పసిడి దూకుడు.. ఆగదిప్పుడు!
- DV RAMANA

- 2 hours ago
- 3 min read

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధర పరుగులు పెడుతోంది. బుధవారం ఒకేరోజు ఏకంగా రూ. 10వేలు పెరగడం ఆల్ టైం రికార్డ్. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,821కి ఎగబాకింది. మరోవైపు వెండి ధర కూడా పసిడితో పోటీ పడుతూ కేజీ రూ. 3,28,329 పలుకుతోంది. ఈ ధరల పరుగు పోటీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్రేడ్ వార్ కారణమంటున్నారు. ఇప్పుడు తాజాగా యూరప్ దేశాలపైనా సుంకాలు(టారిఫ్‌లు) విధిస్తామని బెదిరిస్తుండటంతో కొన్నాళ్లుగా పెరుగుతున్న పసిడి ధరలు మరింత వేగం పుంజుకున్నాయి. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మొండి పట్టుదలను డెన్మార్క్ సహా మొత్తం తొమ్మిది యూరోపియన్ దేశాలు ఖండిస్తున్నాయి. నాటోలో సభ్యత్వం ఉన్న ఈ దేశాలు సహ సభ్యురాలైన అమెరికా.. కూటమిలో మరో సభ్యురాలైన డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తుండటం సీరియస్‌గా తీసుకున్నాయి. అయితే గ్రీన్‌లాండ్ విషయంలో తన ప్రతిపాదనకు యూరోపియన్ దేశాలు తలొగ్గకపోతే టారిఫ్‌ల మోత మోగిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు, అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను పడగొడుతున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధర లు అదుపు తప్పుతున్నాయి. వెండి కేజీ ధర రూ. 3.30 లక్షలకు చేరవైంది. అమెరికన్ డాలర్ విలువ పతనం అవుతుండటం కూడా బంగారం, వెండి ధరల పరుగులకు కారణం అవుతోందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, బ్రెజిల్ దేశాలు వేలంవెర్రిగా కొనుగోలు చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి వచ్చి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ఏడాది పదవీకాలంలో ఆయన తీసుకున్న అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య విధానాల ఫలితంగా పరుగందుకున్న పసిడి ధరలు ఇప్పట్లో ఆగే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దంలోనే అత్యంత బుల్లిష్ స్థాయికి చేరుకున్న వీటి ధరలు 2026లో మరింతగా పెరిగి కొత్త రికార్డులు నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన అంచనాలు పూర్తిగా తప్పినప్పటికీ ఈసారి మార్కెట్ నిపుణులు మరింత దూకుడైన లక్ష్యాలను ప్రకటించారు. ప్రపంచ బులియన్ మార్కెట్‌లో ప్రముఖమైన అండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) విడుదల చేసిన 2026 అంచనా సర్వే ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసిడి ధర సగటున 40 శాతం పెరుగుదల నమోదు చేయవచ్చు. అదే సమయంలో వెండి వార్షిక సగటు ధర దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు అంచనాలు కూడా 2000 ప్రారంభం నుంచి ఎల్‌బీఎంఏ చేసిన సర్వేల్లో అత్యంత బుల్లిష్ సగటు అంచనాలుగా నిలిచాయి. ఎల్‌బీఎంఏ అంచనా వేయడంలో అత్యంత విజయవంతమైన విశ్లేషకుల్లో ఒకరైన మాజీ బ్యాంకింగ్, రిఫైనింగ్ ఎగ్జిక్యూటివ్ రాస్ నార్మన్ ఈసారి వెలువడిన అంచనాలను వింతైనవిగా అభివర్ణించారు. అయితే తాజా సర్వేలో బంగారంలో ముగ్గురు, వెండిలో ఒకరు, ప్లాటినంలో నలుగురు, పల్లాడియంలో ఇద్దరు విశ్లేషకులు అత్యంత దూకుడైన అంచనాలు వెలువరించారు. ఔన్సు బంగారం ధర సుమారు 4,742 డాలర్లకు చేరుకుంటుందని వీరి అంచనాలు సూచిస్తున్నాయి. 2025తో పోలిస్తే ధర పెరుగుదల 1,310 డాలర్లు అన్నమాట. అయితే గత సంవత్సరం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. 2025 కోసం ఎల్‌బీఎంఏ ప్రకటించిన ఏకాభిప్రాయ అంచనాలు బంగారం ధరలో ఔన్సుకు సుమారు 1,045 డాలర్ల పెరుగుదలను సూచించగా, వాస్తవానికి వచ్చేసరికి అది దాదాపు 700 డాలర్లు తక్కువగా నమోదైంది. డాలర్ పరంగా, శాతం పరంగా ఇది ఎల్‌బీఎంఏ సర్వే చరిత్రలోనే అతిపెద్ద పరాజయంగా మారింది. వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గత ఏడాది వెండి వార్షిక సగటు ధర ఔన్సుకు 40 డాలర్లుగా అంచనా వేసినా వాస్తవ ధర దాదాపు ఎనిమిది డాలర్లు తక్కువగా నమోదైంది. ఇక 2026 సంవత్సరంలో వెండి సగటు ధర దాదాపు 98.8 శాతం పెరిగి ఔన్సు 79.50 డాలర్లకు మించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. మంగళవారం మధ్యాహ్నం లండన్ మార్కెట్‌లో వెండి ఫిక్సింగ్ ధర ఔన్సుకు సుమారు 75.60 డాలర్లుగా ఉండటంతో ఎల్‌బీఎంఏ పోటీలో ఉన్న 26 వెండి అంచనాల్లో తొమ్మిది ఇప్పటికే తమ గరిష్ట అంచనాలను అధిగమించాయి. ఈ ధరల ఉధృతి వెనుక భౌగోళిక, రాజకీయ పరిణామాలు కీలకంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం రాజకీయ నాయకులు, ఫైనాన్షియర్లు, వ్యాపారవర్గాలు 2026లో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద ప్రమాదంగా భౌగోళిక-ఆర్థిక ఘర్షణలను చూస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉండగా బాండ్లు, వస్తువుల ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నాటో మిత్రదేశాల నేతలతో గ్రీన్‌ల్యాండ్ అంశంపై చర్చలు జరపనున్న నేపధ్యంలో యూరప్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య గత 12 నెలల్లో బంగారం ధరలు 75 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇది 1973లో రిచర్డ్ నిక్సన్ రెండో పదవీకాలం తర్వాత కనిపించిన అతిపెద్ద వార్షిక పెరుగుదలగా మార్కెట్ చరిత్రలో నిలిచింది. ఎల్‌బీఎంఏ 2026 అంచనాల ప్రకారం, బంగారం ధరల ట్రేడింగ్ పరిధి కనిష్టంగా ఔన్సుకు 3,450 డాలర్ల నుంచి గరిష్టంగా 7,150 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. వెండిలో ఈ పరిధి ఇంకా విస్తృతంగా ఉండగా కనిష్ట అంచనా 42 డాలర్లుగా, గరిష్ట అంచనా 165 డాలర్లుగా నమోదైంది. ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది భవిష్యత్తు తేల్చాల్సి ఉన్నా.. ప్రస్తుత మార్కెట్ భావన మాత్రం విలువైన లోహాలపై అపూర్వమైన బుల్లిష్ ధోరణి స్పష్టంగా చూపిస్తోంది. అందువల్ల పెట్టుబడులు, కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.










Comments