top of page

‘ఆన్‌లైన’ రేటింగ్ మాయ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4 hours ago
  • 3 min read

ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం.. మనం విహరిస్తున్నది ఆన్‌లైన్ లోకం. ఇంటర్‌నెట్ పుణ్యాన అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకోగలుగుతున్నాం. కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే చాలా పనులు చేసుకోగలుగుతున్నాం. ఏది కావాలన్నా మన కాళ్ల దగ్గరికే రప్పించుకుంటున్నాం. ఆహారం, ప్రయాణ టికెట్లు, పచారీ సామాన్లను ఇంటికే రప్పించుకుంటున్న మనం.. చివరికి నెలవారీ కట్టాల్సిన కరెంటు, ఫోన్ బిల్లులు, పాలసీల ఈఎంఐలను ఆయా కార్యాలయాలకు వెళ్లకుండానే, క్యూలైన్లలో పడిగాపులు పడకుండానే నిమిషాల్లో చెల్లించేయగలుగుతున్నాం. ఇదే కోవలో షాపింగులు కూడా ఆన్‌లైన్‌లో చేసేయడానికి మెజారిటీ ప్రజలు అలవాటు పడిపోతున్నారు. ఇంతకుముందు షాపింగ్‌కు వెళ్లడం ఒక సరదా.. ఒక కాలక్షేపం.. ఒక వ్యసనం.. నాలుగు షాపులు తిరిగి రకరకాల వెరైటీలు పరిశీలించి, ట్రయల్స్ వేసి చివరికి నచ్చిన వస్త్రాలు, వస్తువులు కొనుక్కుని ఇంటికి వెళితే.. అదో తప్తి ! ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే ముందుంటారు. ఇప్పుడూ ఆది ఉంది. కాకపోతే ఈ షాపింగ్ సరదాను ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ కబళిస్తోంది. ఇది తప్పు కాకపోవచ్చు గానీ.. దీనివల్ల మనం ఆన్‌లైన్ మాయలో పడి చాలా కోల్పోతున్నాం.. ఇందులో కీలకమైనది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత, మన్నిక. ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి ఆన్‌లైన్ షాపింగ్ మాయాజాలంలో చిక్కుకుని మనకు తెలియకుండానే మోసపోతున్నాం. ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపే ముందు ఆయా వస్తువుల రేటింగ్, రివ్యూ తెలుసుకునే వెసులుబాటు ఉంది కదా.. వాటిని చూశాకే కొంటున్నాం కదా! అనుకోవచ్చు. కానీ ఆ రేటింగ్ పేరుతోనే ఆన్‌లైన్ షాపింగ్ వ్యవస్థలు మాయాజాలానికి పాల్పడుతూ వినియోగదారుల జెల్ల కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనడానికి ముందు అందరూ చూసేది సదరు ఉత్పత్తి కింద కనిపించే స్టార్ రేటింగ్. ఎక్కువ స్టార్‌లు ఉంటే ఆ వస్తువు క్వాలిటీ మంచిదని నమ్మేస్తాం. మొబైల్, హెడ్‌ఫోన్స్, గృహోపకరణాలు.. ఏవైనా సరే స్టార్ రేటింగ్ మన కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. కానీ ఇదే అలవాటు వినియోగదారులకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందన్నది వాస్తవం. కానీ దానికి సమాంతరంగా మనకు తెలియని మరో ప్రమాదకర ప్రపంచం సాలెగూడులా మనచుట్టూ అల్లుకుంటోంది. అదే నకిలీ రేటింగ్, నకిలీ సమీక్షల(రివ్యూ) వ్యవస్థ. దాదాపు అన్ని ప్రముఖ ఈ`కామర్స్ ప్లాట్‌ఫారాల్లో వినియోగదారుల అవగాహన కోసం అన్న ముసుగులో పెడుతున్న రేటింగులు, రివ్యూలు నిజమైనవి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ సమీక్షలు ఒకరిద్దరు వ్యక్తులో, సంస్థలో చేసే మోసం కాదు. దీని వెనుక చాలా పెద్ద వ్యవస్థే పని చేస్తోంది. కొంతమంది డబ్బు కోసం సమీక్షలు రాస్తారు. మరికొందరికి ఆయా సంస్థలే తమ ఉత్పత్తులను ఉచితంగా ఇచ్చి సానుకూలంగా రివ్యూలు రాయమని ఒప్పిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి