ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
- BAGADI NARAYANARAO

- Feb 10
- 1 min read
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు
ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు
అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివేళ అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు ఆ విభాగంలో ఓపీ ఇవ్వడానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమ్స్‌కు రాత్రివేళల్లోనే అధికశాతం ఎమర్జెన్సీ కేసులు వస్తుంటారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా ఆ కేసులను స్థానిక ఆస్పత్రులవారు రిమ్స్‌కు రిఫర్ చేస్తుంటారు. వీటితో పాటు ఆత్మహత్యాయత్నం కేసులు, అత్యవసర చికిత్స అవసరమయ్యే కేసులను ఇక్కడికే తీసుకొస్తుంటారు. ఇలా వచ్చే రోగులను ఇన్‌పేషెంట్లుగానే చేర్చుకుంటారు. వీరిని అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో చేర్చి అత్యవసర ప్రాథమిక చికిత్స ఇచ్చినా తర్వాత ఓపీలో చీటీ తీసుకోవాలి. ఓపీ చీటి జనరేట్ అయిన తర్వాతే రెగ్యులర్ ట్రీట్‌మెంట్ మొదలుపెడతారు. అయితే ఎమర్జెన్సీ విభాగంలో ఒకే ఉద్యోగి ఓపీ చీటీ ఇచ్చే విధుల్లో ఉంటున్నారు. ఆ ఉద్యోగి సమయానికి ఎమర్జెన్సీ విభాగంలో అందుబాటులో లేకపోతే రోగులు చుక్కలు చూడాల్సిన పరిస్థితి.

వాస్తవానికి ఎమర్జెన్సీ ఓపీ విభాగంలో రెగ్యులర్ ఉద్యోగితో సహా ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు మూడు షిప్ట్‌ల్లో పని చేస్తుంటారు. ఎవరైనా ఒకరు సెలవుపై వెళితే ఆ విధులను రెగ్యులర్ ఉద్యోగికి అప్పగిస్తారు. ఆ ఉద్యోగి పగటిపూట మాత్రమే అందుబాటులో ఉంటారు. రాత్రి వేళలో కేవలం ఒక్కరే ఎమర్జెన్సీ కేసులకు ఓపీ రాసే విధుల్లో ఉంటారు. రాత్రివేళల్లో ఎక్కువ ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి కనుక ఇద్దరు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. విధుల్లో ఉన్న ఒక్కరూ ఓపీలో ఉండకుండా వేరోచోట విశ్రాంతి తీసుకుంటుంటారు. రోగుల బంధువులు సెక్యూరిటీ సహాయంతో సదరు ఉద్యోగిని పిలిపించి ఓపీ చీటీ రాయించుకుంటున్నారు. ఈ విషయంలో తెలియక నేరుగా ఓపీ కోసం వెళ్లి అక్కడ సదరు ఉద్యోగి కనిపించకపోతే ఎవరూ లేరని అత్యవసర విభాగంలో వైద్యులకు ఫిర్యాదు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఓపీలో విధుల్లో ఒక్క ఉద్యోగే ఉండటం ఇబ్బందికరమేనని మిగతా ఉద్యోగులు కూడా చెబుతున్నారు. రాత్రివేళ ఎక్కువ అత్యవసర కేసులు వచ్చే ఎమర్జెన్సీ ఓపీ విభాగంలో తగినంతమంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.






Comments