రతిగా భారతీయ నౌక, వాయుసేన దళాలు పాక్‌ నగరాలపై భీకర దాడులు చేశాయి. పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు చెందిన సాయుధ పటాలం కరాచీ ఓడరేవుపై క్షిపణులు, డ్రోన్లు, టార్పెడోలతో విరుచుకుపడటంతో కరాచీ రేవు మంటల్లో చిక్కుకుంది. పోర్టులో ఉన్న అనేక నౌకలు ధ్వంసమయ్యాయి. పోర్టులో పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. గురువారం రాత్రి పొద్దుపోయాక పాకిస్తాన్‌లోని లాహోర్‌పై భారత దళాలు దాడి ప్రారంభించాయి. తర్వాత కొద్దిసేపటికే కరాచీ ఓడరేవు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. 54 ఏళ్ల క్రితం 1971లో కరాచీపై భారత్‌ నేవీ జరిపిన దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాక్‌ నావికాదళ ప్రధాన కేంద్రం, వాణిజ్యకేంద్రమైన కరాచీపై భారత నావికాదళం తొలుత 1971 డిసెంబర్‌ నాలుగో తేదీన ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో దాడి చేసింది. ఇండియన్‌ నేవీకి చెందిన రెండు జలాంతర్గామి వ్యతిరేక కార్వెట్లల రక్షణతో ఐఎన్‌ఎస్‌ నిపట్‌, ఐఎన్‌ఎస్‌ నిర్ఘాత్‌ అనే క్షిపణి వాహక నౌకలు, ఐఎన్‌ఎస్‌ వీర్‌ యుద్ధనౌకలు రాత్రి వేళ కరాచీపైకి దండెత్తాయి. ఈ దాడిలో రెండు పాకిస్తానీ డిస్ట్రాయర్లు (పీఎన్‌ఎస్‌ ఖైబర్‌, పీఎన్‌ఎస్‌ ముహఫీజ్‌) సముద్రంలో మునిగిపోయాయి. కరాచీ చమురు నిల్వ కేంద్రం మంటల్లో చిక్కుకుని తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే అంటే 1971 డిసెంబర్‌ ఎనిమిదో తేదీన భారత నావికాదళం కరాచీపై రెండోసారి దాడి చేసింది. ఆపరేషన్‌ పైథాన్‌ పేరుతో జరిపిన ఈ దాడిలో ఐఎన్‌ఎస్‌ వినాశ్‌తోపాటు రెండు యుద్ధనౌకలు పాల్గొన్నాయి. కరాచీ రేవులో ఉన్న వ్యాపార నౌకలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన మూడు నౌకలు మునిగిపోయాయి. ఈ దాడి పాకిస్తాన్‌ ఇంధన సరఫరా వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. చాలాకాలంపాటు కరాచీ ఓడరేవు మూతపడిరది. అప్పటినుంచీ పాకిస్తాన్‌ చీటికీమాటికీ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, తన భూభాగంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వారిని భారత్‌లోకి పంపుతూ హింసా విధ్వంసాలను ప్రోత్సహిస్తోంది. అయితే భారత్‌ మాత్రం పూర్తి సంయమనంతో వ్యవహరిస్తూ ఉగ్రవాదుల అంతానికే ఇన్నాళ్లూ ప్రయత్నిస్తూ వచ్చింది. అందులో భాగంగానే పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి కోసం ఒకవైపు వేట సాగిస్తూనే.. మరోవైపు సరిహద్దుకు ఆవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాక్‌ భూభాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే పాకిస్తాన్‌ మాత్రం సరిహద్దుల్లో ఉన్న భారత ప్రాంతాలు, పౌర అవాసాలపై దాడులకు పాల్పడి 16 మంది సాధారణ పౌరుల మరణానికి కారణమైంది. దాంతో భారత్‌ కూడా ఘాటుగా స్పందించి కరాచీపై దాడి చేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page