ముంబై ‘వర్మ’ మంత్రం.. రోహిత్‌పై మమకారం!
- SATYAM DAILY
- 5 hours ago
- 1 min read

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యువ సంచలనం తిలక్ వర్మ (33 బంతుల్లో 75 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో వెన్నెముకగా నిలిచాడు.
విజయం అనంతరం తిలక్ వర్మ చేసిన ఒక సంకేతం ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశ మైంది. మ్యాచ్ ముగిసిన వెంటనే క్రీడాకారులు కూర్చునే స్టాండ్ వైపు చూస్తూ తిలక్ తన వేళ్లతో ‘నెం. 45’ అని సైగ చేశాడు. ముంబై వెటరన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ నంబర్ 45 అన్న సంగతి తెలిసిందే. తన అద్భుత ఇన్నింగ్స్‌ను రోహిత్‌కు అంకితం ఇస్తూ తిలక్ చేసిన ఈ పనికి రోహిత్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోకి వచ్చిన రోహిత్, తిలక్‌ను ఆత్మీయంగా హత్తుకొని అభినందించడం అభిమానులను ఆకట్టుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఇప్పటికే నిష్క్రమించినప్పటికీ, ముంబై ఇండియన్స్ పోరాట పటిమను ప్రదర్శిస్తోంది.
మెరుపు దాడి.. అదిరిపోయే ఛేజింగ్
పంజాబ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.5 ఓవర్లలోనే ఛేదించింది. మొదట షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (20)తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తిలక్, ఆ తర్వాత విల్ జాక్స్‌తో జతకట్టి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
బాధ్యతను ఆస్వాదిస్తున్నా: తిలక్ వర్మ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తిలక్ మాట్లాడుతూ.. “మ్యాచ్‌లను ఫినిష్ చేయడం నాకు చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఇక్కడ నాకు ఎంతో తోడ్పడింది. వికెట్ నెమ్మదిగా ఉన్నప్పటికీ, నాపై నేను నమ్మకంతో ఆడాను. విల్ జాక్స్ ఇన్నింగ్స్ కూడా నాకు చాలా సహాయపడింది” అని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ తన తదుపరి పోరులో మే 20న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.
- సత్యం స్పోర్ట్స్ డెస్క్






Comments