top of page

ఏస్‌.. సోసో థ్రిల్లర్‌

  • Guest Writer
  • May 24
  • 3 min read

ఓవైపు క్యారెక్టర్‌.. విలన్‌ పాత్రలతో అలరిస్తూనే అప్పుడప్పుడూ హీరోగానూ మెరుస్తుంటాడు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. గత ఏడాది అతడి నుంచి వచ్చిన ‘మహారాజా’ ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడతను కథానాయకుడిగా ‘ఏస్‌’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం...

ree

కథ:

బోల్ట్‌ కాశి (విజయ్‌ సేతుపతి) ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడ తనకు తగ్గ పని కోసం చూస్తుంటాడు. అతడికి అనుకోకుండా పరిచయం అయిన రుక్మిణి (రుక్మిణి వసంత్‌)తో అతను ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత రుక్మిణి కూడా అతణ్ని ఇష్టపడుతుంది. ఓ సమస్యలో ఉన్న రుక్మిణిని ఆదుకోవడం కోసం పేకాట ఆడిన కాశి.. కోటి రూపాయల బకాయి పడతాడు. ఆ అప్పు తీర్చడానికి ఇంకా పెద్ద రిస్క్‌ చేయడానికి సిద్ధపడతాడు కాశి. ఇంతకీ అతను చేయాలనుకున్న రిస్క్‌ ఏంటి.. ఆ పని విజయవంతంగా పూర్తి చేశాడా.. తనతో పాటు రుక్మిణి సమస్య తీరిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మామూలు పాత్రలను కూడా తన పెర్ఫామెన్సుతో ప్రత్యేకంగా మార్చే నటుడు విజయ్‌ సేతుపతి. తనకు మంచి పాత్ర.. విషయం ఉన్న కథ పడితే ఆ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లిపోతాడు. ‘మహారాజా’ సినిమాలో అదే జరిగింది. పేపర్‌ మీద చూస్తే ‘ఏస్‌’ కథ.. సేతుపతి పాత్ర కూడా ఆసక్తికరంగానే అనిపిస్తాయి. బతుకు తెరువు కోసం వేరే దేశానికి వెళ్లి వ్యక్తి.. ఒక సమస్య నుంచి బయటపడ్డానికి తప్పు చేసి.. ఆ తర్వాత దాన్ని కవర్‌ చేయడానికి ఇంకా పెద్ద తప్పు చేసి పెద్ద విష వలయంలో చిక్కుకోవడం.. చివరికి తన తెలివితేటలు ఉపయోగించి మొత్తం సమస్య నుంచి బయటపడడం.. ఇదీ స్థూలంగా ‘ఏస్‌’ కథ. చిన్న నిప్పు రవ్వతో మొదలై పెద్ద కార్చిచ్చుగా మారడం.. ఈ లైన్లో నడిచే స్టోరీ ప్రేక్షకుల్లో కొంత క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. కానీ ఎగుడు దిగుడుగా సాగే కథనం వల్ల ‘ఏస్‌’ పూర్తి సంతృప్తినిచ్చే సినిమాగా రూపుదిద్దుకోలేకపోయింది. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా.. అంతిమంగా మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.

‘ఏస్‌’ క్రైమ్‌ ఎలిమెంట్స్‌ చుట్టూ తిరిగే కథ. ఇందులో హీరో పెద్ద దొంగతనం చేస్తాడు. అతణ్ని పట్టుకోవడానికి ఇటు పోలీసులు.. అటు రౌడీ గ్యాంగులు ప్రయత్నిస్తుండగా క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌ లాగా సినిమా నడుస్తుంది. ఐతే మలేషియా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో పట్ట పగలు ఏటీఎంలో డబ్బులు నింపే వాహనం నుంచి హీరో కోట్ల రూపాయలు కొట్టేస్తాడు. అత్యున్నత స్థాయి పోలీస్‌ విభాగం, అధునాత టెక్నాలజీ ఉండి కూడా అతణ్ని పట్టుకోలేకపోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది. కథలో అత్యంత కీలకమైన ఇలాంటి ఎపిసోడ్లు తీసేటపుడు.. సన్నివేశాలు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. తెర మీద జరిగేదంతా ప్రేక్షకులకు కన్విన్సింగ్‌ గా అనిపించాలి. కానీ ఈ సినిమాలో అవే మిస్‌ అయ్యాయి. హీరో చాలా సింపుల్‌ గా దొంగతనం చేసేస్తాడు. అంతే సింపుల్‌ గా పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. తన కోసం పోలీసులు పెద్ద ఎత్తున వెతుకుతున్నా.. ఓ దశలో అడ్డంగా దొరికిపోయినా.. తనలో రవ్వంతైనా టెన్షన్‌ కనిపించదు. అలా అని అతను వేసే ప్లాన్లు ఏమైనా అద్భుతంగా ఉంటాయా అంటే అదీ లేదు. గాలి వాటంగా ఏదో చేసుకుపోతుంటాడు. ఇలా కన్వీనియెంట్‌ గా సన్నివేశాలు రాసుకోవడంతో ‘ఏస్‌’ ఇంపాక్ట్‌ తగ్గిపోయింది. కానీ సేతుపతి మాత్రం తన పెర్ఫామెన్సుతో వీలైనంతగా ఎంగేజ్‌ చేయడానికి ప్రయత్నించాడు. తనతో ముడిపడ్డ కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగడంతో సినిమా మరీ బోర్‌ అయితే కొట్టించదు.