అనేక పేర్లతో ఖాతాలు తెరిచి సమీక్షలు పోస్ట్ చేస్తాడు. తాజాగా కంప్యూటర్ ద్వారా సృష్టించే ఆటోమేటెడ్ సమీక్షలు కూడా ఈ స్కామ్‌లో భాగం కావడం మరింత షాక్ కలిగించే విషయం. రివ్యూ, రేటింగ్ ఇచ్చే విధానాన్ని ఇప్పుడు రివ్యూ ఫార్మింగ్ అని పిలుస్తున్నారు. క్లోజ్డ్ వా{్సప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి కొత్త ఉత్పత్తులను లిస్ట్ చేస్తారు. ఉత్పత్తిని కొనాలి, 5-స్టార్ రేటింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత డబ్బును రీఫండ్ చేస్తారు లేదా మరో ఉత్పత్తిని ఉచితంగా ఇస్తారు. ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఒక ఉత్పత్తిపై వందలాది సానుకూల సమీక్షలు చేరుతాయి. కస్టమర్‌కు ఆ ఉత్పత్తి నమ్మదగినదిగా అనిపిస్తుంది. కానీ ఆ నమ్మకం పూర్తిగా కృత్రిమమైనదనే చెప్పాలి.. నిజాయితీ విక్రేతలకు నష్టం. ఈ నకిలీ రివ్యూలు, రేటింగ్ వ్యవస్థ వల్ల ¹ వినియోగదారులే కాదు.. నిజాయితీగా వ్యాపారం చేసే విక్రేతలు కూడా నష్టపోతున్నారు. నకిలీ సమీక్షలు కొనుగోలు చేయని విక్రేతల ఉత్పత్తులు లిస్టింగ్‌లో వెనుకబడతాయి. మార్కెట్‌లో నిలబడాలంటే ఈ ఆటలో భాగం కావాల్సిందేనని కొందరిపై ఒత్తిడి పెరుగుతోంది. ఉత్పత్తి కొనుగోలు చేసిన తర్వాత సమీక్ష ఇస్తే క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ ఇస్తామని సందేశాలు వస్తుంటాయి. అలా చాలామంది అయిష్టంగానే సానుకూల సమీక్షలు ఇస్తారు. దీంతో ఉత్పత్తి స్టార్ రేటింగ్ కృత్రిమంగా పెరుగుతోంది. ఈ వ్యవహారంపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 56 శాతం వినియోగదారులు ఆన్‌లైన్ సమీక్షలు పక్షపాతపూరితంగా ఉన్నాయని, ప్రతి పదిమందిలో ఆరుగురు రేటింగ్‌లు పూర్తిగా నమ్మశక్యంగా లేవని చెప్పారు. వీటిలో వచ్చే నెగిటివ్ సమీక్షలు కూడా ఎప్పుడో ఒకటీ అరా తప్ప రెగ్యులర్‌గా కనిపించవని సగం మంది వినియోగదారులు అంటున్నారు. అంతా పాజిటివ్ రివ్యూలతో నింపేస్తే జనం నమ్మరని, అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతోనే అప్పుడప్పుడూ నెగిటివ్ రివ్యూలు పెడుతుంటారని వారు అభిప్రాయపడ్డారు. రేటింగ్, రివ్యూ వ్యవస్థ అంతా కత్రిమ సెటప్ అని వినియోగదారుల కేంద్ర వ్యవహారాల శాఖకు అందుతున్న ఫిర్యాదులు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు 2018లో ఈ-కామర్స్ సంస్థలపై 95వేల ఫిర్యాదులు అందాయి. అయితే 2023 నాటికి ఈ ఫిర్యాదుల సంఖ్య 4.44 లక్షలకు ఎగబాకింది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆన్‌లైన్ రివ్యూ, రేటింగ్ కోసం పలు ప్రత్యేక ప్రమాణాలను ప్రవేశపెట్టింది. సమీక్షలు ఎలా సేకరించాలి, ఎలా ధ్రువీకరించాలనే అంశాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. కాగా నకిలీ సమీక్షలు దీర్ఘకాలంలో వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు ఆన్‌లైన్ రివ్యూలను నమ్మిన కస్టమర్లు ఇప్పుడు వాటిని అనుమానంగా చూడటం ప్రారంభించారు. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకున్నా.. ఏదైనా శతి మించితే అసలుకే ఎసరు తప్పదన్న విషయం గమనించాలి. వ్యాపారానికి నమ్మకమే మొదటి పెట్టుబడి. దాన్ని కోల్పోతే.. అంతా కోల్పోయినట్లే.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page