top of page

ఎత్తుకు పై ఎత్తుల కథ!

  • Guest Writer
  • May 30
  • 2 min read
ree

తాడిని (తాటిని) తన్నేవాడుంటే వాడిని తలదన్నే వాడు ఉంటాడు అనే సూత్రం మీద ఆధారపడి ఉన్న ఎత్తులు , ఎత్తుకుపైఎత్తుల కధ ఈ ఛాలెంజ్‌ సినిమా కధ. అప్పటికే వీర పాపులరయిన యండమూరి వీరేంద్రనాధ్‌ గారి డబ్బు టుది పవరాఫ్‌ డబ్బు నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. 40ఏళ్ళ తర్వాత కూడా సినిమా పాతబడలేదు. ఇప్పుడు తీసిన సమకాలీన సినిమా లాగానే ఉంటుంది.

యండమూరి గారు సృష్టించిన పాత్రలకు ఇంకా ఎక్కువ నగిషీ పెట్టారు స్క్రీన్‌ప్లే రైటర్‌ సాయినాధ్‌ గారు. సూపర్‌ఫాస్ట్‌ రైలు లాగా ఉరకటానికి కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం ఎంత కారణమో, అంతే ఘనత సాయినాథ్‌ గారి స్క్రీన్‌ప్లేది కూడా. ఆ తర్వాత సత్యమూర్తి గారి డైలాగ్స్‌. ఏకే 47 నుండి వచ్చే తూటాల్లాగా దూసుకు వస్తాయి. సినిమాలోని ఎత్తుకుపైఎత్తులకు ధీటైన వ్యక్తీకరణ డైలాగులు. ఆ రెండిరటినీ సమన్వయం చేయడం కష్టమే. అయినా సత్యమూర్తిగారు చాలా పదునైన డైలాగులను వ్రాసి సక్సెస్‌ అయ్యారు.

తర్వాత పాటలు. వాటిని వ్రాసిన వేటూరి వారిని, డాన్సులను కంపోజ్‌ చేసిన తారను, సంగీతాన్ని స్వరపరచిన ఇళయరాజాని అభినందించాలి. బ్రహ్మాండమయిన మ్యూజిక్‌ ఇళయరాజా గారిది. నాకయితే వీర నచ్చింది చిరంజీవి, సిల్క్‌స్మిత పాట, డాన్స్‌. ఖైదీ సినిమాలో రగులుతుంది మొగలి పొదే గుర్తుకొస్తుంది. ఆ పాటలో చిరంజీవి గుర్రం మీద ఎంట్రీని కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు. మనసే మైకం పాట.

మిగిలిన అన్ని డ్యూయెట్లు చిరంజీవి, విజయశాంతి, సుహాసిని అదరగొట్టేసారు. ఇందువదన కుందరదన మందగమన పాటలో ఐ లవ్యూ హారికా కుర్రాళ్ళు బాగానే పాడేవాళ్ళు. కుందరదన అంటే ఏంటో!? సాయంకాలం సాగరతీరం, భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికయినా, ఓం శాంతి ఓం శాంతి డ్యూయెట్లు సినిమా ఘన విజయానికి ప్రధాన కారణాలలో ముఖ్యమయినవి.

చిరంజీవి నటనతో ధీటుగా రావు గోపాలరావు, విజయశాంతి, సుహాసినిలు పోటీపడ్డారు. సుహాసిని, విజయశాంతి పాత్రలను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. తర్వాత చెప్పుకోవలసింది గొల్లపూడి మారుతీరావు, సిల్క్‌స్మితల జంట. పనిగండం పేరుతో ఏ పని చేయకుండా, ఓకవేళ చేసినా సున్నప్పిడత పనులు చేసే బతుకు. ప్రతి డైలాగుకు ఆఫ్‌ ఇండియా అనే ట్యాగ్‌లైన్‌ తగిలిస్తూ మాట్లాడే గొల్లపూడి డైలాగులు, డైలాగ్స్‌ డెలివరీ సినిమాకు హైలైటే. డాన్సులకే పరిమితమయ్యే సిల్క్‌ స్మితకు సినిమా అంతా ఉండే మంచి పాత్ర లభించింది. చక్కగా పోషించింది. ఇతర ప్రధాన పాత్రల్లో సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రభృతులు నటించారు.

సాధారణంగా యండమూరి నవలలు చదరంగం ఆట లాగా ఉంటాయి. యక్ష ప్రశ్నలు, క్విజ్‌ పోటీల్లాగా ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి డైలాగులు పుష్కలం. ఆవేశంలో కూతుర్నే పందెం కాసిన తండ్రితో మహాభారతంలో ధర్మరాజు భార్యను ఎలా పందెం కాసాడో అర్థం అవుతుందనే కూతురి డైలాగ్‌ ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది. వ్యాపారంలో కట్టుకున్న దానిని కూడా నమ్మకూడదనే వ్యాపార సూక్తి. న్యాయబద్ధత I చట్టబద్ధత డిబేట్‌. ఆర్ధిక, సామాజిక, రాజకీయ నేరాలు చేయటం అన్యాయం. ప్రాసిక్యూషన్‌ వైఫల్య సహాయంతో శిక్ష తప్పించుకోవటం చట్టబద్ధత. ఇదే మన దేశ సమకాలీన సంస్కృతి కదా!

14 సెంటర్లలో వంద రోజులు ఆడటమే కాదు, కనక వర్షం కూరిపించింది. సుందర విశాఖపట్టణంలో తీస్తే సినిమాలు సక్సెస్‌ కావాల్సిందే. నిర్మాత కెయస్‌.రామారావు, దర్శకుడు కోదండరామిరెడ్డి, చిరంజీవి, యండమూరి కాంబినేషన్‌ సూపర్‌ కాంబినేషన్‌ అయింది ఈ సినిమాతో. ఈతరంలో కూడా ఈ సినిమా చూడని వారు ఎవరూ ఉండరేమో! ఎవరయినా ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయవచ్చు. యూట్యూబులో ఉంది. తలచుకుంటే ఛాలెంజుగా తీసుకుని యువతరం ఏదయినా సాధించగలదనే సందేశాన్ని ఇస్తుంది సినిమా.

- సుబ్రమణ్యం దోగిపర్తి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page