ఐపీఎల్‌లో సరికొత్త ‘మాస్’ సెలబ్రేషన్స్
- SATYAM DAILY
- 5 days ago
- 2 min read
మైదానంలో ‘చిట్టీల’ జాతర..!

క్రికెట్ మైదానంలో వికెట్ పడగానే బౌలర్లు రకరకాలుగా సంబరాలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఒకప్పుడు కేవలం గాల్లోకి ఎగరడం, గట్టిగా అరవడం మాత్రమే ఉండేది. కానీ కాలం మారింది. సినిమా హీరోల మేనరిజమ్స్, పుష్ప స్టైల్ తగ్గేదేలే సెలబ్రేషన్స్, క్రిస్ గేల్ ‘గంగ్నమ్ స్టైల్’, బ్రావో డాన్సులు, షెల్డన్ కాట్రెల్ ‘సెల్యూట్’.. ఇలా ఎన్నో ట్రెండ్‌లు చూశాం. అయితే ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ పేసర్ ఆకాశ్ సింగ్ వీటన్నింటికీ భిన్నంగా, ఒక సరికొత్త ‘చిట్’ (చీటీ) సెలబ్రేషన్‌తో అభిమానుల ముందుకు వచ్చాడు.
నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లెఫ్టఆర్మ్ పేసర్ వికెట్లు తీసిన విధానం ఒకెత్తయితే, ఆ తర్వాత జేబులోంచి ‘చిట్టీ’ తీసి చూపించిన విధానం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పరీక్ష హాల్‌లో కాపీయింగ్ గుర్తొచ్చిన వేళ..!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టును ఆకాశ్ సింగ్ తన పవర్‌ప్లే బౌలింగ్‌తో వణికించాడు. ప్రమాదకరమైన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేయగానే, ఆకాశ్ నెమ్మదిగా తన జేబులో చేయి పెట్టాడు. ఏదో సీక్రెట్ ప్లాన్ పేపర్ తీస్తున్నాడేమో అనుకుంటే.. ఒక మడతపెట్టిన కాగితాన్ని తెరిచి కెమెరాల వైపు చూపించాడు. అందులో ‘అక్కి ఆన్ ఫైర్ - టి20 గేమ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’ అని రాసి ఉంది. ఆ తర్వాత సంజూ శాంసన్ వికెట్ పడగానే కూడా మళ్లీ అదే చిట్టీ బయటకు వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన క్రీడాభిమానులకు చదువుకునే రోజుల్లో ఎగ్జామ్ హాల్‌లోకి దొంగతనంగా చిట్టీలు పట్టుకెళ్లే బ్యాచ్ గుర్తొచ్చింది. పరీక్షల్లో పాస్ అవ్వడానికి స్టూడెంట్స్ చిట్టీలు రాస్తే.. ఇక్కడ బ్యాటర్లను ఫెయిల్ (అవుట్) చేయడానికి బౌలర్ చిట్టీలు రాయడం విశేషం.
ఇలాంటి వింతలు కొత్తేమీ కాదు..
మైదానంలో ప్రణాళికల కోసం చీటీలు వాడటం క్రీడా ప్రపంచంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫుట్‌బాల్ మ్యాచుల్లో పెనాల్టీ కిక్స్ సమయంలో ఏ ప్లేయర్ ఎటువైపు షాట్ కొడతాడోననే సీక్రెట్ డేటాను గోల్ కీపర్లు తమ వాటర్ బాటిల్స్‌కో, లేదా చిన్న కాగితంపై రాసుకుని సాక్స్‌లోనో దాచుకునేవారు. అయితే, అవి వ్యూహాల కోసం వాడే చిట్టీలు. కానీ ఆకాశ్ సింగ్ చేసింది మాత్రం ముందస్తుగా రాసుకున్న ఒక ‘సెల్ఫ్ డబ్బా’ (ఆత్మవిశ్వాస) ప్రదర్శన. తాను వికెట్ తీస్తానని ముందే ఊహించి, ఆ స్క్రిప్ట్‌ను కాగితంపై రాసుకుని రావడం క్రికెట్ చరిత్రలోనే ఒక వింతైన మేనరిజం.
ఇది వినోదమా? విడ్డూరమా?
ఈ సరికొత్త సంబరాలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు దీనిని ‘లా ఆఫ్ అట్రాక్షన’ లేదా ‘మేనిఫెస్టేషన్ ’ (తాను అనుకున్నది సాధిస్తానని బలంగా నమ్మడం) అని కొనియాడుతున్నారు. మైదానంలో ఇలాంటి వినోదం ఐపీఎల్ సరదాను మరింత పెంచుతుందని నవ్వుకుంటున్నారు. మరికొందరు క్రీడా విశ్లేషకులు మాత్రం ఇది కాస్త అతిగా ఉందంటున్నారు. ‘క్రికెట్ అనేది పెద్దల ఆట (జెంటిల్‌మెన్స్ గేమ్). ఇక్కడ ప్రదర్శన మాట్లాడాలి కానీ, ఇలా జేబుల్లోంచి కాగితాలు తీసి చూపించడం ఎగ్జామినేషన్ హాల్ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు ఉంది. ఇలాంటి నాన్సెన్స్ ట్రెండ్స్‌ను ఐసీసీ మైదానంలో నిషేధించాలి’ అని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా, తన మొదటి మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్లు తీసి లక్నో జట్టుకు విజయావకాశాలు అందించిన ఆకాశ్ సింగ్.. తన బౌలింగ్‌తోనే కాకుండా ఈ ‘చిట్టీల జాతర’తో కూడా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.
- సత్యం స్పోర్ట్స్ డెస్క్






Comments