ఓవరాల్‌ గా ‘ఏస్‌’ ఇంపాక్ట్‌ తగ్గినా.. కొన్ని ఎపిసోడ్ల వరకు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే పేకాట ఎపిసోడ్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ ఎపిసోడ్లో ఉన్న ఉత్కంఠకు తోడు.. యోగిబాబు కామెడీ ఆకట్టుకుంటాయి. ఆరంభ సన్నివేశాలు సాధారణంగా అనిపించినా.. ఈ ఎపిసోడ్‌ దగ్గర కథనం ఊపందుకుంటుంది. ఆ తర్వాత కథలో అనేక మలుపులు వస్తాయి. దొంగతనం ఎపిసోడ్‌ అంత కన్విన్సింగ్‌ గా లేకపోయినా.. చివరి అరగంటలో రేసీగా సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్సే సినిమాకు బలం. ఆఖర్లో హీరో ఆడే గేమ్‌ ప్రేక్షకులకు కిక్కిస్తుంది. చివరికి హీరో గెలుస్తాడు అన్నది కామనే అయినా.. ఇక్కడ కూడా కన్వీనియెంట్‌ గా సన్నివేశాలను రాసుకున్నా.. క్లైమాక్స్‌ మెప్పిస్తుంది. దర్శకుడు ఆఖర్లో చూపించిన షార్ప్‌ నెస్‌.. కథనంలో వేగం ముందు కూడా ఉండి ఉంటే ‘ఏస్‌’ జనరంజకమైన సినిమా అయ్యుండేది. రెండున్నర గంటలు ఏదో అలా టైంపాస్‌ చేయాలనుకుంటే.. విజయ్‌ సేతుపతి పెర్ఫామెన్స్‌ చూడాలనుకుంటే ‘ఏస్‌’పై ఓ లుక్కేయొచ్చు కానీ.. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

సేతుపతి నటనకు వంకలు పెట్టడానికేమీ లేదు. బలహీనమైన కథను వీలైనంత మేర నిలబెట్టడానికి అతను కృషి చేశాడు. ఎక్కువ హడావుడి చేయకుండానే ప్రభావవంతంగా నటిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్‌ చేశాడు సేతుపతి. హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ ఓకే. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో బాగా నటించింది. యోగిబాబు కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్‌. తన మార్కు నటనతో నవ్వించాడు. దివ్యా పిళ్ళై కూడా బాగానే చేసింది. సీనియర్‌ నటుడు పృథ్వీ పాత్ర గందరగోళంగా అనిపిస్తుంది. ఆ పాత్రను సరిగా తీర్చిదిద్దలేదు. తన నటన పర్వాలేదు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అవినాష్‌.. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్‌ గా ‘ఏస్‌’ ఏమంత గొప్పగా అనిపించదు. సామ్‌ సీఎస్‌ పాటలు పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాలను కొంతమేర ఎలివేట్‌ చేసింది. కరణ్‌ రావత్‌ సినిమాటోగ్రఫీలో మెరుపులేమీ లేవు. నిర్మాణ విలువలు పర్వాలేదు. శ్రీ పద్మిని సినిమాస్‌ బి. శివ ప్రసాద్‌ తెలుగు లో రిలీజ్‌ చేసారు . రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఆర్ముగ కుమార్‌ రాసుకున్న కథలో విషయం ఉన్నా.. దాన్ని తెర మీద సరిగా ఎగ్జిక్యూట్‌ చేయలేకపోయాడు. థ్రిల్లర్‌ కథలకు రేసీ స్క్రీన్‌ ప్లే.. పకడ్బందీ సీన్లు ఉంటేనే పండుతాయి. ఆర్ముగ కుమార్‌ చాలా వరకు కన్వీనియెంట్‌ రైటింగ్‌ తో సినిమా గ్రాఫ్‌ తగ్గించేశాడు. కొన్ని ఎపిసోడ్ల వరకు అతను మెప్పించినా.. ఓవరాల్‌ గా అతడికి యావరేజ్‌ మార్కులే పడతాయి.

-తుపాకీ డాట్‌ కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page